
Godavarikhani
Godavarikhani | కోల్ సిటీ, మార్చి 27: రాములోరి కల్యాణ వేడుక కనుల పండువగా సాగింది. అభిజిత్ లగ్నంలో రాముడు, జగన్మాత సీతమ్మ మెడలో మాంగళ్యధారణ ఘట్టం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గోదావరిఖనిలోని శ్రీ కోదండ రామాలయం అశేష భక్త జనవాహినితో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్, మనాలి ఠాకూర్ దంపతులు, మేయర్ మహంకాళి స్వామి దంపతులు పట్టు వస్త్రాలు, తలంబ్రాలతో రాగా, దేవస్థానం చైర్మన్ గట్ల రమేష్, ఈవో శంకరయ్య, ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు.
ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆ దేవ దేవుడి కల్యాణ వైభోగాన్ని కనులారా వీక్షించి భక్తులు పులకించారు. మేళ తాళాలు, భక్తుల జయజయ ధ్వానాల మధ్య ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా వేదిక వద్దకు తీసుకరాగా, స్వామివారికి ఎమ్మెల్యే, మేయర్ లు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. అర్చకులు కల్యాణ సామగ్రికి సంప్రోక్షణ గావించి రక్షాబంధనం నిర్వహించి యోక్త్రధారణ చేశారు. 12 దర్బలతో ప్రత్యేకంగా అల్లిన తాడుని సీతమ్మవారికి అలంకరించారు. సీతారాములకు రక్తాబంధనం కట్టి స్వామి గృహస్త ధర్మం కోసం యజ్ఞోప వితరణ చేసి కన్యావరణ నిర్వహించి తాంబూలాది సత్కారాలు అందించారు. స్వామివారి పాదప్రక్షాళన చేసి మహాదానలు సమర్పించారు. భక్త రామదాసు సమర్పించిన పచ్చలహారం, ఆభరణాలను ఉత్సవ మూర్తులకు అలంకరించారు. కల్యాణ వైభవంను చాటుతూ చూర్ణికను పఠించిన అనంతరం వేద మంత్రోచ్ఛారణాలు మార్మోగుతుండగా జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని సీతరాముల శిరస్సుపై ఉంచారు.
ఈ కల్యాణ కమనీయ వేడుకను కనులారా భక్తులు వీక్షించి తన్మయత్వం పొందారు. భక్తుల రామ నామస్మరణ మధ్య జగదభిరాముడు జానకమ్మను మనువాడాడు. రాముడు దోసిట తలంబ్రాలు నీలపురాసులుగా జానకి దోసిట తలంబ్రాలు మనిమాణిక్యాలై సాక్ష్యాత్కరించిన వేళ సీతారాముల పరిణయ ఘట్టం ముగిసింది. అనంతరం ఉత్సవ మూర్తులను పల్లకిలో ఊరేగించి గర్భగుడిలోకి తీసుకవెళ్లారు.
కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, ఏసీపీ మడత రమేశ్, ట్రాఫిక్ ఏసీపీ, సింగరేణి జీఎం లలిత్‌కుమార్, ఆలయ ఈవో ఎం.శంకరయ్య, సీనియర్ అసిస్టెంట్లు సుధాకర్, అశోక్, ఆలయ ప్రధాన అర్చకులు, సుమారు 50వేల చిలుకు భక్తులు పాల్గొన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ ఇంద్రసేనా రెడ్డి భారీ బందోబస్తు చేపట్టారు. అలాగే నగరంలోని జవహర్‌నగర్, తిలక్ న గర్, మార్కండేయ కాలనీ, విఠల్ నగర్, మారుతి నగర్, బస్టాండ్ కాలనీ తదితర ప్రాంతాలలో గల హనుమాన్ ఆలయాల్లో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి.