old pension policy | పెద్దపల్లి, సెప్టెంబర్ 1: సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మహేశ్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయటంలో ఉద్యోగుల పాత్ర కీలకమని, ఉద్యోగుల సంక్షేమాన్ని ప్రభుత్వం పట్టించుకోవాలని హితవు పలికారు. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ, రాష్ర్ట రెవెన్యూ ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు కలెక్టరేట్ ఎదుట సోమవారం ఉద్యోగులు నిరసన చేపట్టారు. సీపీఎస్ రద్దు చేయాలని, ఓపీఎస్ అమలు చేయాలని నినాదించారు.
అనంతరం రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మాట్లాడారు. ఉద్యోగుల పాలిట శాపంగా మారిన సీపీఎస్‌ను రద్దు చేయాలన్నారు. ఉద్యోగుల భద్రతను దృష్టిలో పెట్టుకోని పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా జనరల్ సెక్రటరీ సుమన్, ట్రెజరర్ రాజిరెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ సంతోష్ సింగ్, రెవెన్యూ, ఇతర శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు