తాజా బడ్జెట్ ఉమ్మడి జిల్లా వాసులకు నిరాశే మిగిల్చింది. ఏ ఒక్క విషయంలోనూ భరోసానివ్వలేకపోయింది. ఎన్నికల్లో ఇచ్చిన అనేక హామీలను విస్మరించింది. ప్రధానంగా పలు సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని రైతులకు మాఫీ చేస్తారా.. లేదా..? అలాగే రూ.రెండు లక్షలపైన ఉన్న రైతులకు ఎప్పుడు మాఫీ చేస్తారో స్పష్టత ఇవ్వలేదు. మహాలక్ష్మి పథకం కింద ప్రతినెలా మహిళలకు 2500 ఇస్తామన్నా.. ఆ ఊసే ఎత్తలేదు. ప్రభుత్వం మరోసారి మహిళలకు ఢోకా ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పినా.. పొంతన లేని ప్రసంగాలతోనే ముగించిందే తప్పా ఈ యేడాదిలో ఎప్పుడు ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తారో చెప్పలేదు.
మెగా డీఎస్సీ వేస్తామని చెప్పినా ఆ విషయాన్ని ఎక్కడ కూడా ఆర్థిక మంత్రి ఎత్తలేదు. చేనేత రంగానికి అతి తక్కువ బడ్జెట్ కేటాయించి చిన్నచూపు చూసింది. ఇటీవల ఇన్చార్జి మంత్రి నిర్వహించిన సమీక్షలో పేర్కొన్న పలు ప్రాజెక్టులకు నిధులు కేటాయించ లేదు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని, రాగానే పీఆర్సీ ప్రకటిస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఈసారి కూడా వారి ఆశలపై నీళ్లు చల్లింది. మాట మాత్రమైనా బడ్జెట్లో ప్రస్తావించకుండా తీవ్ర నిరాశ పరిచింది. ఇలా చెప్పుకొంటూ పోతే ఏ ఒక్క వర్గాన్ని సైతం తాజా బడ్జెట్ సంతృప్తి పరచలేదన్న అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి.
కరీంనగర్, మార్చి 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : 2025-26 రాష్ట్ర బడ్జెట్ ఏ ఒక్క వర్గానికి సైతం భరోసా నివ్వలేకపోయింది. తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఎన్నో హామీలు అమలు చేస్తామని చెప్పినా.. చివరకు బుట్టదాఖలు చేసింది. ప్రధానంగా ఉద్యోగులకు సంబంధించి పెడింగ్‌లో ఉన్న ఐదు డీఏల గురించి, అలాగే పీఆర్సీ గురించి ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రస్తావించలేదు. పీఆర్సీ నివేదికను ఆరు నెలల్లో తెప్పించి అమలు చేస్తామని, అలాగే డీఏలను క్లియర్ చేస్తామని, సీపీఎస్ విధానం రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని తెస్తామని హామీ ఇచ్చినా.. బడ్జెట్లో మాత్రం ఏ ఒక్క అంశాన్ని ప్రస్తావించకుండా ఉద్యోగుల ఆశలపై మరోసారి సర్కారు నీళ్లు చల్లిందన్న విమర్శలు వస్తున్నాయి.
అన్నదాతలకు కూడా ప్రభుత్వం మరోసారి ఢోకా ఇచ్చిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2 లక్షలలోపు రుణాలను మాఫీ చేసినట్టు ఆర్థిక శాఖ మంత్రి తన ప్రసంగంలో నొక్కిచెప్పినా.. రూ.రెండు లక్షలపై పడి ఉన్న రుణాల మాఫీ పరిస్థితి ఏమిటో చెప్పలేదు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో వివిధ సాంకేతిక కారణాలతో దాదాపు 80వేల మంది 2లక్షలలోపు రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ జరుగలేదు. వీటిని మాఫీ చేస్తారా.. చేయరా? అన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు. అలాగే రూ.రెండు లక్షలపై ఉన్న రుణాలను మాఫీ చేస్తారా.. లేదా..? అన్నది మాటమాత్రమైనా చెప్పలేదు. దీంతో ఇక రుణమాఫీ అనుమానమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాది అదే పరిస్థితి. వ్యవసాయ కూలీల కుటుంబానికి 12వేలు చెల్లించే బృహత్తర పథకం అమలు చేస్తున్నామని చెప్పుకోవడమే తప్ప ఇప్పటివరకు అమలు చేసింది లేదు. సదరు కుటుంబాలకు సహాయం చేస్తారా.. లేదా..? అన్నదానిపై స్పష్టత లేదు. సన్నవడ్లకు బోనస్ ఇస్తామని గొప్పలు పోయినా..
