CITU | కోల్ సిటీ, సెప్టెంబర్ 29: జీవో నం.12ను ప్రభుత్వం వెంటనే సవరించాలని సీఐటీయూ అనుబంధ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ రాంమ్మోహన్ డిమాండ్ చేశారు. గోదావరిఖని శ్రామిక భవన్ లో సోమవారం పెద్దపల్లి జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా 4వ మహాసభలు రెండో రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయని, ప్రధానంగా భవన నిర్మాణ కార్మికుల చట్టం, అంతర్రాష్ట్ర వలస కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లలో విలీనం చేశారని పేర్కొన్నారు.
సెస్ నిధులను కార్మికుల సంక్షేమంకు ఖర్చు చేయకుండా ఇతర శాఖలకు మళ్లిస్తున్నారని అన్నారు. కార్మికులకు రావల్సిన బెనిఫిట్స్ ప్రైవేటు బీమా కంపెనీలకు అప్పచెప్పి ప్రభుత్వం చేతులు దులుపుకుందన్నారు. సమస్యలు, హక్కుల సాధనకు భవన నిర్మాణ కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా తుంగపిండి మల్లేష్, ప్రధాన కార్యదర్శిగా వేల్పుల కుమారస్వామి, కోశాధికారిగా గుండు కనకయ్య, ఉపాధ్యక్షులుగా గౌరక్కగారి శ్రీనివాస్, మధు, మురుకుంట్ల భారతి, సదానందం, మంథని సమ్మయ్య, సహాయ కార్యదర్శులుగా సీపెల్లి రవీందర్, రాసపెల్లి పరమేష్, విజయలక్ష్మి, స్వామి, కొంరయ్యతోపాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో భవన నిర్మాణ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.