Chief Minister Revanth Reddy | పెద్దపల్లి, ఆగస్టు 28(నమస్తే తెలంగాణ): తెలంగాణకు గుండెకాయ, గోదావరి జలాలకు ప్రాణవాయు ఎల్లంపల్లి ప్రాజెక్టు అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా లోని ఎల్లంపల్లి ప్రాజెక్టును ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.లక్ష కోట్లు వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ కుంగిపోయిందని, దీనిపై అసెంబ్లీలో చర్చిస్తామని సీఎం అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో సాంకేతిక నైపుణ్యంతో నిర్మించడం వల్ల ఎల్లంపల్లి ప్రస్తుతం తెలంగాణకు వరప్రదాయినిగా మారిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో సాంకేతిక లోపాల వల్లే మేడిగడ్డ కూలిపోయిందన్నారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ లో సైతం సాంకేతిక లోపాలు ఉన్నందువల్లే వాటిలో నీళ్లు అందుకే నింపడం లేదన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీరు వస్తోందని, ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో పై అధికారులు సీఎంకు వివరించారు. నిర్మాణంలో లోపాలు ఉన్నందు వల్లే బ్యారేజీ కుంగిపోయిందని, మేడిగడ్డ బ్యారేజీలో నీటిని నింపితే కూలిపోయే ప్రమాదం ఉందని, దాంతో ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
వేలాది ఎకరాలు నీట మునిగే అవకాశాలున్నాయని, నిర్మాణ లోపాలు ఉన్నాయని నివేదికలో తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన లోపాలపై ఎన్డీఎస్ ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో చర్చిస్తామని పేర్కొన్నారు. సీఎం వెంట భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్తో పాటు పలువురు అధికారులు, నాయకులు ఉన్నారు.