BRS Leaders | రుద్రంగి, నవంబర్ 20: రుద్రంగి మండలం మానాల, గిరిజన తండా రైతులు పండించిన వరి, మొక్కజొన్న ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దేగావత్ తిరుపతి డిమాండ్ చేశారు. రుద్రంగి మండలం మానాల గ్రామంలో వైస్ ఎంపీపీ పీసరి భూమయ్య, బీఆర్ఎస్ నాయకులతో కలిసి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దేగాపత్ తిరుపతి గురువారం విలేకరులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే ఉమ్మడి మానాల రైతులు అత్యధికంగా మొక్కజొన్న పంటను సాగు చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో దాదాపు 90 శాతం మంది గిరిజన రైతులకు కేసీఆర్ ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇచ్చి ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ కారణంగా పోడు పట్టాల పంపిణీ నిలిచిపోయిందన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వంలో వర్జినల్ పట్టాలు ఉన్న రైతుల నుండి మాత్రమే అధికారులు వరి, మొక్కజొన్నలు కొనుగోలు చేయకపోవడంతో రైతులు ధాన్యాన్ని రోడ్లపై ఆరబోసి పడిగాపులు కాస్తు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ప్రతీ రైతు పండించిన చివరి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకునే పరిస్థితి లేదన్నారు. రెండు రోజులుగా మానాల గ్రామానికి వచ్చిన ప్రభుత్వ విప్‌కు రోడ్లపై ఆరబోసి పడిగాపులు గాస్తున్న రైతుల కష్టాలు కనబడతలేదా అని ప్రశ్నించారు. నెల రోజుల క్రితం ఫారెస్టు భూములను తొలగించి చదును చేసిన విషయంలో అడవులను కాపాడాలని మానాల గ్రామస్తులంతా ఏకతాటిపైకి వచ్చి కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించగా స్థానిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ లబ్ధి కోసమే గ్రామంలోని కుల సంఘాల మధ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు కుట్రలు పన్ని రెండు కూల సంఘాల నాయకులు చేర్చుకోవడం జరిగిందన్నారు.
గతంలో ఫారెస్టు భూములును కాపాడాలని చెప్పిన కాంగ్రెస్ నాయకులు ఫారెస్టు భూములను తొలగించి చదును చేసిన వారిపై కేసులను తీసివేస్తామని ప్రలోభాలకు గురి చేస్తూ వారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో చేరితేనే పోడు భూములకు పట్టాలు ఇస్తామని, వారి ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తామని తండాల్లో ప్రజలను కాంగ్రెస్ నాయకులు ప్రలోభాలకు గురి చేస్తున్నారన్నారు. అభివృద్ధి చేసి ప్రజలకు దగ్గర కావాలి తప్ప కేసులు తీసివేస్తామని చెప్పి పార్టీలోకి చేర్చుకోవడాన్ని మానాల ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు గుగులోత్ మోహన్, మంగిలాల్, రమణయ్య, బీఆర్ఎస్ నాయకులు నరేష్‌నాయక్, నాయిని రాజేశం, గజన్‌లాల్, భూమనాయక్, తిరుపతితో పాటు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.