కాళేశ్వరం ఎత్తిపోతల విషయంలో కాంగ్రెస్ సర్కారు వేసిన జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని హైకోర్టు తీర్పు ఇవ్వడాన్ని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు స్వాగతించారు. బుధవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సంబురాలు చేసుకున్నారు. హైకోర్టు తీర్పు రేవంత్ సర్కారుకు చెంపపెట్టులాంటిదని స్పష్టం చేశారు. కాళేశ్వరంపై బురద చల్లే ప్రయత్నాలు చేసినా.. కాంగ్రెస్ కుట్రలు బయటపడ్డాయని, ప్రజా సమస్యలు పక్కన పెట్టి ఆడిన డ్రామాలు తేటతెల్లం అయ్యాయని ధ్వజమెత్తారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బద్నాం చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ ఘోష్ కమిషన్ వేసిందని మండిపడ్డారు. ఎవరు కాదన్నా.. ఔనన్నా తెలంగాణకు కాళేశ్వరమే జీవధార అని పునరుద్ఘాటించారు.
కరీంనగర్ కార్పొరేషన్, ఏప్రిల్ 22: హైకోర్టు తీర్పుతో కాళేశ్వరం ప్రాజెక్టుపై గోబెల్స్ ప్రచారం పటాపంచలైందని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక పూర్తి తప్పులుగా ఉందంటూ ఇచ్చిన తీర్పును స్వాగతించారు. కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్‌లో ముందుగా పటాకులు పేల్చి, నృత్యాలు చేశారు. మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ స్వీట్లు పంచి పెట్టారు.
గంగాధర మండలం వెంకటాయపల్లి వద్ద బీఆర్ఎస్ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్వీట్లు పంపిణీ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా వద్ద జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత బీఆర్ఎస్ నాయకులతో కలిసి సంబురాలు చేశారు. మెట్పల్లి కొత్త బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ నాయకులు పటాకులు కాల్చారు. కోరుట్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పటాకులు కాల్చి సంబురాలు జరుపుకొన్నారు. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల ‘రేవంత్‌రెడ్డి పోవాలి.. కేసీఆర్ రావాలి’ ‘జై కేసీఆర్’ ‘జై తెలంగాణ” నినాదాలతో హోరెత్తించారు. హైకోర్టు తీర్పు రేవంత్ సర్కారుకు చెంపపెట్టులాంటిదని చెప్పారు. కాళేశ్వరం మదీ కాంగ్రెస్ చేసిన కుట్రలు, అబద్ధాలు కుప్పకూలాయని, కాళేశ్వరం నిటారుగా నిలబడిందని స్పష్టం చేశారు.

జీవధార కాళేశ్వరమే
తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు జీవధార. రాష్ర్టానికి గుండెకాయ లాంటిది. ఈ ప్రాజెక్టుపై ఇప్పటికైనా ప్రభుత్వం అసత్య ప్రచారాన్ని మానుకోవాలి. ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని హైకోర్టు తీర్పు ఇవ్వడం హర్షదాయకం. ఈ తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు. ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక అంతా బోగస్. దానిని చెత్తబుట్టలో వేయాల్సిందే. కమిషన్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యాన్ని దెబ్బ తీయాలనే రేవంత్ ప్రభుత్వ కుట్రలను తిప్పికొడుతూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం.
– సుంకె రవిశంకర్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే
అన్నదాతలందరికీ క్షమాపణ చెప్పాలి
స్వార్థ రాజకీయ అవసరాల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టుపై అసత్య ప్రచారం చేశారు. ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన స్టే బీఆర్ఎస్ పార్టీ నిజాయితీకి నిదర్శనం. రాజకీయ కక్షసాధింపు కోసం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ రైతులను ఆగం చేసింది కాంగ్రెస్. ఇప్పటికైనా రాజకీయ కుట్రలు పక్కన పెట్టి రైతన్నల కోసం పని చేస్తూ సాగునీటిని విడుదల చేయాలి. కల్పతరువులాంటి కాళేశ్వరం ప్రాజెక్టును రెండున్నరేళ్లుగా పడావు పెట్టిన రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా ముక్కునేలకు రాయాలి. రాష్ట్రంలో అన్నదాతలందరికీ క్షమాపణలు చెప్పాలి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మేడిగడ్డ బ్యారేజీలో స్వల్పంగా దెబ్బతిన్న రెండు పిల్లర్లను రిపేర్ చేయాలి. ప్రాజెక్టుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వ వైఖరిని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోంది. రైతుల పక్షాన పోరాం చేస్తూనే ఉంటాం.