అది కూడా ఇంకా చాలా మందికి రాలేదు. వారికి డబ్బులు వేస్తారా.. వేయరా? చెప్పకపోగా.. బడ్జెట్లో బకాయిలకు సంబంధించి కేటాయింపులు లేవు. ఏడాదిలో రెండు లక్షలు ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి.. రెండోసారి బడ్జెట్ ప్రవేశపెట్టినా ఇచ్చిన హామీ ప్రకారం పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తారో స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటివరకు 57,946 పోస్టులు భర్తీ చేశామని, 30,228 కొత్త పోస్టులు మంజూరు చేశామని, 14,236 అంగన్వాడీ పోస్టుల భర్తీకి ఆదేశాలు జారీ చేశామని చెప్పారే తప్ప జాబ్ క్యాలెండర్ ప్రకారం ఎప్పుడు ఏ నోటిఫికేషన్ విడుదల చేస్తారో మాత్రం ఎక్కడా ప్రకటించలేదు.
పంచాయతీలకు బకాయిలు చెల్లిస్తారా.. లేదా? అనే విషయంపై పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధికి 31,605 కోట్ల ప్రతిపాదించామని చెప్పారే తప్ప పెడింగ్ బిల్లులకు సంబంధించి ప్రతిపాదన మాత్రం కనిపించలేదు. శ్రీపాద ఎల్లంపల్లికి 249 కోట్లు, ఎస్సారెస్పీ వరదకాలువకు 299 కోట్లు, శాతవాహన విశ్వవిద్యాలయానికి 35 కోట్లు, స్మార్ట్‌సిటీకి 101 కోట్లు, కరీంనగర్, వరంగల్ స్పోర్ట్స్ స్కూళ్లకు 40 కోట్లు కేటాయించిన సర్కారు.. కీలకమైన చేనేత రంగానికి కేవలం 371 కోట్లే కేటాయించి వివక్ష చూపింది. మరోవైపు సాగునీరు లేక వేలాది ఎకరాల్లో పంటలు ఎండుతున్నా.. రైతులు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నా ఎక్కడా దీనిపై చర్చించలేదు. రైతులను ఆదుకోవాలన్న తపన ఎక్కడా కనిపించలేదు.
హామీల ఊసేది?
తాము అధికారంలోకి రాగానే ఎన్నో హామీలు అమలు చేస్తామని కాంగ్రెస్ చెప్పినా తాజా బడ్జెట్లో చేతులెత్తేసింది. ఒకటి రెండు కాదు, లెక్కకు మించిన పథకాలను పక్కన పెట్టింది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెలా 2,500 ఇచ్చి తీరుతామని మేనిఫెస్టోలో స్పష్టం చేసింది. ఈ బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని అందరూ భావించినా, ఈ స్కీం ముచ్చట లేకుండానే ముగించింది. ఇప్పుడు ఇవ్వలేని పరిస్థితులుంటే ఆ విషయాన్ని వివరించి.. ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పలేదు. అసలు ఇస్తారా.. ఇవ్వరా? అన్న విషయంపై స్పష్టత ఇవ్వలేదు. అలాగే యువ వికాసం కింద ప్రతి విద్యార్థికీ 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని హామీ ఇచ్చింది. అందుకు సంబంధించి అంశాన్ని కూడా మాట్లాడలేదు. విద్యారంగానికి బడ్జెట్ కేటాయిస్తున్నట్టు చెప్పిందే తప్ప యువ వికాసం 5 లక్షల భరోసా కార్డు ఇస్తారా.. ఇవ్వరా? అన్న విషయాన్ని ప్రస్తావించలేదు. చేయూత పథకం కింద వృద్ధులకు 4వేల పింఛన్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టినా.. బడ్జెట్లో మాత్రం ప్రస్తావించకుండా ఆశలపై నీళ్లు చల్లింది. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే గొల్లకుర్మలకు రెండో దశ గొర్లు పంపిణీ చేస్తామని చెప్పినా.. వీరికి కూడా మొండి చేయే చూపింది.
యువతకేది చేయూత?
యూత్ డిక్లరేషన్‌లో పేర్కొన్నట్టు.. నిరుద్యోగ యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే వరకు ప్రతినెలా 4వేల నిరుద్యోగ భృతి చెల్లిస్తామని కాంగ్రెస్ ఎన్నికల సమయంలో చెప్పింది. బడ్జెట్లో అందుకు నిధుల కేటాయింపు లేకపోగా.. ఈ అంశం మచ్చుకు కూడా రాలేదు. ప్రభుత్వ రాయితీలు పొందిన ప్రైవేట్ కంపెనీల్లో తెలంగాణ యువతకు 75 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రగల్భాలు పలికినా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఫీజు రీయింబర్స్మెంట్ గతంలో కన్నా మెరుగ్గా ఇస్తామని ఎన్నికలప్పుడు ప్రకటించినా బడ్జెట్లో కనీసం ప్రస్తావించ లేదు. ఇప్పటికే ఫీజు రీయింబర్స్మెంట్ రావాల్సిన విద్యాసంస్థలు ఒక దశలో తమ కాలేజీలు మూసేందుకు సిద్ధమైన తరుణంలో తాజా బడ్జెట్ భరోసా ఇస్తుందని భావించినా చేదు అనుభవమే ఎదురైంది. అలాగే పద్దెనిమిదేళ్ల పైన ఉండి చదువుకునే ప్రతి యవతికి ఎలక్ట్రిక్ స్కూటర్లు అందిస్తామని గతంలో చెప్పినా ఆ ముచ్చటే లేకుండా పోయింది.
టీచర్ పోస్టుల భర్తీ ఎప్పుడో..
అధికారంలోకి రాగానే తొలి క్యాబినెట్ సమావేశంలోనే మెగా డీఎస్సీని ప్రకటించి, ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టులను ఆరు నెలల్లో భర్తీ చేస్తామని ఆశలు రేపిన కాంగ్రెస్, బడ్జెట్లో రిక్తహస్తమే చూపింది. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి ఎక్కడా ప్రకటించలేదు. టీచర్ పోస్టుల భర్తీ ఉంటుందా.. లేదా..? అన్న విషయాన్ని కూడా స్పష్టం చేయలేదు. దీంతో సంబంధిత అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. యువ వికాసం కింద విద్యార్థులకు ఫ్రీ ఇంటర్నెట్ వైఫై సౌకర్యం అందిస్తామని చెప్పినా ఉత్తదే అయింది. అలాగే ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్ల సమస్యలను పరిష్కారిస్తామని హామీ ఇచ్చినా ఎక్కడ ఈ విషయాలను ప్రస్తావించలేదు.
ఇది అంకెల గారడీనే..
-బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు
జగిత్యాల, మార్చి 19 : ఎన్నో అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు ప్రవేశ పెట్టిన బడ్జెట్ అంకెల గారడీ బడ్జెటేనని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు విమర్శించారు. ఎన్నికల ముందు ఎన్నో మాటలు చెప్పిన రేవంత్‌కు పాలన చేతగావడం లేదని ధ్వజమెత్తారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే ఏ లోటు లేకుండా రాష్ట్రం సుభిక్షంగా ఉందని గుర్తు చేశారు. బుధవారం జగిత్యాల బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ మళ్లీ మోసపూరిత మాటలతో మోసం చేసిందని మండిపడ్డారు. బడ్జెట్ పేరిట ఈ రోజు అన్ని వర్గాలను మోసం చేశారని, ఆరు గ్యారెంటీలకు ఎగనామం పెట్టారన్నారు. మహిళలకు ఇస్తానన్న రూ.2500పెన్షన్ ఊసే లేదని, కాలేజీ విద్యార్థినులకు సూటీ ఇస్తామని మాట తప్పారన్నారు.
ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనమని విమర్శించారు. కేసీఆర్ హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చింది తామేనని గుర్తు చేశారు. అయితే ఎన్నికల కోడ్ వల్ల అవి ఆగిపోతే, ఆ ఉద్యోగాలు తామే ఇచ్చామని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణాధ్యక్షుడు గట్టు సతీశ్, అర్బన్ మండలాధ్యక్షుడు తుమ్మ గంగాధర్, రూరల్ మండలాధ్యక్షుడు ఆనంద్ రావు, మాజీ కౌన్సిలర్ దేవేందర్ నాయక్, మాజీ జడ్పీటీసీ మహేశ్, పీఎసీఎస్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, ఎఎంసీ మాజీ చైర్మన్ శీలం ప్రియాంక ప్రవీణ్, అయిల్నేని వెంకటేశ్వర్ రావు, మజాహిర్ రిజ్వాన్, కల్లూరి హరీశ్, నీలి ప్రతాప్, మాజీ పీఎసీఎస్ అధ్యక్షుడు సత్యంరావు, అనురాధ తదితరులు పాల్గొన్నారు.
మోసం చేసేలా ఉన్నది
రాష్ట్ర బడ్జెట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ బడుగు, బలహీన వర్గాలను మోసం చేసేలా ఉన్నది. బడ్జెట్లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ఆరు గ్యారెంటీల ప్రస్తావనే లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన దళితబంధుకు బదులుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న అంబేద్కర్ అభయహస్తం పథకం ఊసేలేదు. అంటే దళిత బంధుకు రాంరాం చెప్పేసినట్లేనా..? కాంగ్రెస్ అంటేనే దళితులను నమ్మించి వెన్నుపోటు పొడిచే పార్టీ. నమ్మి ఓట్లేసిన పాపానికి నాలుగు కోట్ల మందిని మోసం చేసిన బడ్జెట్ ఇది. గత పదేండ్ల ప్రగతికి కాంగ్రెస్ ప్రభుత్వం గండి పెట్టింది. రేవంత్ రెడ్డి చేతకాని పాలనకు నిలువుటద్దం ఈ బడ్జెట్. కాంగ్రెస్ ఇస్తామన్న తులం బంగారం, మహాలక్ష్మి, పెన్షన్లకు దిక్కు లేదు. అంతే కాకుండా యాదవ సోదరులకు ఇస్తామన్న గొర్రెల ముచ్చటే లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గురుకులాల్లో 80 మందికి పైచిలుకు పిల్లలు చనిపోతే ఆపలేని వీళ్లు.. కొత్త స్కూళ్లను నిర్మిస్తామనడం విడ్డూరంగా ఉంది.
