New national education policy | సారంగాపూర్, జులై 11: రాష్ట్రంలో నూతన జాతీయ విద్యా విధానాన్ని కొనసాగించాలని తపస్ రాష్ట్ర బాధ్యుడు పూర్ణచందర్ అన్నారు. బీర్ పూర్ మండలంలోని ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ మండల శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులతో శుక్రవారం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో ఉపాధ్యాయ విద్యారంగా సమస్యల పట్ల చర్చిస్తూ ప్రభుత్వం వెంటనే ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని, పెండింగ్లో ఉన్న డీఏలు ప్రకటించాలని పీఆర్సీని పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలుపరచాలని, నూతన జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్రంలో కొనసాగించాలని, బదిలీలతో కూడిన పదోన్నతులు అన్ని కేడర్ల వారిగా ఇవ్వాలని, కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తూ పాత పెన్షన్ విధానం కొనసాగించాలని పేర్కొన్నారు.
పాఠశాలలో మౌలిక వసతులు పూర్తిస్థాయిలో కల్పించాలని మధ్యాహ్న భోజన బిల్లులు వెంటనే చెల్లించాలని, స్కావెంజర్ జీతాలు పెండింగ్లో ఉన్నవని, వాటిని మంజూరు చేయాలని, సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీర్ పూర్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బోయిని చంద్రశేఖర్, మ్యాన రమాదేవి, జిల్లా బాధ్యులు చుక్క కిరణ్ కుమార్, మంద మధూకర్, వడకపుపురం వంశీ తదితరులు పాల్గొన్నారు.