– లోక బాపురెడ్డి, మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్
తెలంగాణకు ప్రాణేశ్వరం
ఎవరు ఔనన్నా, కాదన్నా.. తెలంగాణకు ప్రాణేశ్వరం ముమ్మాటికీ కాళేశ్వరమే. ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు స్టేను స్వాగతిస్తున్నాం. కల్పతరువు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును రెండున్నరేళ్లుగా పడావు పెట్టిన రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా రాష్ట్రంలోని అన్నదాతలకు క్షమాపణలు చెప్పాలి. భారత రాజ్యాంగానికి, చట్టాలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా దేశంలోని న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవని ఈ తీర్పుతో మరోసారి రుజువైంది. ప్రాజెక్టుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వ వైఖరిని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తున్నది. రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తాం. ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు బంద్ పెట్టి కుంగిన రెండు పిల్లర్లను రిపేర్ చేసి రాష్ట్ర రైతాంగానికి సాగునీరు అందించాలి.
– దావ వసంత, జడ్పీ మాజీ చైర్పర్సన్
బీఆర్ఎస్ నైతిక విజయం
కోర్టు తీర్పు కాంగ్రెస్‌కు చెంపదెబ్బ. బీఆర్ఎస్కు ఇది నైతిక విజయంగా మేం భావిస్తున్నాం. రేవంత్‌రెడ్డి కుట్ర పూరితంగా ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అంతా తప్పుల తడకగా భావించి తొలి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హై కోర్టు తీర్పునిచ్చింది.
– నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ ఎమ్మెల్సీ
హైకోర్టు తీర్పు హర్షనీయం
కేవలం కేసీఆర్‌ను బద్నాం చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఘోష్ కమిషన్ వేసింది. ఈ కమిటీ నివేదికలో ఎలాంటి విషయాలు లేవని కోర్టు చెప్పింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టులో అన్నీ తప్పుడు తడకలే తప్ప వాస్తవాలు ఏమీ లేవని చెప్పింది. ఈ రిపోర్టు ద్వారా కేసీఆర్, హరీశ్‌రావుపై ఎలాంటి చర్యలు తీసుకునే వీలు లేదని కోర్టు తీర్పు ఇవ్వడం హర్షనీయం.
– జీవీ రామకృష్ణారావు, బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు
బద్నాం చేసేందుకే కమిషన్
కాళేశ్వరం ప్రాజెక్టును, కేసీఆర్‌ను బద్నాం చేయాలని చూసి కాంగ్రెస్ సర్కారు బొక్కాబోర్లా పడింది. ఘోష్ కమిషన్ నివేదిక తప్పుల తడకలా ఉందని హైకోర్టు చెప్పింది. ఈ తీర్పు రేవంత్‌కు చెంపపెట్టులాంటింది. కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలందరూ అండగా ఉన్నారు. రేవంత్‌రెడ్డి పోయి కేసీఆర్ రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయం.
– చల్ల హరిశంకర్, బీఆర్ఎస్ కరీంనగర్ అధ్యక్షుడు
కుట్రలు బట్టబయలు
హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ కుట్రలు బట్టబయలయ్యాయి. రేవంత్‌రెడ్డి నిజస్వరూపం ప్రజలముందు తేటతెల్లమైంది. ఎవరెన్ని కుట్రలు చేసినా న్యాయస్థానాల్లో అంతిమంగా ధర్మమే విజయం సాధిస్తుందని, సత్యం నినదిస్తుందని ఈ తీర్పుతో మరోసారి నిరూపితమైంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్ష కట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టు చెంపపెట్టులాంటిదని తీర్పునిచ్చింది. విచారణ ప్రక్రియలో ప్రాథమిక హక్కులు, సహజన్యాయ సూత్రాలను విస్మరిస్తూ నడిపిన విచారణను న్యాయస్థానం తప్పుపట్టింది. కాళేశ్వరం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్పై బురద జల్లే ప్రయత్నం చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి తప్పుడు ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవపట్టించారు.
– డాక్టర్ శ్రీకాంత్‌రెడ్డి, డీసీఎమ్మెస్ మాజీ చైర్మన్