MLA Dr. Kalvakuntla Sanjay | కోరుట్ల, జూన్ 24: విద్యార్థుల బస్ పాస్ చార్జీల పెంపును ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పేర్కొన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్టీసీ ఉన్నతాధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల బస్ చార్జీల పెంపుపై పునరాలోచన చేయాలని అన్నారు. చార్జీల పెంపుతో విద్యార్థులు వారి తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడుతుందన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులపై ఛార్జీల పెంపు ప్రభావం చూపుతుందన్నారు.
బస్సు చార్జీల పెంపుపై విద్యార్థుల ఆందోళనను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం పెంచిన చార్జీలను ఉపసంహరించుకోవాలన్నారు. యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం కోరుట్ల, మెట్పల్లి డిపోల నుంచి బస్సు సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు పాఠశాల, కళాశాలలకు సకాలంలో చేరుకునేలా ఆర్టీసీ అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. కొన్ని గ్రామాల్లో బస్ స్టాప్ ల వద్ద బస్సులు ఆపకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నియోజకవర్గంలో బస్సు సౌకర్యం లేని ప్రాంతాలకు నూతనంగా బస్సులు నడిపించాలని తెలిపారు. ఆర్టీసీకి ఆదాయం వచ్చే రూట్లలో మరిన్ని బస్సులను పెంచాలని పేర్కొన్నారు.
బస్ స్టాప్ ల వద్ద బస్సులను ఆపాలని, మరిన్ని రిక్వెస్ట్ స్టాపులు ఏర్పాటు చేయాలని అధికారులను ఎమ్మెల్యే కోరారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మెట్పల్లి ఆర్టీసీ బస్టాండ్ లో ఫ్లాట్ ఫార్ములా పెంపు, నూతనంగా మూత్రశాలలు నిర్మించాలన్నారు. కోరుట్ల, మెట్పల్లి ఆర్టీసీ డిపోలో నెలకొన్న సమస్యలపై అధికారులతో చర్చించిన ఎమ్మెల్యే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. లీజు బేసిన్ లో ఉన్న మెట్పల్లి ఆర్టీసీ డిపోకు పర్మినెంట్ అలాట్మెంట్ వచ్చేలా చూడాలని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ రాజు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. కోరుట్ల, మెట్పల్లి డిపోలో అద్దె ప్రాతిపదికన త్వరలోనే వందమంది ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లను నియమించనున్నట్లు ఆర్ ఎం తెలిపారు.
రెండు డిపోలకు కొత్తగా 10 బస్సులు మంజూరైనట్లు వాటిని ఆయా డిపోలకు కేటాయించనున్నట్లు ఆర్ఎం తెలిపారు. కోరుట్ల నియోజకవర్గం డిపో పరిధిలోని అన్ని గ్రామాలకు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా బస్సులు నడిపేందుకు కృషి చేస్తామని ఆర్ ఎం హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో డీవీఏం భూపతి , కోరుట్ల డీఎం మనోహర్, ఆర్టీసీ అధికారులు, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.