– కొప్పుల ఈశ్వర్, మాజీ మంత్రి
అసమర్థ పాలనకు నిదర్శనం
ఈ బడ్జెట్ సీఎం రేవంత్ రెడ్డి అసమర్థ పాలనకు నిదర్శనం. ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని తుంగలో తొక్కింది. 500 రోజులైనా అమలు చేయడం లేదు. పైగా అందులో పేరొన్న అంశాలను తప్పుదారి పట్టించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తున్నది. యువ వికాసం పేరుతో ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్యాభరోసా కార్డు ఇస్తామని చెప్పి.. ఇప్పుడు ఆ పథకాన్ని కాంగ్రెస్ కార్యకర్తల జేబులు నింపేలా మార్చింది. కొత్తగా 500 కోట్ల పెట్టుబడి పెట్టడానికి కూడా ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని బేల మాటలు మాట్లాడిన సీఎం, 6వేల కోట్లు కార్యకర్తలకు పంచడానికి బడ్జెట్ కేటాయించడం ఎంతవరకు సమంజసం? అకాచెల్లెళ్లకు ప్రతినెలా ఇస్తానన్న 2,500కు కేటాయింపులు ఎందుకు చేపట్టలేదు. రేవంత్‌రెడ్డి అంకెల గారడీతో ఆరు గ్యారంటీలకు ఎగనామం పెట్టిండు. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఆటోడ్రైవర్లు, గిగ్ వరర్లు, మహిళలు, ఉద్యోగులు, సబ్బండ వర్గాలను నిండా ముంచిండు.
– పుట్ట మధూకర్, మాజీ ఎమ్మెల్యే (మంథని)
ప్రజానీకం హర్షించదు
అన్ని వర్గాలకు న్యాయం చేసేలా బడ్జెట్ ఉంటుందనుకుంటే, ప్రజా సంక్షేమాన్ని నిర్వీర్యం చేసేవిధంగా ఉన్నది. పూర్తి నిరాశజనంగా ఉన్నది. తెలంగాణ ప్రజానీకం దీనిని హర్షించదు. 420 హామీలు, ఆరు గ్యారెంటీల ఊసే లేదు. తులం బంగారాన్ని తుంగలో తొక్కారు. మహాలక్ష్మిని మరచిపోయారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా విస్మరించారు. కార్యకర్తలకు పలహారం పంచినట్టు పంచుతామని సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉన్నది.
– సుంకె రవిశంకర్, మాజీ ఎమ్మెల్యే (చొప్పదండి)
తులం బంగారం ఏమైంది?
బడ్జెట్లో ఎటువంటి సామాజిక న్యాయం లేదు. వాస్తవలకు దూరంగా ఉన్నది. 420 హామీలు చెప్పి కేసీఆర్ సంక్షేమ పథకాలను పేరు మర్చి మభ్యపెట్టారు. మహాలక్ష్మి కింద ఆడపిల్ల పెళ్లికి తులం బంగారం ఇస్తామన్నారు. అది ఏమైంది? పెన్షన్ పెంపు లేదు. అంబేదర్ అభయహస్తం ద్వారా దళితులకు ఇస్తామన్న 12లక్షల ఊసే లేదు. పంటలు ఎండుతున్నా పట్టింపు లేదు. పసుపు పంటకు మద్దతు ధర లేదు. రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇంకా అందలేదు. రైతు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకునే దిక్కు లేదు. ఇదేం ప్రభుత్వం? బడ్జెట్ భరోసానిచ్చేలా లేదు.
– జగిత్యాల బీఆర్ఎస్ కార్యాలయంలో జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత
రజకులకు అన్యాయం
కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రజకులకు తీవ్రమైన అన్యాయం జరిగింది. రజక కార్పొరేషన్ ఉన్నప్పటికీ నిధులు కేటాయించకపోవడం చూస్తే మా సామాజికవర్గంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనేది స్పష్టమైంది. కార్పొరేషన్‌కు వెయ్యి కోట్లు కేటాయిస్తామని చెప్పి ఇప్పుడు ఒక్క రూపాయి కూడా ఇవ్వక పోవడం దురదృష్టకరం. బీసీ కార్పొరేషన్ ద్వారా రజకులకు ఎలాంటి షరతులు లేని రుణాలు ఇవ్వాలి. మహిళా సంఘాలకు కూడా రుణాలు విరివిగా ఇవ్వాలి. రాజీవ్ యువ వికాసంలో రజక యువతకు ప్రాధాన్యత ఇవ్వాలి. లేదంటే మా సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతాం.
