‘ప్రత్యేక’ పాలనలో పల్లెల్లో అభివృద్ధి కుంటుపడుతున్నది. పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో ప్రజలు నిత్యం నరకం అనుభవించాల్సి వస్తున్నది. వీధి లైట్లు వెలగకపోవడంతో చీకట్లోనే మగ్గాల్సి వస్తున్నది. డీజిల్ లేక ట్రాక్టర్లు నడవక పోవడంతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతున్నది. అందుకు కోనరావుపేట మండలకేంద్రమే నిదర్శనంగా నిలుస్తున్నది.
కోనరావుపేట, సెప్టెంబర్ 19 : కోనరావుపేట మండల కేంద్రంలో మూడు నెలలుగా వీధి దీపాలు వెలగకపోవడంతో రాత్రయితే అంధకారం నెలకొంటున్నది. ఇటీవల వినాయక నవరాత్రోత్సవాలు కూడా చీకట్లోనే సాగాయి. అలాగే, కొన్ని రోజులుగా డీజిల్ లేక చెత్త నిర్వహణ సాగడం లేదు. దీంతో ఇండ్లలో చెత్త పేరుకుపోవడంతోపాటు వీధులన్నీ కంపుకొడుతున్నాయి. అంతేకాకుండా తొమ్మిది నెలలుగా జీతాలు లేక పంచాయతీ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. కాగా, ఇక్కడ కార్మికురాలిగా విధులు నిర్వహిస్తున్న మరియమ్మకు తొమ్మిది నెలలుగా జీతం ఇవ్వకుండా ఆమెను విధుల నుంచి తొలగించాలని ఉత్తర్వులు జారీ చేశారు.
గ్రామపంచాయతీలో పెండింగ్లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లిస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని గ్రామపంచాయతీ కార్యదర్శి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. చెత్త సేకరించే ట్రాక్టర్ డీజిల్ బిల్లు లక్ష, వీధి దీపాల ఏర్పాటుకు దుకాణం వద్ద పెండింగ్ బిల్లు 70 వేలు ఉండగా, వాటిని చెల్లించకపోవడంతో ప్రజలకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి.
మండల కేంద్రంలో నెలకొన్న పలు సమస్యలు నా దృష్టికి వచ్చాయి. విద్యుత్ దీపాలు వెలగక పోవడం, డీజిల్ లేక ట్రాక్టర్ నడవకపోవడం వంటి సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించేందుకు గ్రామ పంచాయతీ కార్యదర్శిని వివరాలు అడిగా. బిల్లులు చెల్లించకపోవడం వల్లే ఈ సమస్యలు తలెత్తాయి. త్వరితగతిన బిల్లులు చెల్లించి గ్రామస్తులకు ఇబ్బందులు లేకుండా చూస్తా.
– శ్రీనివాస మూర్తి, ఎంపీడీవో (కోనరావుపేట)