కరీంనగర్ జిల్లా విద్యా శాఖ అవినీతికి కేరాఫ్‌గా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో జిల్లా విద్యాధికారిగా పనిచేసిన జనార్దన్‌రావు.. చాలా విషయాల్లో చేసిన తప్పులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో మరో విచిత్ర విషయం వెలుగులోకి వచ్చింది.
కరీంనగర్,జూలై 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తనకో న్యాయం.. ఇతరులకో న్యాయం అనే విధానాన్ని తన ధర్మంగా పాటించిన ఆయన, సాక్షాత్తూ డీఈవో కార్యాలయంలో ఆయన తర్వాత రెండో స్థాయి అధికారి పోస్ట్ అయిన అసిస్టెంట్ డైరెక్టర్ ఖాళీగా లేకున్నా ఆ బాధ్యతలను ఒక సూపరింటెండెంట్‌కు కట్ట బెట్టిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా విద్యాధికారి కార్యాలయంలో 2021 నుంచి అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న డీ మాధవికి ఆ సమయంలోనే పెద్దపల్లి డీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
అయినా, ఆమె నిబంధనలకు లోబడి.. కరీంనగర్లో ఏడీగా విధులు నిర్వర్తిస్తూనే.. పెద్దపల్లి డీఈవోగా కూడా పని చేస్తున్నారు.అయితే, తన కింది స్థాయి అధికారి తనతో సమానంగా డీఈవోగా వ్యవహరించడం కరీంనగర్ డీఈవో జనార్దన్‌రావుకు రుచించినట్లుగా లేదో ఏమో తెలియదు గానీ.. కరీంనగర్లో ఏడీ పోస్టు ఖాళీగా లేకున్నా ఆ పోస్టు బాధ్యతలను ఆయన కార్యాలయంలోనే పనిచేస్తున్న ఒక సూపరింటెండెంట్‌కు అప్పగించారు.
ఆ మేరకు సదరు సూపరింటెండెంట్ ద్వారానే బిల్స్ చేయించడం, ఫైల్ ప్రాసెసింగ్ చేయించారు. నిజానికి నిబంధనలకు ఇది పూర్తి విరుద్ధం. ఖాళీగా లేని ఒక ఏడీ పోస్టుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పజెప్పడమనేది నిబంధనలను తుంగలో తొక్కడమేనని విద్యాశాఖ చట్టాలు స్పష్టం చేస్తున్నాయి. సాక్షాత్తూ డీఈవో అండ ఉండడంతో సదరు సూపరింటెండెంట్ రెచ్చిపోయారని తెలుస్తోంది. సాధారణ ఫైల్ కూడా ప్రాసెసింగ్ చేయరాదని నిబంధనలు చెపుతుంటే.. సదరు సూపరింటెండెంట్ ఏకంగా ట్రెజరీ బిల్స్ ఆథరైజ్, ప్రాసెస్ చేశారు. ఈ బిల్లులను జిల్లా ట్రెజరీ అధికారులు పూర్తిగా వ్యతిరేకించాలి. కానీ, ఇక్కడ ఏం జరిగిందో.. ఎలా మేనేజ్ చేశారో తెలియదు కానీ.. వారు సైతం ఆమోదించడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
నిజానికి ఒకవేళ ఆ అధికారి ఎప్పుడైనా సెలవులో ఉన్నప్పుడు తాతాలికంగా కింది వారికి అదనపు బాధ్యతలు అప్పగించినా.. ఆ అధికారి సెలవు నుంచి మళ్లీ విధు ల్లో చేరగానే ఆటోమెటిగ్గా ఆ అదనపు బాధ్యతల వి ధులు రద్దవుతాయి. కానీ, ఇక్కడ అంతా నిబంధనలకు విరుద్ధంగానే జరిగింది. ఈ వ్యవహారం బయట కు రావడం.. గత జిల్లా విద్యాధికారి వెళ్లిపోవడంతో సూపరింటెండెంట్ ఆ విధుల నుంచి తప్పుకొన్నారు. అయితే.. పనిచేసిన కాలంలోనూ అనేక అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ఏడీ హోదాలో పనిచేసి సంతకాలు చేసిన ఫైళ్ల ను పూర్తిగా పరిశీలిస్తే.. అక్రమాలు పూర్తిగా బహిర్గతమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో పా టు.. ట్రెజరీ అధికారులను ప్రశ్నించినా పూర్తి వివరా లు బయటకు వస్తాయని విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. కలెక్టర్ వీటిపై ఎలా స్పందిస్తారో చూడాలి.
ఎయిడెట్ టీచర్ల వేతన స్థిరీకరణలో జరిగిన అక్రమాలపై ఇందులో కీలక భాగస్వాములైన అధికారులు మల్లగుల్లాలు పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఉన్నతాధికారులు దీనిపై ఆరా తీస్తుండగా.. కొన్ని ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్రస్థాయి అధికారులకు కూడా ఫిర్యాదు చేశారని విశ్వసనీయ సమాచారం. దీంతోపాటు ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనాలను సైతం రాష్ట్ర విద్యాశాఖకు అప్పగించారని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఉన్నతాధికారులను మచ్చిక చేసుకొని.. విచారణ జరగకుండా ఉండేందుకు సదరు అక్రమార్కులు మల్లగుల్లాలు పడుతున్నారని తెలుస్తోంది. ఇందుకోసం మరోసారి సదరు అధికారులు రహస్య ప్రదేశంలో సమావేశం కావడంతోపాటు.. ఖర్చుల కోసం కొన్ని డబ్బులను కూడా వసూలు చేశారని విశ్వసనీయ సమచారం.
సదరు డబ్బులను పై అధికారులకు ఇస్తామని ఇందులో కీలక భాగస్వామి అయిన అధికారి చెప్పారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. తక్షణం స్పందించాల్సిన ఉన్నతాధికారులు కూడా మీనమేషాలు లెక్కిస్తూ జా ప్యం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. కాగా, వ చ్చే రెండు మూడు రోజుల్లో దీనిపై పూర్తిస్తాయి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఓ అధికారి పేర్కొన్నారు. కాగా, ఎయిడెడ్ టీచర్ల వేతన స్థిరీకరణ విషయంలో వస్తున్న కథనాలు ఓ వైపు సంచలనం రేపుతుండగా.. మీడియాకు ఎవరు సమాచారం ఇచ్చారన్న దానిపై విద్యాశాఖలో ఆరాతీయడంతో పాటు ఒకరిపై మరొకరు అనుమాన పడుతున్నారని తెలుస్తోంది.