అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. గులాబీ దళం పల్లెపల్లెకూ వెళ్తున్నది. గడపగడపకూ చేరి ప్రతి గుండెనూ తడుతున్నది. అందరికంటే ముందే ఉమ్మడి జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్, ప్రజాక్షేత్రంలో ప్రచార జోరు కొనసాగిస్తున్నది. కానీ, ప్రతిపక్ష పార్టీలు మాత్రం పత్తాలేకుండా పోయాయి. ఎన్నికల సందడి మొదలైనా కాంగ్రెస్, బీజేపీ ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నాయి. నిన్నామొన్నటి వరకు దరఖాస్తులను స్వీకరించిన ‘హస్తం’ పార్టీ, వడపోత పేరిట సాగదీస్తున్నది. ఢిల్లీ నుంచి జాబితా రావడానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నది. ఇక గెలుపు తమదేనంటూ గొప్పలకు పోయే కాషాయ పార్టీ గడిచిన రెండురోజులుగా దరఖాస్తులు స్వీకరిస్తూనే ఉన్నది. అభ్యర్థులు ఎటూ తేలక ఆ రెండు పార్టీల శ్రేణుల్లో అయోమయం నెలకొనగా, బీఆర్ఎస్ మాత్రం అభివృద్ధి పనులు, చేయబోయే పనులు చెప్పుకుంటూ ప్రజల ఆశీర్వాదం కోరుతున్నది.
– కరీంనగర్, సెప్టెంబర్ 6 (నమస్తేతెలంగాణ ప్రతినిధి)
నిజానికి ఏ పార్టీ అధినేత సాహసం చేయని రీతిలో ముఖ్యమంత్రి కేసీఆర్.. ఒకేసారి ఉమ్మడి జిల్లాలోని పదమూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ఆగస్టు 21న ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా కంగుతిన్న ప్రతిపక్షాలు ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోవడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతుండగా, గులాబీ పార్టీ అభ్యర్థులు మాత్రం ప్రచార పర్వంలో దూసుకెళ్తున్నారు. క్షేత్రస్థాయిలో గడపగడపకూ వెళ్తూ, చేసిన, చేయబోయే పనులను వివరిస్తూ మద్దతు కూడగడుతున్నారు. కండ్ల ముందు అభివృద్ధి కనిపిస్తుండడం, సంక్షేమ ఫలాలు ఇంటింటికీ చేరడంతో ప్రజలు కూడా జైకొడుతున్నారు.
– కరీంనగర్, సెప్టెంబర్ 6 (నమస్తేతెలంగాణ ప్రతినిధి)
ప్రతిపక్షాల్లో అయోమయం
ఓవైపు బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తుండగా, ప్రతిపక్షాల నాయకుల జాడ మాత్రం కనిపించడంలేదు. ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ ఈ రెండు పార్టీల నాయకులు ప్రజల ముందుకెళ్లడం లేదు. ఆయా పార్టీల అధిష్టానం స్థాయిలో జరుగుతున్న గ్రూపు రాజకీయాల వల్ల ఎవరికి టికెట్ వస్తుందో..? ఎవరికి రాదో..? తెలియక ఆగమవుతున్నారు. అయితే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తి చేసిన కాంగ్రెస్, అభ్యర్థుల వడపోతే పేరిట జాప్యం చేస్తున్నది. చాలా నియోజకవర్గాల్లో దీటైన అభ్యర్థులు లేరని ఆ పార్టీ నాయకులే చెబుతుండగా, అధిష్టానం ఆడుతున్న రాజకీయాల్లో అంతా ఆందోళన నెలకొంది. అందుకే, పక్కాగా తనకే టికెట్ వస్తుందని చెప్పలేక అధికారికంగా ప్రచారం చేసేందుకు సాహసించడం లేదు. ఇక నిత్యం ప్రగల్భాలు పలికే బీజేపీ పరిస్థితి అయితే ఉమ్మడి జిల్లాలో నానాటికీ దిగజారుతున్నది. గ్రూపు విభేదాలు ఒక ఎత్తు అయితే, అభ్యర్థుల ఖరారు విషయంలో మరో రకమైన రాజకీయం నడుస్తున్నదని ఆ పార్టీ నాయకులే చెప్పడం కనిపిస్తున్నది. తాజాగా రెండు రోజుల నుంచి బీజేపీ దరఖాస్తులు స్వీకరిస్తున్నది. ఈ ప్రక్రియ పూర్తయి, జాబితా అధిష్టానానికి చేరి, అక్కడి నుంచి అభ్యర్థుల ప్రకటన వచ్చే దాకా… అంతా అయోమయమే ఉంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. తామే ప్రధాన ప్రతిపక్షమని చెప్పుకునే ఆ రెండు పార్టీల పరిస్థితిని ప్రజలు సైతం గమనిస్తున్నారు. అందుకే అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న గులాబీ పార్టీకే తమ మద్దతు అంటూ పెద్ద ఎత్తున ఆశీర్వాదం అందిస్తున్నారు.
