KTR | కార్పొరేషన్, మే 4 : రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు విపక్ష నేతలు, బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టి వేధించడం కాదని, ప్రజల భద్రత, రక్షణ కల్పించేందుకు పని చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పాలనలో కరీంనగర్‌ను సేఫ్ సీటీగా మార్చేందుకు ప్రత్యేక చొరవ తీసుకొని 769 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, కానీ రేవంత్‌రెడ్డి పాలనలో పట్టపగలే తుపాకులతో దుండుగులు వచ్చి నగల షాపును దొచుకొని పోయే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. ఇంత జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కరీంనగర్లో ఆదివారం జరిగిన పీఎంజే నగల షాపు దోపిడీ దుండగుల దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కేటీఆర్ సోమవారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పీఎంజే నగల షాపునూ పరిశీలించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ కరీంనగర్ చరిత్రలోనే ఇలాంటి దుర్మాగమైన సంఘటన జరగలేదన్నారు. ఐదుగురు దుండగులు తుపాకులతో వచ్చిన నగల షాపును దొచుకొవటం దురదృష్టకరమన్నారు. దుండగులు జరిపిన కాల్పుల్లో షాపు సిబ్బంది చనిపోయారన్న భయంతో దుండుగులు పారిపోయారే తప్ప పోలీసుల రావడంతోనో.. ప్రభుత్వ స్పందన వల్లో జరగలేదన్నారు.
కేసీఆర్ పాలనలో రైతులకు రైతుబంధు, 24 గంటల కరెంటు ఇవ్వటం, నీటి వనరులను వినియోగంలోకి తీసుకురావటం వల్ల దేశంలోనే వ్యవసాయంలో హర్యానా, పంజాబ్‌లను దాటుకొని ముందు వరుసలో నిలబడిందన్నారు. కానీ కాంగ్రెస్ పాలనలో బీహార్, ఉత్తరప్రదేశ్‌ను దాటి నేరాల్లో ముందంజలో ఉండే దౌర్భగమైన పరిస్థితిలో రాష్ట్రం ఉందన్నారు. సంఘటన జరిగి 32 గంటలు గడిచిపోయినా ఇప్పటి వరకు వారిని పట్టుకోలేదంటూ ఎంత హీనస్థితిలో పోలీసు వ్యవస్థ ఉందో అర్థం చేసుకొవచ్చునన్నారు. శాంతిభద్రత పర్యవేక్షించాల్సిన శాఖ ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉందని, మరి ఆయన ఏం చేస్తున్నారో.., వారి పోలీసులు ఏం చేస్తున్నారో.. అర్థం అవుతుందన్నారు. కేసీఆర్ హాయంలో కరీంనగర్‌ను సేఫ్ సిటీగా మార్చాలన్న ఆలోచనతో నగరంలో 769 సీసీ కెమెరాలను ప్రత్యేక చోరవ తీసుకొని ఏర్పాటు చేయటంతో పాటుగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం కూడా చేశామన్నారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అపార్ట్మెంట్లు, ఇతర గేటెడ్ కమ్యూనిటీల ద్వారా నగరంలో వేల సంఖ్యలో సీసీ కెమెరాలు ఏర్పాటు అయ్యాయన్నారు. నగరం సేప్ సీటీగా ఉండాలని, ఎవరైనా నేరం చేయాలంటే భయపడే విధంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. పట్టపగలే దుండుగులు తుపాకులతో దోపిడీ చేస్తుంటే నగరంలోని పోలీసులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు.
సోషల్‌మీడియాలో పోస్టులు పెడితే జైలుకు పంపడమేనా.. పోలీసుల పని
ఎప్పుడో 20 ఏళ్ల కిత్రం కేసులను ముందుకు తీసుకువచ్చి బీఆర్ఎస్ కార్పొరేటర్లను జైల్‌కు పంపించటం, బీఆర్ఎస్ యువత ఏవైనా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే పోన్లు చేసి బెధిరించటం, ఒక ట్వీట్ చేస్తే 20 రోజులు జైల్లో పెట్టటం ఇదేనా పోలీస్ అంటే అని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎంత అరాచకమైన పరిపాలన, శాంతిభద్రతలు అనేవి ఎక్కడ లేకుండా పోయయన్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్ నేరాల్లో పోటీ పడే పరిస్థితికి వచ్చిందన్నారు. సేప్ రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ రెండున్నర పాలనలో అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోతున్నాయన్నారు. సంఘటన జరిగిన వెంటనే అన్ని వైపుల నాకాబందీ చేసి తక్షణ చర్యలు చేపట్టి ఉంటే దుండగులను పట్టుకునే అవకాశం ఉండేదని తెలిపారు. ఇప్పటి వరకు వారిని పట్టుకోలేదని ఎంత చేతగానికి ప్రభుత్వం ఉందో అర్థం అవుతుందన్నారు.
