స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో రాష్ట్ర సర్కారు చేసిన ఆగానికి ఆశావహుల జేబులు గుల్లా అయ్యాయి. ఒకరిద్దరు కాదు.. ప్రభుత్వం చూపించిన అశల సవ్వడిలో ఓలయాడిన వేలాది మంది తమ సామర్థ్యానికి మించి ఇప్పటికే ఖర్చు చేశారు. నామినేషన్లు, ఎన్నికలకు అత్యంత తక్కువ సమయం ఉండడంతో.. రిజర్వేషన్లు ఖరారు కాగానే.. ఖర్చుల ప్రక్రియ ఆరంభం కాగా.. ఇందులో ఎక్కువ శాతం బీసీ అభ్యర్థులే నష్టపోయారు. ప్రభుత్వ మాటలు నమ్మి.. 42 శాతం రిజర్వేషన్ల ద్వారా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవాలన్న ఆకాంక్షతో బరిలోకి దిగిన బీసీ అభ్యర్థులు పెట్టిన ఖర్చులు ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీరు అయిందన్న ఆవేదన వ్యక్తమవుతోంది.
-కరీంనగర్, అక్టోబర్ 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
“జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులు భయపడాల్సిన పనిలేదు. 2029 వరకు మీకు మీ పదవులకు ఎలాంటి ఢోకా లేదు. నిరభ్యంతరంగా మీరు నామినేషన్ వేసి పోటీ చేయొచ్చు. మీ పదవీ కాలం ముగిసేవరకు పూర్తి గ్యారెంటీ ప్రజా ప్రభుత్వమే తీసుకుంటుంది. కాబట్టి, నిరభ్యంతరంగా పోటీ చేసి గెలవండి. గెలిచిన అభ్యర్థుల పదవులు మధ్యలోనే పోతాయని అపోజిషన్‌కు చెందిన బీఆర్ఎస్, బీజేపీ నాయకులు చేసే దుష్ప్రచారాలు నమ్మొద్దు. నిస్సందేహంగా మీరు పోటీ చేయండి. పోటీ చేసి గెలిచిన అభ్యర్థులకు ప్రజా ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సపోర్ట్ పుష్కలంగా ఉంటుంది.
(గత వారం రోజులుగా.. ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ మంత్రి గ్రూపులో చక్కర్లు కొట్టిన మెస్సేజ్ ఇది. ఇప్పుడు ఇది కనిపించకుండా పోయింది)
స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో సర్కారు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఒకవైపు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇచ్చిన జీవోపై హైకోర్టులో కేసు నడుస్తుండగానే.. రిజర్వేషన్లు ప్రకటించడం, నోటిఫికేషన్ జారీచేయడం.. అక్కడితో ఆగకుండా.. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి తేదీలను ప్రకటించడం వంటివి ఆగమేఘాల మీద చేసింది. ఆర్భాటపు ప్రచారం చేసి.. ఎన్నికలు ఖచ్చితంగా జరుగుతాయనే భ్రమను కల్పించింది.
ఒకవైపు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇచ్చిన జీవో న్యాయస్థానాల్లో నిలువదని న్యాయనిపుణులు, రాజకీయ విశ్లేషకులు పదేపదే చెప్పినా.. హస్తం పార్టీ, ప్రభుత్వం ఏమాత్రం వినకుండా.. ముందుకు వెళ్లింది. ఆ మేరకు.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి మొదటి విడుత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఈనెల 9 నుంచి 11 వరకు అలాగే, రెండో విడుత ఈ నెల 13 నుంచి 15 వరకు స్వీకరించడానికి ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది.
ఆ మేరకు మొదటి విడుత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఈ నెల 23న, రెండో విడుత 27న జరిగేలా షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అలాగే, గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు విడుతల్లో నిర్వహించాలని నిర్ణయించగా.. ఉమ్మడి జిల్లాలో మొదటి విడుత నామినేషన్లు ఈ నెల 17 నుంచి 10 వరకు, రెండో విడుత ఈ నెల 21 నుంచి 23 వరకు, మూడో విడుత ఈ నెల 25 నుంచి 27 వరకు స్వీకరించేందుకు షెడ్యూల్ విడుదల చేసింది.
