మారుతీనగర్, అక్టోబర్ 12: వీధి కుక్కల సంచారం రోజు రోజుకూ పెరుగుతోంది. ఎక్కడ చూసినా గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ప్రధాన రహదారులు, కాలనీల్లో కుక్కలు గుంపులు గుంపులగా తిరిగి ద్విచక్ర వాహనదారులు, పాదచారుల వెంటపడుతున్నాయి. ఒంటరిగా వెళ్తే దాడి చేసి గాయపరుస్తుండడంతో మెట్పల్లి పట్టణ వాసులు ఆందోళన చెందుతున్నారు.
వీటి సంతతి పెరగకుండా చర్యలు చేపట్టాల్సిన మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఆయా కాలనీల్లో కూడళ్ల వద్ద వీధి కుక్కల గుంపులు తిష్టవేయడంతో భయానికి ఎవరైనా తోడు లేనిదే బయటకి వెళ్లలేని పరిస్థితి నెలకొన్నది. అధికారులు ఇప్పటికైనా స్పందించి కుక్కల బెడద నుంచి కాపాడాలని పట్టణవాసులు కోరుతున్నారు.