రాష్ట్ర సర్కారు అమలు చేస్తున్న గొప్ప పథకాల్లో ఒకటైన దళితబంధుకు మరోసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2021లో ప్రారంభమైన ఈ పథకాన్ని హుజూరాబాద్ నియోజవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయగా, మిగతా నియోజకవర్గాల్లో దశలవారీగా అమలు చేస్తున్నది. అందులో భాగంగా 2022లో ప్రతి నియోజకవర్గానికి 100 యూనిట్లు కేటాయించింది. ఈ యేడాది యూనిట్ల సంఖ్యను ఒక్కో నియోజకవర్గానికి 1,100కు పెంచింది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలు కాగా, గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీవో, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోందని ఎస్సీ కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు.
– కరీంనగర్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ)
కరీంనగర్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న దళితబంధు పథకం మరోసారి అమలు చేస్తున్నారు. ఈసారి ఒక్కో నియోజకవర్గానికి 1,100 యూనిట్లు కేటాయించడంతో వారు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం దేశంలోనే గొప్పదిగా మారింది. జీవనాధారం తక్కువగా ఉండే దళితులు జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. రాష్ట్రంలోని కొన్ని మండలాలతోపాటు జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుని అమలు చేశారు. హుజూరాబాద్‌లో 18,021 మందికి ఈ పథకం కింద లబ్ధి చేకూర్చింది. ఇక్కడ కూడా కొత్తగా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల దరఖాస్తులు పరిశీలిస్తున్నది. అయితే, మిగతా నియోజకవర్గాల్లో 2022లో ఒక్కో నియోజవర్గానికి 100 యూనిట్ల చొప్పున కేటాయించారు. స్థానిక శాసనసభ్యుల కాన్సెంట్‌తో అధికారులు ఆ యూనిట్లను గ్రౌండింగ్ చేశారు. గత బడ్జెట్లో కేటాంచినట్లుగా ఈసారి యూనిట్ల సంఖ్యను భారీగా పెంచింది. ఈ మేరకు ఒక్కో నియోజకవర్గానికి 1,100 యూనిట్లు కేటాయించారు.
కొనసాగుతున్న దరఖాస్తుల స్వీకరణ
దళితబంధు పథకం కోసం అధికారులు ఈసారి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టారు. ముందుగా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ప్రతి ఎంపీడీవో కార్యాలయం, పట్టణాల్లో అయితే మున్సిపల్ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ పథకం కింద లబ్ధి చేకూరుతుందో? లేదో? అనే సందేహాలు, అపోహలు చాలా మంది దళితుల్లో ఉన్న నేపథ్యంలో ఈ పథకం అమలు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, వచ్చిన ప్రతి దరఖాస్తుకు దశల వారీగా ఆర్థిక సహాయం అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ విషయాన్ని గతంలోనే సీఎం కేసీఆర్ ప్రకటించారు. అందుకు అనుగుణంగానే అధికారులు కూడా దశల వారీగా లబ్ధి చేకూర్చేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్నారు. ఈసారి చేసుకున్న దరఖాస్తుల్లో ఆర్థిక సహాయం అందించిన తర్వాత మిగిలిన దరఖాస్తులు తమ వద్దనే ఉంటాయని, వాటికి మరోసారి కేటాయింపులు జరిగినప్పుడు సహాయం అందిస్తామని అధికారులు చెబుతున్నారు. కాగా, ఈసారి యూనిట్ల కేటాయింపు ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానున్నది. ఈసారి 21 ఏండ్ల నుంచి 60 ఏండ్లలోపు ఉన్నవారే దరఖాస్తు చేసుకోవాలని, వారికే ప్రాధాన్యత ఉంటుందని అధికారులు సూచిస్తున్నారు.