సర్పంచ్ మొదటి విడుత ఎన్నికలు ఈ నెల 23న, రెండో విడుత 27న, మూడో విడుత వచ్చేనెల 8న నిర్వహించేందుకు ఆదేశాలు విడుదలయ్యాయి. ముందుగా రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ప్రకటనలు జారీ కావడం.. ఆ వెంటే షెడ్యూల్ విడుదల కావడం.. ఆ తదుపరి నోటిఫికేషన్ విడుదల చేసి, ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో వాయిదా పడే ప్రసక్తే లేదన్నట్లుగా ప్రభుత్వం హడావుడి చేసింది.
జేబులు గుల్లా?
కోర్టులో కేసు ఉందని తెలిసినా.. సర్కారు చేసిన హడావుడిని నమ్మిన ఆశావహులు వారి ప్రయత్నాల్లో మునిగితేలారు. ఆ మేరకు భారీగా ఖర్చులు పెట్టుకున్నారు. నిజానికి ఎన్నికల నిబంధనల ప్రకారం చూస్తే.. జడ్పీటీసీ రూ.4 లక్షలు, ఎంపీటీసీ రూ.1.5 లక్షల లోపు ఖర్చుచేయాలి. సర్పంచ్, వార్డు మెంబర్ల విషయానికొస్తే.. ఐదు వేలకు పైగా జనాభా ఉంటే.. అక్కడ సర్పంచ్ బరిలో ఉండేవారు రూ.2.5 లక్షలు, వార్డుమెంబర్ రూ.50 వేలు.. అలాగే, ఐదు వేల లోపు జనాభా ఉంటే సర్పంచ్‌కు రూ.1.5 లక్షలు, వార్డుమెంబర్‌కు రూ.30 వేలు ఖర్చు చేయాలని ఎన్నికల సంఘం విడుదల చేసిన నిబంధనల్లో పేర్కొంది.
సాధారణంగా ఏ ఎన్నికలైనా.. ఎన్నికల సంఘం సూచించే ఖర్చుకు… అభ్యర్థులు క్షేత్రస్థాయిలో పెట్టే డబ్బులకు ఏమాత్రం పొంతన ఉండదన్న విషయం అందరికీ తెలిసిందే. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు కూడా వీటికి అతీతం కాదు. ఒక్కో జడ్పీటీసీ ఆయా మండలాల్లో ఉన్న పోటీని బట్టి.. దాదాపు రూ.20 నుంచి రూ.50 లక్షల వరకు, అలాగే ఎంపీటీసీలు రూ.10 నుంచి రూ.20 లక్షల వరకు ఖర్చు పెడుతారు. సర్పంచ్‌లు అయితే.. మేజర్ పంచాయతీల్లో రూ.20 నుంచి రూ.30 లక్షలు, మైనర్ పంచాయతీలైతే రూ.10 నుంచి రూ.15 లక్షల వరకు ఖర్చులు పెడుతారు.
నిజానికి కొన్ని స్థానాల్లో ఇంతకు రెండింతలు కూడా అయ్యే అవకాశాలుంటాయి. ఎన్నికలు పక్కాగా జరిగి తీరుతాయని, 42 శాతం రిజర్వేషన్లు అమలుచేసి తీరుతామంటూ.. ప్రభుత్వం, మంత్రులు పదే పదే చెప్పడం.. మరోవైపు రిజర్వేషన్లు ప్రకటించి షెడ్యూల్ విడుదల చేయడంతో చాలా చోట్ల పోటీదారులు రంగంలోకిదిగారు. తమ గెలుపుకోసం.. గ్రామాలు, మండలాల్లో దావతులు ఏర్పాటు చేశారు. పలు సంఘాలకు డబ్బులు ఇచ్చి తమవైపు తిప్పుకొనే ప్రయత్నాలు ఆరంభించారు.
పోటీదారుల్లో కొంత మంది ఒక అడుగు ముందుకేసి.. పలువురు నాయకుల నుంచి మద్దతు కూడగట్టేందుకు.. అలాగే, సదరు నాయకులు పోటీచేయకుండా ఉండేందుకు ఒప్పందాలు చేసుకొని కొంత ముట్టజెప్పారు. ఇంకా మిగిలిన మొత్తానికి కొన్ని చోట్ల ప్రామిసరీ నోట్, మరికొన్ని చోట్ల పెద్ద మనుషుల మధ్య ఒప్పందాలు, ఇంకొన్ని చోట్ల చెక్కులు కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. చాలా ప్రాంతాల్లో ఆశావహులు ఇప్పటికే.. 50 శాతం నుంచి 60 శాతం డబ్బు ఖర్చు చేశారన్న చర్చ సాగుతోంది. తీరా ఎన్నికలు వాయిదా పడడంతో.. జేబులు గుల్లా చేసుకున్న నాయకులు ఆందోళన చెందుతున్నారు.
బీసీలే ఎక్కువ బాధితులు?
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సర్కారు జీవో ఇచ్చిన విషయం తెలిసిందే. గతంలో 23 శాతం ఉండేది. ప్రభుత్వం తాజాగా, ఇచ్చిన జీవో ప్రకారం చూస్తే 19 శాతం రిజర్వేషన్ పెరిగింది. దీంతోపాటు.. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తూ.. జడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీలను ప్రకటించింది. దీంతో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా బీసీ నాయకులు ఆయా స్థానాల్లో రంగంలోకి దిగారు.
నిజానికి ప్రభుత్వం ఇచ్చిన జీవో న్యాయస్థానాల్లో చెల్లదని, అది చట్టబద్ధంగా లేదంటూ.. న్యాయనిపుణులు, రాజకీయ విశ్లేషకులు చెప్పినా.. వాటిని మరిపించే విధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఆర్భాటపు ప్రచారం చేశారు. రిజర్వేషన్లపై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని, ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని, నిర్భయంగా పోటీ చేయాలని, మీ పోస్టులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిది గ్యారెంటీ అంటూ.. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు వారివారి వాట్సాప్ గ్రూపుల్లో మెస్సేజ్‌లు పెట్టి.. ఎన్నికల రంగంలోకి దిగే విధంగా ప్రేరేపించారు. మరో అడుగు ముందుకు వేసి.. ఏకంగా కొంత మందికి ఫోన్‌చేసి పోటీచేయాలని సూచించారు.
దీంతో.. సదరు ఆశావహులు రంగంలోకి దిగి ఖర్చులు పెట్టుకున్నారు. తీరా ఇప్పుడు చూస్తే.. ఎన్నికలు వాయిదా పడ్డాయి. అలాగే.. 42 శాతం జీవో నిలిచే పరిస్థితి లేదు కాబట్టి.. ప్రస్తుతం ప్రకటించిన వాటిలో ఎస్సీ, ఎస్టీ మినహా బీసీల రిజర్వేషన్లు భారీగా మారే అవకాశం ఉంది. అదే జరిగి రిజర్వేషన్లు కలిసి రాకపోతే ఇప్పటి వరకు చేసిన ఖర్చులు, పెట్టిన డబ్బులకు ఎవరు బాధ్యత వహిస్తారన్న చర్చ ప్రస్తుతం హస్తం పార్టీలో నడుస్తోంది. ఒకవేళ రిజర్వేషన్లు కలిసి వచ్చినా.. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియని పరిస్థితి ఉందని, అప్పటి వరకు.. మళ్లీ తిరిగి ఖర్చు పెట్టుకుంటే తప్ప.. మనుగడ ఉండదని భావిస్తున్నారు.
అంటే సర్కారు చేసిన హడావుడి, నమ్మించిన తీరుకు భారీగా జేబులు గుల్లా చేసుకొని నష్టపోయామన్న అవేదన, బాధ ప్రస్తుతం బీసీ వర్గాల అభ్యర్థుల్లో వ్యక్తమవుతోంది. ఇన్నాళ్లు మేమున్నామంటూ.. చెప్పిన నాయకులు ఆర్థికంగా నష్టపోయిన తమకు అండగా నిలుస్తారా? అన్న వాదనలు, ప్రతిపాదనలు ప్రస్తుతం అధికార పార్టీలో సాగుతున్నాయి. ముఖ్యమంత్రి మాటలు, ప్రభుత్వం చేసిన హడావుడిని నమ్మి ఆర్థికంగా చితికిపోయే పరిస్థితి వచ్చిందన్న అవేదన వ్యక్తమవుతోంది. మున్ముందు ఈ పరిస్థితులు ఎటువైపు దారి తీస్తాయోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.