– పూసాల సంపత్ కుమార్, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
గల్ఫ్ కార్మికులను మోసం చేసింది
తెలంగాణ రాక ముందు సరైన ఉపాధి లేక గల్ఫ్ దేశాలకు వలసలు పోవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్, బీజేపీలే. ఇప్పుడు కూడా కాంగ్రెస్ వంచిస్తున్నది. ఎన్నికల ముందు గల్ఫ్ సంక్షేమానికి నిధులు, ప్రత్యేక ప్యాకేజీని కేటాయిస్తామని మేనిఫెస్టోలో చెప్పింది. కానీ, బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావన తేకుండా మోసం చేసింది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయం.
– రాధారపు సతీశ్‌కుమార్, ఎన్నారై బీఆర్ఎస్ బహ్రెయిన్ శాఖ అధ్యక్షుడు
రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం
చేనేత, పవర్‌లూం పరిశ్రమపై కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి అవలంభిస్తున్నది. నేతన్నలకు అభయహస్తం లాంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చింది. ఓట్లు, సీ ట్లు అధికారం కోసం తప్ప, నేతన్నలను ఆదుకోవాలన్న ఆలోచన లేద ని బడ్జెట్లో కేటాయించిన నిధులతో స్పష్టమైంది. వరంగల్, గుండ్లపోచంపల్లి, మల్కాపూర్, జగిత్యాల, నారాయణపేట, భువనగిరిలో మెగా పవర్‌లూం టెక్స్టైల్స్ పార్కులను ఏర్పాటు, ప్రభుత్వ రంగ సంస్థలకు అవసరమయ్యే వస్ర్తాల తయారీ లాంటి హామీలు ఇచ్చింది. వీటన్నింటికి 2వేల కోట్ల అవసరం పడుతుంది. బడ్జెట్లో మాత్రం 371కోట్లు కేటాయించి నేతన్నలకు, వస్త్ర పరిశ్రమకు తీరని అన్యాయం చేసింది. కాంగ్రెస్ విధానాలను ఎండగడుతు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తాం.
– కూరపాటి రమేశ్, పవర్‌లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
హామీలను విస్మరించింది
బడ్జెట్లో విద్యారంగానికి ఏటా 15 శాతం నిధులు కేటాయిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. కానీ, రెండో బడ్జెట్లో కూడా ప్రభుత్వం మాట నిలుపుకోలేదు. కేవలం 7.57 శాతం నిధులే కేటాయించి చేతులు దులుపుకొన్నది. ఈ అరకొర నిధులతో విద్యారంగం మరింత కుదేలవుతుంది. జూలై 2023 నుంచి అమలు చేయాల్సిన పీఆర్సీ ఊసే లేదు. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏల ముచ్చటే లేదు. సత్వరం పీఆర్సీ అమలు చేస్తామని, డీఏ వాయిదాలను వెంటనే చెల్లిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ సర్కారు పూర్తిగా పక్కన పెట్టింది. విద్యాభిమానులే కాకుండా, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లలో బడ్జెట్ కేటాయింపులపై తీవ్ర నిరాశ నెలకొన్నది.
– మానేటి ప్రతాపరెడ్డి, టీఆర్టీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు
బీసీలను మోసం చేసింది
కామారెడ్డి డిక్లరేషన్‌లో ఏటా బీసీల సంక్షేమం కోసం రూ.20 వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని కాంగ్రెస్ చెప్పింది. మోసపూరిత వాగ్దానాలను బీసీ సమాజం నమ్మి ఓట్లు వేస్తే మోసం చేస్తూ వస్తున్నది. గత, తాజా బడ్జెట్లలో నామమాత్రపు నిధులు కేటాయించి మోసం చేసింది. కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు ఎన్నో అలవిగాని హా మీలు ఇచ్చి ప్రజలను, ముఖ్యంగా బీసీలను దగా చేసింది. కాంగ్రెస్ చెబుతున్న మాటలు.. చేస్తున్న కేటాయింపులకు ఏమాత్రం పొంతన ఉండడం లేదు. అందుకే బీసీ సమాజం మొత్తం ఒకసారి ఆలోచించాల్సిన అవసరమున్నది.
