Powerloom Workers | రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్, ఆగస్టు 18: సిరిసిల్లలోని పవర్లూమ్ అనుబంధ రంగాల కార్మికులకు ప్రభుత్వం నుండి రావాల్సిన స్క్రిప్టు డబ్బులు కాలయాపన లేకుండా వారి ఖాతాల్లో జమ చేయాలని పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వద్ద కార్మికులతో కలిసి సోమవారం ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ పవర్లూమ్ అనుబంధ రంగాలైన వార్పిన్ వై పని ఆసాములు, కండెలు చుట్టేవాళ్ళు, జాఫర్ స్వస్థ పరిశ్రమ అనుబంధ సంఘాల కార్మికులు ఈ పథకంలో చేరి మూడు సంవత్సరాలు అవుతుందన్నారు. ఈ పథకం కాలపరిమితి అయిపోయిన ప్రభుత్వం వారికి రావాల్సిన డబ్బులు చెల్లించడం లేదని వాపోయారు.
కాగా కార్మికులు జమ చేసిన డబ్బులు మాత్రమే జమ కావడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చేనేత జౌళి శాఖ అధికారులు మే నెలలోనే కార్మికులకు తృప్తి డబ్బులు అందిస్తామని ప్రకటించిన ఇప్పటివరకు కార్మికులు ఖాతాల్లో డబ్బులు జమ చేయలేదని మండిపడ్డారు. కొత్తగా ప్రారంభమయ్యే తృప్తి నేతన్న పొదుపు పథకానికి సంబంధించి జూన్ నెల నుండి కట్టుకునే అవకాశం కల్పించాలన్నారు. 2023 సంవత్సరం బతుకమ్మ చీరల వస్త్రానికి సంబంధించి సిరిసిల్ల పరిశ్రమ టెక్స్టైల్ పార్కులోని కార్మికులకు రావాల్సిన 10శాతం యారన్ సబ్సిడీ డబ్బులు వెంటనే అందించాలన్నారు. టెక్స్టైల్ పార్కులో ఉత్పత్తి అవుతున్న సోషల్ వెల్ఫేర్ ప్రభుత్వ ఆర్డర్ వస్త్రానికి కార్మికులకు కూలి గిట్టుబాటు అయ్యేలా రోజుకు కనీసం రూ.వెయ్యి వేతనం వచ్చే విధంగా కూలీ పెంచాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో జిల్లా అధ్యక్షుడు కోడం రమణ, దేవదాస్, కూచన శంకర్, సిరిమల్లె సత్యం, బెజిగం సురేష్, ఎలిగేటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.