ఆగస్టు 15న తంగళ్లపల్లి మండలం సారంపల్లిలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్
సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రి, ప్రస్తుత అభ్యర్థి కేటీఆర్ ఉమ్మడి జిల్లాలోనే తొలిసారిగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నట్లుగా ప్రకటించారు. గత నెల 15న తంగళ్లపల్లి మండలం సారంపల్లిలో ప్రచారాన్ని ప్రారంభించినట్టు ఆయన ప్రకటించారు. ‘మీ దయతోనే సిరిసిల్లలో ఉన్న. మీరు మళ్లీ గెలిపిస్తే మరిన్నీ మంచి పనులు చేస్త. ఒక తమ్ముడిగా.. అన్నగా ఉండి ప్రతి ఊరిని బాగుచేసే ప్రయత్నం చేస్త. కులమతాలకు అతీతంగా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి సిరిసిల్ల నియోజకవర్గాన్ని ఒక ఆదర్శంగా చేసుకుందాం’ అని విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత అమాత్యుడు రామన్న విదేశీ పర్యటనలో ఉన్నా.. నియోజకవర్గంలో గులాబీ సేనతో ప్రచారం సాగిస్తున్నారు. అంతేకాదు, నియోజకవర్గ ప్రజలకు నిత్యం ఫోన్లో అందుబాటులో ఉంటున్నారు. ఏ సమస్య వచ్చినా.. ఏ అవసరమొచ్చినా వెంటనే స్పందిస్తున్నారు. అభివృద్ధి పనులు, పథకాలు పక్కా అమలు కావడంతోపాటు ప్రజల కష్టాల్లో అండగా నిలుస్తున్నారు. తాను ఎక్కడ ఉన్నా.. ఇక్కడ లేడనే లోటును తీరుస్తున్నారు.
కరీంనగర్ నియోజకవర్గంలో మంత్రి, ప్రస్తుత అభ్యర్థి మంత్రి గంగుల కమలాకర్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అధికారికంగా ప్రచారం మొదలు పెట్టకపోయినా.. అనధికారికంగా తన ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేసిన ఆయన, ప్రతి గడపకూ సంక్షేమ ఫలాలను అందించారు. ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలతో మమేకమై ముందుకు సాగుతున్నారు. తన హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తున్నారు. నాటి సమైక్య రాష్ర్ట్టానికి, నేటి స్వరాష్ర్టానికి తేడాను కండ్లకు కట్టినట్టు అర్థం చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పలు ప్రాంతాల వాసులు కమలాకర్‌కు ఏకగ్రీవంగా మద్దతు ప్రకటిస్తునారు. బద్దిపెల్లి గ్రామానికి చెందిన ప్రజలతోపాటు నగరంలోని 28వ డివిజన్ ప్రజలు, గ్రానైట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు తమ మద్దతును ఏకగ్రీవంగా ప్రకటించారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ పాడికౌశిక్రెడ్డిని బీఆర్ఎస్ బరిలోకి దింపిన విషయం తెలిసిందే. టికెట్ ప్రకటించిన తర్వాత ఇటీవల మొదటిసారిగా హుజూరాబాద్ వచ్చిన కౌశిక్‌రెడ్డికి నియోజవకర్గ ప్రజలు అపూర్వస్వాగతం పలికారు. రోడ్ షోతోపాటు అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన సభకు వేలాదిగా తరలివచ్చి మద్దతు తెలిపారు. మరోవైపు ఈ నెల 10న స్వర్ణకారులు, 13న యాదవులతో సమావేశాలు నిర్వహించబోతున్నారు. కౌశిక్‌రెడ్డి కొన్నాళ్లుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇంటింటికీ సంక్షేమ ఫలాలను అందిస్తూ ప్రజల్లో ఒకడిగా మెదులుతున్నారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుండగా, తనను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని కండ్లకు కట్టినట్టుగా వివరిస్తున్నారు.
వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంలో చల్మెడ లక్ష్మీనర్సింహారావును ఈసారి ముఖ్యమంత్రి కేసీఆర్ బరిలోకి దింపారు. దీంతో చల్మెడ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించి ప్రజల్లో మంచి పేరు పొందిన ఆయన, ప్రస్తుతం నియోజవకర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. గ్రామాలు, మండలాలు, వార్డుల్లో కలియ తిరుగుతున్నారు. ‘ఆశతో కాదు, ఆశయంతో వస్తున్నా.. నన్ను ఆశీర్వదించండి’ అంటూ ప్రజల మద్దతును కూడగడుతున్నారు. ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయితే.. తన విజన్, తాను నియోజకవర్గంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. ప్రజల్లో ఒకరిగా ప్రచారంలో ముందుకెళ్తున్నారు.
వొడితెల సతీశ్‌కుమార్ బుధవారం ఎల్కతుర్తి మండలం జగన్నాథపూర్ హనుమాన్ ఆలయంలో పూజలు చేసి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌తో కలిసి గ్రామానికి రాగా, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సతీశ్‌కుమార్ దంపతులు పూజలు చేశారు. ఆ తర్వాత జగన్నాథపూర్, జీల్గుల గ్రామాల్లో ప్రచారం చేశారు.
హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రస్తుత అభ్యర్థి వొడితల సతీశ్‌కుమార్ బుధవారం నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఎల్కతుర్తి మండలం జగన్నాథ్‌పూర్ గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి ప్రచారం మొదలు పెట్టారు. ఇప్పటికే ఆయన మండలాల వారీగా నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఇటు క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవుతూ ముందుకెళ్లారు.
ధర్మపురి నియోజకవర్గంలో మంత్రి, ప్రస్తుత అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఒక వైపు ప్రగతి పనులు పరుగులు పెట్టిస్తూనే, మరోవైపు ప్రచారం విస్తృతం చేశారు. ఇప్పటికే వెల్గటూర్, గొల్లపల్లి, బుగ్గారం మండలాల్లో ఒక దఫా ప్రచారం చేసిన ఆయన, ప్రజా ఆశీర్వాద యాత్ర పేరిట ప్రజల ముందుకెళ్తున్నారు. చేసిన అభివృద్ధి వివరిస్తూనే.. మరోసారి ఆశీర్వదించాలని కోరుతున్నారు. ఆయాచోట్ల భారీ స్పందన వస్తుండగా, చాలా మంది యువకులు వివిధ గ్రామాల నుంచి వచ్చి మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరుతున్నారు.
చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రస్తుత అభ్యర్థి సుంకె రవిశంకర్ జోరుగా ప్రచారం చేస్తున్నారు. అన్ని మండలాల్లోనూ కలియ తిరుగుతున్నారు. తన నివాసంలో రోజుకో మండలం చొప్పున బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతూ, పార్టీ శ్రేణులను రంగంలోకి దింపుతున్నారు. ఇప్పటికే చొప్పదండి మండలం వెదురుగట్ట గ్రామానికి చెందిన 200 మంది ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించారు. ఇటీవల చొప్పదండికి వెళ్లినప్పుడు ప్రజలు ఘన స్వాగతం పలికారు. దేశాయిపేట మాజీ సర్పంచ్ బీజేపీ నాయకుడు శారదబాబుతోపాటు 20 మంది బీజేపీ నాయకులు చేరారు. ఇంకా చేరికలు కొనసాగుతుండగా, అందరూ సుంకెకు మద్దతు ప్రకటిస్తున్నారు.
మంథని నియోజకవర్గంలో జడ్పీ చైర్మన్, ప్రస్తుత అభ్యర్థి పుట్ట మధూకర్, ఈ నెల 20 నుంచి భారీ ఎత్తున ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ముత్తారం మండలం ఓడెడ్ గ్రామం నుంచి పాదయాత్ర చేపట్టి, 20 రోజులపాటు కొనసాగించనున్నారు. ఈ పాదయాత్రలో మొత్తం మండలాలను చుట్టేలా ప్లాన్ చేసిన ఆయన, ఆ తర్వాత మంథని పట్టణంలో ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే ఆయనకు మంచి స్పందన వస్తుండగా, ప్రతి రోజూ తన నివాసంలో పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయి. చాలా గ్రామాల నుంచి యవకులు వచ్చి చేరుతున్నారు. మరోవైపు సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరుస్తూ.. తనను ఆశీర్వదించాలని కోరుతున్నారు.
