pensioners | కోరుట్ల, మే 18: రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ల సమస్యలు సత్వరమే పరిష్కరించాలని తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోనీ తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ కోరుట్ల డివిజన్ శాఖ కార్యాలయంలో జరిగిన పెన్షనర్స్ సంఘం నాయకుల సమావేశానికి ముఖ్య అతిధిగా హజరై మాట్లాడారు.
రిటైర్మెంట్ పొంది పది నెలలు గడిచిన విరమణ ప్రయోజనాలు అందక పోవడంతో విశ్రాంత ఉద్యోగులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పిల్లల వివాహలు, ఇంటి నిర్మాణం, ఆరోగ్య సమస్యలు, తదితర అవసరాల కోసం డబ్బులు అందక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విశ్రాంత ఉద్యోగులకు ఆరోగ్య పరిరక్షణ కోసం కేటాయించిన ఆరోగ్య కార్డులపై నగదు రహిత వైద్య సేవలు అందడం లేదన్నారు.
పెండింగ్లో ఉన్న డీఏలతో పాటు పీఆర్సీ వేతనాన్ని సత్వరం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. సమావేశంలో టీపీసీఏ జిల్లా ఉపాధ్యక్షుడు యాకూబ్, కోశాధికారి గౌరిశెట్టి విశ్వనాథం, కోరుట్ల డివిజన్ అధ్యక్షుడు పబ్బా శివానందం, కార్యదర్శి గంటేడి రాజ్ మోహన్, వర్కింగ్ ప్రెసిడెంట్ చిలుక గంగారాం, అసోసియేట్ అధ్యక్షుడు రాజేశ్వర్, కోశాధికారి లక్ష్మీ నారాయణ, ఉపాధ్యక్షుడు సైఫోద్దీన్, సంయుక్త కార్యదర్శి రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.