– గుంజపడుగు హరిప్రసాద్, బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు
విద్యారంగానికి తగ్గించడం బాధాకరం
బడ్జెట్లో విద్యారంగానికి 0.20 శాతం కేటాయింపులు తగ్గించడం చాలా బాధాకరం. ఓవైపు డీఏలు, మరోవైపు వేతన సవరణను పట్టించుకోలేదు. ఈ బడ్జెట్ ప్రభుత్వ పాఠశాలలో నిలిచిపోయిన అభివృద్ధి కార్యక్రమాలకు, విద్యార్థుల భవిష్యత్తుకు, రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లు, వారి కుటుంబసభ్యుల ఆశలకు విఘాతం కలిగించేలా ఉన్నది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్నదని ముఖ్యమంత్రి తరచుగా ఆవేదన చెందుతున్న ఈ తరుణంలో విద్యాశాఖకు బడ్జెట్ తగ్గించడం పరస్పర విరుద్ధ చర్య. సర్కారు బడుల్లో కనీస సౌకర్యాలు కల్పించడంతోపాటు లక్షలాదిమంది ప్రభుత్వోద్యోగ ఉపాధ్యాయ, పెన్షనర్లు సంవత్సరాల తరబడి వేచి చూస్తున్న నాలుగు డీఏలను ప్రకటించాలి. అలాగే వేతన సవరణ కోసం తక్షణం చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర బడ్జెట్లో విద్యకు 20శాతం నిధులు కేటాయించాలి.
– చందూరి రాజిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (తెలంగాణ స్టేట్ టీచర్స్ యూనియన్)
మహిళల ఆశలపై నీళ్లు
మహాలక్ష్మి పథకం కింద నెలకు 2,500 ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల సమయం లో హామీ ఇచ్చింది. కానీ, అమలు చేసే దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తాజా బడ్జెట్లోనూ ఈ ప్రస్తావన తేకుండా మరోసారి మహిళలను మోసం చేసింది. మహిళలను కోటీశ్వరులను చేస్తామని పదే పదే చెబుతూనే పథకాల అమలుకు వచ్చేసరికి మాత్రం మొండి చేయి చూపుతున్నారు. మహాలక్ష్మి పథకం కింద ఈ బడ్జెట్లోనైనా నిధులు కేటాయించి 2,500 ఇస్తారని ఆశిస్తే.. మా ఆశలపై నీళ్లు చల్లారు.
– కోనేటి నాగమణి, ఐద్వా జిల్లా కార్యదర్శి
ప్రైవేట్ విద్యారంగంపై చిన్నచూపే
ఎన్నికల సమయంలో ప్రైవేట్ విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని కాంగ్రెస్ చెప్పింది. ముఖ్యంగా ఈ రంగంలో పనిచేసే ఉపాధ్యాయులు, సిబ్బంది సమస్యలకు పరిష్కార మార్గాలు చూపుతామని, అన్ని రకాలుగా ఆదుకుంటామని తన మేనిఫెస్టోలో పెట్టింది. గత బడ్జెట్లో ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. అప్పుడు అడిగితే వచ్చే బడ్జెట్ పెడుతామని చెప్పింది. కానీ, ప్రభుత్వం ఈసారి కూడా రిక్తహస్తమే చూపింది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ప్రైవేట్ విద్యాసంస్థలు, సిబ్బంది సమస్యలు పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని ఊదరగొట్టే హామీలు ఇచ్చింది. తాజా బడ్జెట్ ద్వారా ఆ పార్టీ నిజస్వరూపం మరోసారి తెలిసింది. ఇప్పటికైనా ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు నిజానిజాలు తెలుసుకొని అడుగులు వేయాలి.
– యాదగిరి శేఖర్‌రావు, ట్రస్మా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు