sulthanabad | సుల్తానాబాద్ రూరల్, జూలై 12 : కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లను వెంటనే ఆన్ చేసి రైతుల పంట సాగు సహకరించాలని బీఆర్ఎస్ మండల మాజీ కన్వీనర్, మాజీ ఎంపీటీసీ మైలారం నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా రైతులను పట్టించుకోవడంలేదని విమర్శించారు. రైతులను అనేక ఇబ్బందులకు గురిచేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే రాజకీయ కక్షతో గోదావరిలో లక్ష క్యూసెక్కుల వరద ప్రవాహం ఉన్న కూడా మోటార్లను ఆన్ చేసి లిఫ్ట్ ల ద్వారా నీళ్లను ఎందుకు కాపాడుట లేదన్నారు.
బీఆర్ఎస్కు పేరు వస్తుందనే ఆలోచనతో మోటార్లను ఆపివేసిందన్నారు. వరి సాగును తగ్గించాలని ఉద్దేశంతోనే రైతులను అరుగోస పెడుతుందన్నారు. ప్రభుత్వ విప్, పెద్దపెల్లి ఎమ్మెల్యే వెంటనే స్పందించి ముఖ్యమంత్రితో మాట్లాడి మోటార్లను ఆన్ చేయించి ప్రాజెక్టులో నీరు నింపే విధంగా కృషి చేయాలని అన్నారు. వరి నాట్లు వేసే సమయంలో నీళ్లు లేకపోతే దాదాపుగా లక్ష ఎకరాల వరకు పంటలు ఎండిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాలువలకు సాగునీరు విడుదల చేసి ఆదుకోవాలని అన్నారు.