కరీంనగర్ కలెక్టరేట్, అక్టోబర్ 10: గీత కార్మికుల శ్రేయస్సు కోసమే ప్రభుత్వం కాటమయ్య రక్షణ కవచాలను పంపిణీ చేస్తున్నదని రాష్ట్ర బీసీ, సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. గురువారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రామగుండం బైపాస్ రోడ్డులో గల రేణుకా ఎల్లమ్మ ఆలయంలో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ గీత కార్మికులకు రక్షణ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎవరెస్ట్ ట్రెక్కర్లతో రూపొందించిన ఈ కిట్లు సాంకేతికంగా ఎన్ఐటీ అప్రూవల్ పొందాయని, 1,500 కిలోల బరువును తట్టుకునేలా వీటిని తయారు చేశారన్నారు. తాటిచెట్టు ఎక్కినవారి ప్రాణాలు రక్షించుకునేందుకు ఈ కిట్టు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మొదటి దశలో హైదరాబాద్ మినహా వంద అసెంబ్లీ సెగ్మెంట్లలో 10వేల కిట్లు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. నమోదు చేసుకున్న 2లక్షల మంది గీత కార్మికులకు వీటిని అందజేయనున్నట్లు స్పష్టం చేశారు. మానేరు నది పరీవాహక ప్రాంతంలో టూరిజం అభివృద్ధి జరగాలన్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని మానకొండూర్, హుస్నాబాద్, మంథని సెగ్మెంట్లలో 180కోట్ల చొప్పున యంగిండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లు నెలకొల్పనున్నట్లు చెప్పారు. అంతకుముందు సెప్టీ కిట్టు పనితీరును పరిశీలించారు. కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, ఆర్డీవో కే మహేశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణగౌడ్, ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు.