Godavarikhani | కోల్ సిటీ, సెప్టెంబర్ 15 : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యాంశంలో చేర్చాలని, ప్రతీ ఏటా ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్, జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం డిమాండ్ చేశారు. ఈ మేరకు గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో మంగళవారం సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాల స్ఫూర్తి సభ ఘనంగా నిర్వహించారు. ముందుగా సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు గోసిక మోహన్ అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ పోరాట యోధుల చిత్రపటానికి సీపీఐ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన స్పూర్తి సభలో వారు మాట్లాడుతూ 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ తెలంగాణ మాత్రం ప్రజలు నిజాం నిరంకుశ పాలనలో మగ్గుతూ అనేక అవస్థలు పడుతున్నారనీ, రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మొహియొద్దీన్ లు ఇచ్చిన సాయుధ పోరాట పిలుపునందుకొని నిజాం సేనలతో దొరలు, భూస్వాములతో విరోచితంగా పోరాడి 4500 మంది కమ్యూనిస్టులు అమరులయ్యారన్నారు.
తొలి అమరుడు దొడ్డి కొమురయ్య, షేక్ బందగీ లాంటి ఎందరో వీరుల రక్తంతో తెలంగాణ గడ్డ ఎరుపెక్కిందన్నారు. 3వేల గ్రామాలు విముక్తి చేసి 10లక్షల ఎకరాల భూమిని పంచారన్నారు. ఇంతటి చారిత్రక పోరాటంను బీజేపీ హైజాక్ చేయాలని చూస్తుందని దుయ్యబట్టారు. అందుకే హిందూ, ముస్లిం మతోన్మాదాన్ని పెంచి పోషిస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వంకు చిత్తశుద్ధి ఉంటే సాయుధ పోరాట వారోత్సవాలను అధికారికంగా నిర్వహించాలని కోరారు. సీపీఐ నగర కార్యదర్శి కే. కనకరాజ్ అధ్యక్షతన జరిగిన సభలో నాయకులు తాళ్లపల్లి మల్లయ్య, కార్పొరేటర్ సూర్య, మాటేటి శంకర్, శనిగరపు చంద్రశేఖర్, ఆసాల రమ, రేణుకుంట్ల ప్రీతం, ఆసాల నవీన్, పడాల కనకరాజు, బూడిద మల్లేష్, కరీం, శనిగరపు తిరుమల, దుబాసి రేణుక, సుధీర్, కుమారస్వామి, జగన్, జైపాల్ రెడ్డి, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.