పెద్దపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రస్తుత అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి.. తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. పెద్దపల్లి, కాల్వశ్రీరాంపూర్, ఓదెల, జూలపల్లి, సుల్తానాబాద్ లాంటి ప్రాంతాల్లో ఇప్పటికే ఓ దఫా ప్రచారం పూర్తి చేసిన ఆయన, మరోపైపు గులాబీ సైన్యాన్ని రంగంలోకి దింపుతున్నారు. ఓట్లు అడిగే హక్కు ఒక్క బీఆర్ఎస్కు మాత్రమే ఉందన్న నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. తాను చేసిన కార్యక్రమాలు, భవిష్యత్‌లో చేయబోయే అభివృద్ధి పనులను వివరిస్తూ, తనకు మద్దతివ్వాలని కోరుతున్నారు.
మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రస్తుత అభ్యర్థి రసమయి బాలకిషన్ దూసుకెళ్తున్నారు. ‘పొద్దు పొడుపు’ పేరిట ఇప్పటికే గడపగడపకూ వెళ్లిన ఆయన, వచ్చే ఎన్నికలను దృష్టిలోపెట్టుకొని శంకరపట్నంలో ‘యువ గర్జన’ పేరిట ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. యువత పెద్ద ఎత్తున రావడంతోపాటు కాంగ్రెస్, బీజేపీ నాయకులు పెద్దసంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వినోద్‌కుమార్ పాల్గొని యువతకు దిశానిర్దేశం చేశారు. శంకరపట్నం, ఇల్లంతకుంట, బెజ్జంకి మండలాలకు చెందిన యువకులు పెద్దసంఖ్యలో చేరి మద్దతు తెలిపారు. గడపగడపకూ సంక్షేమ కార్యక్రమాలను తీసుకెళ్తూనే మరోసారి తనను ఆశీర్వదించాలని కోరుతూ రసమయి ప్రచారం చేస్తున్నారు.
కోరుట్ల నియోజకవర్గ అభ్యర్థిగా డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల బరిలోకి దిగారు. నియోజకవర్గంపై మంచిపట్టున్న ఆయన, తన ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఓవైపు నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేస్తూనే.. మరోవైపు గులాబీ సైన్యాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇంకోవైపు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలతో మమేకం అవుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి పనులతోపాటు తాను చేసిన సేవా కార్యక్రమాలను, ప్రజల ఆశీర్వాదంతో భవిష్యత్తులో తాను చేయబోయే పనులను కండ్లకు కట్టినట్టు వివరిస్తూ.. తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.
రామగుండం ఎమ్మెల్యే, ప్రస్తుత అభ్యర్థి కోరుకంటి చందర్ జోరుగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న ఆయన, ఇప్పటికే ఇంటింటికీ వెళ్లి సంక్షేమ ఫలాలు అందిస్తున్నారు. ప్రభుత్వం డీఎంఎఫ్టీ కింద ఇచ్చిన నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతూనే ప్రజాక్షేత్రంలో కలియ తిరుగుతున్నారు. ఇప్పటికే ఆటో డ్రైవర్లు చందర్‌కు ఏకగ్రీవ మద్దతు ప్రకటించగా.. పాలకుర్తి, అంతర్గాం, సెంటినరీ కాలనీ, గోదావరిఖనిలో ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా చేస్తున్నారు.
జగిత్యాల ఎమ్మెల్యే, ప్రస్తుత అభ్యర్థి డాక్టర్ మాకునూరు సంజయ్ కుమార్ ‘మనవాడు- మన ఎమ్మెల్యే’ పేరిట ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ‘పల్లె నిద్ర’ పేరిట ఇప్పటికే అనేక గ్రామాల్లో పర్యటించి, అక్కడికక్కడే సమస్యలు పరిష్కరిస్తూ ప్రజల మన్నలు పొందుతున్నారు. పట్టణంలోనూ ప్రజలతో మమేకమవుతున్నారు. ఇప్పటికే రాయికల్, సారంగాపూర్, బీర్పూర్, జగిత్యాల రూరల్ మండలాల్లో ప్రచార పర్వాన్ని సాగించారు. చేసిన పనులు చెబుతూనే.. భవిష్యత్‌లో చేయబోయే అభివృద్ధిని కండ్లకు కట్టినట్లుగా వివరిస్తూ ప్రజల మద్దతు కోరుతున్నారు.