Putta Madhukar | మంథని, జూన్ 23: మంథని నియోజకవర్గంలోని ప్రజల ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవీ దక్కించుకున్న శ్రీధర్‌బాబుకు అధికారానికి అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారని.. మంత్రికి ఇసుక, మట్టి దోపిడిపై ఉన్న శ్రద్ధ పేదలకు సేవ చేయడం పై లేదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఘాటుగా విమర్శించారు. మంథనిలోని ప్రారంభానికి నోచుకోకుండా అసంపూర్తిగా ఉన్న జేబీఎస్ బాలుర పాఠశాలను సోమవారం పుట్ట మధూకర్ సందర్శించారు.
ఈ సందర్భంగా పుట్ట మధూకర్ మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌గా ఉన్న తాను మన ఊరు-మన బడి కార్యక్రమంలో ద్వారా మంథని జేబీఎస్ పాఠశాలకు నూతన భవనాన్ని మంజూరు చేయించడంతో పాటు వెంటనే పనులు ప్రారంభించామన్నారు. భవన నిర్మాణ పనులు పూర్తిగా అయ్యాయని, భవనానికి రంగులు వేయడం, బాత్ రూం, ప్రహారీ గోడ నిర్మాణం పనులు మాత్రమే మిగిలి పోయి ఉన్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మంథని ఎమ్మెల్యే మంత్రి అయ్యారని, వారు అధికారంలోకి వచ్చి 17 నెలలుగా గడుస్తున్నా భవనానికి మిగిలి పోయిన ఈ పనులను కూడ చేయించడం లేదని విమర్శించారు.
రెండు విద్యా సంవత్సరాలు గడిచి పోయ్యాయని, మళ్లీ 2025-2026 నూతన విద్యా సంవత్సరం ప్రారంభమై కూడ 10 రోజులు దాటుతున్నా మంథని నడిబొడ్డున ఉన్న జేబీఎస్ పాఠశాల ప్రారంభానికి నోచుకోవడం లేదన్నారు. బహిరంగ సభల్లో, వేదికల్లో మంథని నియోజకవర్గానికి జేఎన్టీయూ, ఐటీఐ కళాశాలలు తీసుకు వచ్చానని మంత్రి చెప్పుకుంటున్నారని, ఆ కాలేజీలో మంథని నియోజకవర్గ ప్రజలకు ఏమైన ప్రత్యేక కోటా ఉందా అని పుట్ట మధూకర్ ప్రశ్నించారు. జేఏఎన్టీయూహెచ్, ఐటీఐ కళాశాలలో మంథని నియోజకవర్గం కన్నా ఇతర ప్రాంతాలకు చెందిన విద్యార్థులే ఎక్కువగా చదువుకుంటారనే విషయాన్ని గమనించాలన్నారు. స్థానికంగా ఉండే ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తే ఈ ప్రాంత విద్యార్థులకు, ఓటర్లకు మేలు చేసినట్లవుతుందనే విషయాన్ని గమనించక పోవడం బాధకరమన్నారు.
ఇదేనా విజ్ఞాన కేంద్రంగా మంథని నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడమంటే అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, నియోజకవర్గంలో ఆయన పాలనను ప్రశ్నించే వారిని వీధికుక్కలు అంటూ మాట్లాడటం మంత్రి అవివేకానికే నిదర్శనమన్నారు. ఉన్నత విద్యావంతుడిని అని చెప్పుకునే మంత్రి ప్రతి పక్ష నాయకుడి ఇంట్లో గంజాయి పెట్టించి ఆ కుటుంబాన్ని నాశనం చేయాలనుకునే చర్యకు పాల్పడటాన్ని ఏమంటారన్నారు. నియోజకవర్గంలో దాదాపు 80 వేల మంది చైతన్యవంతులయ్యారని, అందులో 72వేల మంది నాకు ఓటు వేయగా మిగతా వాళ్లు ఇతర పార్టీలకు ఓట్లు వేశారన్నారు.
మిగిలిన ప్రజలు కూడా చైతన్యవంతులు కావాలని ఇందు కోసం తాను ప్రభుత్వం, మంత్రి అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తానన్నారు. తన సామాజిక వర్గానికి చెందిన వారితో ఇసుక, మట్టి దోపిడి చేయిస్తూ కోట్లాది రూపాయలు దండుకుంటున్నారని, ఈ డబ్బులను మళ్లీ ఎన్నికల్లో చక్రం తిప్పాలని చూస్తున్నారన్నారు. కాంగ్రెస్ నాయకుల ఎత్తుగడలను ప్రజలు గమనిస్తున్నా ఓటుకు రూ. 5వేల ఖర్చు చేసినా ప్రజల తగిన గుణపాఠం చెప్తారని జోష్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తగరం శంకర్‌లాల్, మాచీడి రాజుగౌడ్, ఆరెపల్లి కుమార్, గొబ్బూరి వంశీ, కాయితీ సమ్మయ్య, జంజర్ల శేఖర్, వెల్పుల గట్టయ్య, మంథని లక్ష్మణ ఆసీఫ్లతో పాటు తదితరులు పాల్గొన్నారు.