కరీంనగర్ కలెక్టరేట్, జూన్ 28: ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం సేకరణకు ఊరూరా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. సెంటర్ల నిర్వహణ బాధ్యతను ఐకేపీ, సింగిల్విండోలు, మార్కెట్ కమిటీలకు అప్పగిస్తున్నది. ఇందులో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల నిర్వహణను స్వశక్తి సంఘాలకు అప్పగించారు. ఈ క్రమంలో మహిళలు విజయవంతంగా వడ్లను కొనుగోళ్లు పూర్తి చేశారు. గత వానకాలం(2022-23)లో జిల్లాలో 52 కొనుగోలు కేంద్రాల ద్వారా 8037 మంది రైతుల నుంచి 80.29కోట్ల విలువైన 3,89,788 క్వింటాళ్లు సేకరించారు. గత సీజన్ కంటే ఈసారి 43,790 క్వింటాళ్లు అధికంగా కొనుగోలు చేశారు. సమిష్టి కృషి, సమన్వయంతో నిర్దేశించిన లక్ష్యానికి పైగా సేకరించారు. తేమ శాతం పరిశీలన, సంచుల సరఫరా, తూకం వేయించడం, లారీల్లో లోడ్ చేయించడం, రైతుల నుంచి సేకరించిన ధాన్యం సక్రమంగా రికార్డులు రాయడం, మిల్లులకు ధాన్యం లోడులు పంపడం లాంటి పనులు విభజించుకుని రైతులకు ఎలాంటి ఇబ్బందిలేకుండా పూర్తి చేశారు. కరీంనగర్ జిల్లాలో 15 మండలాలు ఉండగా, 11 మండలాల్లో ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఈసారి చొప్పదండి మండలం పెద్దకూర్మపల్లి సెంటర్లో అత్యధికంగా ధాన్యం కొనుగోలు చేసి, 6,67, 328 కమిషన్ పొందారు. తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామ వీవో 5,73,491, చిగురుమామిడి మండలం ఇందుర్తి వీవో 5,45,024, బొమ్మనపల్లి వీవో 4,35,072, రామడుగు వీవో 3,91,347ల కమిషన్ పొందాయి. కాగా, 2016-17 నుంచి 21-22 దాకా జిల్లా వ్యాప్తం గా ఉన్న వీవోలకు ధాన్యం సేకరణ ద్వారా 26.90 కోట్ల కమిషన్ లభించగా, పౌరసరఫరాల శాఖ క్వింటాల్ గ్రేడ్ ఏ రకం ధాన్యానికి 32, కామన్కు 31.25 చొప్పున కమిషన్ చెల్లిస్తోంది. ఈ సీజన్లో కోటీ 38లక్షల 28 వేల కమిషన్ అందనున్నదని ఐకేపీ అధికారులు తెలిపారు.
ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించాం. వారు పని విభజన చేసుకొని విజయవంతంగా కొనుగోళ్లు పూర్తి చేశారు. రికార్డుల నిర్వహణ, తేమశాతం పరిశీలన, మిల్లులకు ధాన్యం పంపడం, వాహనాలను అందుబాటులో ఉంచడం తదితర పనులను పక్కాగా పూర్తి చేశారు. సంఘాలకు ఏటా కోటిన్నర నుంచి రెండు కోట్ల వరకు కమిషన్ వస్తుండగా. ఈ మొత్తాన్ని సమానంగా పంచుకుంటూ స్వావలంబన దిశగా సాగుతున్నారు.
– ఎల్ శ్రీలత, డీఆర్డీవో ( కరీంనగర్)
అధికారులు విధించే నిబంధనల మేరకు రెం డు సీజన్లలో ధాన్యం కొనుగోలు చేశాం రైతులు తెచ్చిన ధాన్యాన్ని తేమ శాతం చూసిన తర్వాత తూకం వేశాం. బస్తాలను మిల్లులకు తరలించి, ట్రక్ సీటు రాగానే రైతుల వివరాలు ఉన్నతాధికారులకు పంపినం. వెంటనే ధా న్యం డబ్బులు వారి ఖాతాల్లో జమ చేశారు. ధాన్యం సేకరణ పూర్తి కాగానే మాకు కూడా కమిషన్ లెక్క చేసి అందజేస్తుంటారు.
– శ్రీరాముల నర్సవ్వ, ఇందుర్తి (సెంటర్ నిర్వాహకురాలు)