దాదాపు రెండేళ్లుగా ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్న పంచాయతీలకు పాలకవర్గాలు రాబోతున్నాయి. నేడు గ్రామ పంచాయతీల్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాయి. సర్పంచ్ సహా ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనుండగా, మెజార్టీ గ్రామాల్లో సమస్యలు స్వాగతం పలుకనున్నాయి. 22 నెలలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రాక ప్రగతి పనులు కుంటుపడ్డాయి. ఇక ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు.. అభివృద్ధి పనులు ప్రథమ పౌరులకు సవాల్‌గా నిలువనున్నాయి.
కరీంనగర్, డిసెంబర్ 21(నమస్తే తెలంగాణ)/ జమ్మికుంట/ గంగాధర : గ్రామ పంచాయతీలకు కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులతో సోమవారం పంచాయతీ కార్యదర్శులు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం ఇప్పటి వరకు గ్రామ పంచాయతీలకు ప్రత్యేకాధికారులుగా వ్యవహరిస్తున్న అధికారులు సర్పంచులకు బాధ్యతలు అప్పగించనున్నారు. ఉమ్మడి జిల్లాలోని 1,222 పంచాయతీలకు మూడు విడుతల్లో (ఈ నెల 11, 14, 17తేదీలు) ఎన్నికలు నిర్వహించారు. అదే రోజు ఫలితాలను ప్రకటించారు.
కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులతో సోమవారం ఆయా పంచాయతీ కార్యదర్శులు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఉదయం 11 గంటలకు అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయించాలని ప్రభుత్వ పరంగా ఆదేశాలు ఉన్నాయి. అయితే, కొందరు సర్పంచులు వారికి అనుకూలమైన సమయాల్లో ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రమాణ స్వీకార మహోత్సవానికి అన్ని గ్రామ పంచాయతీ లు ముస్తాబయ్యాయి. కొందరు సర్పంచులు పంచాయతీ భవనాలకు సొంత డబ్బులతో రంగులు వేయించుకుంటున్నారు. కుర్చీలు కూడా కొత్తవి తెప్పించుకుంటున్నారు. కాగా, అధికారులు మాత్రం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేశారు.
ప్రమాణమే ప్రామాణికం
కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు ప్రమాణ స్వీకారాన్నే ప్రామాణికంగా గుర్తిస్తారు. మూడు విడతల్లో ఎన్నికలు జరిగినప్పటికీ ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి పాలకవర్గాల కాల పరిమితిని లెక్కిస్తారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే సాంకేతికంగా పాలకవర్గాలు అధికారం పొందుతారని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం చెబుతున్నది. మూడు విడతల్లో జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన వారికి ప్రిసైడింగ్ అధికారులు గుర్తింపు పత్రాన్ని మాత్రమే ఇస్తారు. ప్రమాణ స్వీకారం కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఎజెండా రిజిస్ట్రార్‌లో నమోదు చేస్తారు. అనంతం సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం తర్వాత రిజిస్ట్రార్‌లో సంతకాలు చేసిన తర్వాతనే వారిని పాలకవర్గాలుగా గుర్తిస్తారు. ఈరోజు నుంచే పదవీ కాలం లెక్కలోకి వస్తుంది.
స్వాగతం పలుకుతున్న సమస్యలు
కొత్తగా కొలువుదీరుతున్న పంచాయతీ పాలకవర్గాలకు గ్రామాల్లోని సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. దాదాపు రెండేళ్లుగా పంచాయతీలు ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. శనివారంతో ప్రత్యేక అధికారుల పాలన ముగిసి కొత్త పాలకవర్గాలు అధికారంలోకి వస్తున్నాయి. 2024 ఫిబ్రవరి 2తో గత పాలకవర్గాల పదవీ కాలం ముగిసింది. సకాలంలో ఎన్నికలు నిర్వహించని కారణంగా ప్రత్యేకాధికారులకు పంచాయతీల బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి 22 నెలలుగా వారి పాలనలోనే పంచాయతీలు కొనసాగుతున్నాయి. ఇంతకాలం పాలకవర్గాలు లేక పోవడంతో గ్రామాల్లో అనేక సమస్యలు పేరుకుపోయాయి. చెత్త నిర్వహణ కొరవడింది.
తాగునీటి సమస్యలు మొదలయ్యాయి. వీధి దీపాల కోసం వాడుకుంటున్న విద్యుత్ బిల్లులు పేరుకుపోయాయి. ఎన్నికలు సకాలంలో నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి వచ్చే నిధులు నిలిచి పోయాయి. రాష్ట్రం కూడా తన వాటా నిధులను ఇవ్వలేక పోయింది. పేరుకే ప్రత్యేకాధికారులు ఉన్నప్పటికీ పంచాయతీల నిర్వహణ భారమంతా కార్యదర్శులు మోయకతప్ప లేదు. పంచాయతీ కార్యదర్శులు కూడా తమకు సాధ్యమైనంత వరకు నెట్టుకొచ్చారు. చాలా మంది అప్పుల పాలయ్యారు. కొత్త పాలకవర్గాల ప్రమాణ స్వీకారంతో కార్యదర్శులకు ఇబ్బందులు తప్పనుండగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు విడుదలైతేగానీ పంచాయతీల సమస్యలు పరిష్కరించడం సాధ్యమయ్యేపని కాదని పలువురు స్పష్టం చేస్తున్నారు.
సర్పంచ్ విధులు, బాధ్యతలు..
సర్పంచ్‌ను గ్రామ ప్రథమ పౌరుడు/ పౌరురాలిగా పరిగణిస్తారు. ఐదేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. పాలకవర్గం సమావేశానికి, గ్రామసభకు అధ్యక్షత వహిస్తారు. నెలకు గౌరవ వేతనంగా 6500 ప్రభుత్వం అందజేస్తుంది. ప్రతి రెండు నెలలకోసారి పంచాయతీ పాలకవర్గ సమావేశం ఏర్పా టు చేయాలి. అదే విధంగా ఏడాదికి రెండు సార్లు అంటే.. ప్రతి ఆరు నెలలకోసారి (అక్టోబర్ 2, ఏప్రిల్ 24) గ్రామ సభను విధిగా నిర్వహించాలి. ఈ సభకు ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, వికలాంగులు, అణగారిన వర్గాల అభ్యున్నతి, మౌలిక వసతుల కల్పనపై చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి.
పంచాయతీ కార్యాలయంలో రికార్డులను తనిఖీ, సంబంధిత సమాచారం తీసుకోవాలి
పంచాయతీ సభ్యులు ఎవరైనా అనర్హతకు గురైతే పంచాయతీ జిల్లా అధికారికి సమాచారం ఇవ్వాలి
పంచాయతీ కార్యదర్శి పాలన, కార్యనిర్వహణపై నియంత్రణ ఉండాలి
పంచాయతీకి ఆదాయ వనరుల పెంపు, వాణిజ్య సముదాయాలు ఇతరత్రా వాటి ద్వారా ఆదాయం పెంచేందుకు కృషి చేయాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులను గ్రామ అభివృద్ధి కోసం పాలకవర్గాల తీర్మానాలతో వెచ్చించాలి
అవినీతి రహితంగా పారదర్శకంగా తన పాలనను అందించాలి
ఏదైనా అవినీతికి పాల్పడినా, గ్రామ సభలు నిర్వహించక పోయినా స్పష్టమైన ఆధారాలుంటే సర్పంచ్‌ను తొలగించే అధికారం కలెక్టర్‌కు ఉంటుంది.
అత్యవసర అధికారాలు..
అత్యవసర పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకునే అధికారం సర్పంచ్‌కు ఉంటుంది. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు, ఇతరత్రా గ్రామానికి సంబంధించి అత్యవసర పరిస్థితుల్లో విచక్షణ అధికారాలను కలిగి ఉంటారు.
ఉప సర్పంచ్ విధులు, బాధ్యతలు..
సర్పంచ్ అందుబాటులో లేని సమయంలో పంచాయతీ పాలకవర్గం సమావేశాలకు అధ్యక్షత వహించవచ్చు. సర్పంచ్ పదవి ఏదైనా కారణంతో ఖాళీ అయినప్పుడు, లేదా సుధీర్ఘ కాలం సెలవులో వెళ్లినప్పుడు ఉప సర్పంచే ఇన్చార్జి సర్పంచ్‌గా కొనసాగుతాడు. అదే విధంగా 2018 కొత్త పంచాయతీ రాజ్ చట్టంలో సర్పంచ్‌తోపాటు ఉప సర్పంచ్‌కు చెక్ పవర్‌ను ఉమ్మడిగా కల్పించిన విషయం తెలిసిందే.