పోలీసులు అంటే రాజకీయ కక్ష సాధింపు వ్యవస్థగా, కొనుగోలు కేంద్రాల వద్ద విపక్షాలు ధర్నా చేస్తే అరెస్టులు చేయటానికి మాత్రమే పోలీసులు ఉంటారా.. అని ప్రశ్నించారు. ప్రజలకు భద్రత కల్పించే విషయంలో పోలీసులు పని చేయరా అని నిలదీశారు. శాంతిభద్రతలు నిర్వహించటం లాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రజల్లో మనోధైర్యం నింపాటానికి ఏం కార్యక్రమాలు చేయరా..? అని ప్రశ్నించారు. ఎంత సేపు సోషల్ మీడియాలో పోస్టు పెడితే వేధించడమే పోలీసుల పనా అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి ప్రజలకు శాంతిభద్రతలు కాపాడే శక్తి ఉందా లేదా అని ప్రశ్నించారు. సంఘటన స్థలానికి ముందే కోర్టు ఉందని, కూత వేటు దూరంలో కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి ఉంటారని, ఎప్పుడు వందల మంది పోలీసులు అక్కడే ఉంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇంత మంది పోలీసులు ఉండి ఏం చేస్తున్నారో ఆలోచన చేయాలన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్‌రెడ్డి కూర్చోవటం కాదని, శాంతిభద్రతలను కమాండ్ చేయటం నేర్చుకోవాలన్నారు. బీఆర్ఎస్ నేతలను వెంటబడి వేధించటం కాదు చేతనైతే ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే పోలీసులు, ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాల్సినా అవసరం ఉందన్నారు.
ఒక్క మంత్రి జాడలేదు..
సంఘటన జరిగి నలుగురు సిబ్బందికి తుపాకీ గాయాలు అయితే ప్రభుత్వం నుంచి ఒక్క మంత్రి అయినా వచ్చి పరిశీలించారా..? అని ప్రశ్నించారు. ఇక్కడ ముగ్గురు మంత్రులు ఉన్నారని, ఒక్కరి సమయం దొరకటం లేదా అని నిలదీశారు. ప్రభుత్వం ఇప్పటికైనా మెలుక్కొని ప్రజలక శాంతిభద్రతలు కల్పించాల్సినా అవసరం ఉందన్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. బీఆర్ఎస్ హాయంలో ప్రజలకు ప్రెండ్లీ పోలీస్ వ్యవస్థ ఉన్నా శాంతిభద్రతలు కాపాడే విషయంలోనూ అన్ని తీరుల్లో సౌకర్యాలు పోలీసులు అందించటం జరిగిందన్నారు. కరీంనగర్ పోలీసులు బీఆర్ఎస్ నాయకులను వెధించటం, బీఆర్ఎస్ కార్పొరేటర్లపై కేసులు పెట్టి జైల్లో వేయటం ఇదే పని చేయటం తప్ప మరొకటి చేయటం లేదన్నారు. వీటి అన్నింటిని తాము గుర్తు పెట్టుకుంటామని, కాంగ్రెస్ ప్రైవేటు సైన్యంగా పని చేస్తూ అత్యుత్సాహం చూపిస్తున్న పోలీసులను తాము అధికారంలోకి వచ్చిన తర్వాత విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు. ప్రజలకు రక్షణ కల్పించకుండా బీఆర్ఎస్ నాయకులను వేధించే పోలీసులను తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి స్థానిక పోలీసులు కూడా వెంటనే ఆ దుండగులను పట్టుకోవాలని సూచించారు. బండి సంజయ్ కోట్లాది రూపాయాలు కుమ్మరించి మున్సిపల్ ఎన్నికల్లో అత్తెసరుగా గెలుపొందారని విమర్శించారు. బండి సంజయ్‌కి శవాలు, శివాలు తప్ప ఆయన ఏం తెలుసని ప్రశ్నించారు. సంజయ్ విమర్శిస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని, హోం శాఖ, పోలీసులను విమర్శించాలి తప్ప బీఆర్ఎస్ ఎందుకు విమర్శిస్తున్నారని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డిపై ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్ పాడి కౌశిక్ రెడ్డి, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకే రవి శంకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.