రుణమాఫీ ప్రక్రియ అంతా సినిమా సిత్రాలను తలపిస్తున్నది. పక్కా లెక్కలు, విధివిధానాలు లేకుండా మాఫీ మాయలా మారింది. మొదటి విడతలో లక్ష లోపు మాఫీ చేస్తున్నామని విస్తృత ప్రచారం చేసినా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి ముక్కున వేలేసుకునేలా ఉన్నది. 25 వేల రుణం తీసుకున్న రైతులకు కాని మాఫీ.. రెండు లక్షల పైచిలుకు రుణగ్రహీతలకు రెండు వేలు లేదా మూడు వేలు మాఫీ అయినట్టు మెస్సేజ్‌లు రావడం విస్మయం కలిగిస్తున్నది. మరోవైపు ఒక కుటుంబంలో నలుగురు అన్నదమ్ములుంటే.. ఒక్కరికి మాత్రమే మాఫీ అయింది. ఈ పథకానికి ఏ నిబంధనలు అమలు చేశారో.. ఎందుకు లక్షలాది మందికి రాలేదో అర్థంకాని పరిస్థితి నెలకొన్నది. వ్యవసాయ విస్తరణ అధికారులకు రుణమాఫీ పోర్టల్ లాగిన్ అవకాశం ఇవ్వగా, అది చూస్తే రకరకాల కారణాల వల్ల మాఫీ కానట్టు చూపుతున్నది. దీంతో మాఫీ జరగని రైతులు తిరిగి ఎలా క్లెయిమ్ చేసుకోవాలన్న దానిపై ఇప్పటి వరకు లిఖిత పూర్వక ఆదేశాలు రాకపోవడంతో అధికారులు సతమతమవుతున్నారు. మౌఖిక ఆదేశాలు ఒక్కో రకంగా వస్తుండడంతో తలలు పట్టుకుంటున్నారు. ఇటు రైతులు కూడా దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
కరీంనగర్, జూలై 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రుణమాఫీకి అసలు ఏ నిబంధనలు వర్తింపజేశారో అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఉమ్మడి జిల్లాలో రెండు లక్షల పైచిలుకు ఉన్న కొంత మందికి రెండు వేల నుంచి మూడు వేలు మాఫీ అయినట్టు మెస్సేజ్‌లు రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. అలాగే లక్షకు పైబడి ఉన్న వారిలో కొంత మందికి ఇదే తరహా మెస్సేజ్‌లు వచ్చాయి. నిబంధనల ప్రకారం చూస్తే లక్ష వరకు ఉన్న రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగినట్టు ప్రభుత్వం చెబుతున్నది. అలాంటప్పుడు ఆ పై రుణం ఉన్న వారికి మాఫీ అయినట్టు మెస్సేజ్‌లు రావడంపై ఎవరి వద్ద్దా స్పష్టత లేదు. దీంతో పాటు లక్షల మంది పేర్లు జాబితాలో గల్లంతయ్యాయి.
బ్యాంకుల వద్దకు వెళ్లి అడిగితే.. వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈవో)లను అడగాలని చెబుతున్నారు. ప్రభుత్వం ఏఈవోలకు లాగిన్ ఇచ్చింది. వారు దానిని ఓపెన్ చేసి చూస్తే.. అందులో ఒక్కొక్కరికీ ఒక్కోరకంగా చూపిస్తున్నాయి. కొంతమందికి టెక్నికల్ ఎర్రర్ అని, మరికొంతమందికి కుటుంబ సభ్యుల గురించి విచారణ చేయాలని, మరికొంత మందివి అధార్‌కార్డు లింకు లేదని, ఇంకొంతమందికి కారణాలు ఏమీ లేకుండా ఖాళీగా కనిపిస్తున్నాయి. అంటే ఒక్కొక్కరిది ఒక్కో కారణం చెబుతున్నా.. దానికి పరిష్కారం ఏమిటన్నది మాత్రం అధికారులు చెప్పడం లేదు. వారి వద్ద కూడా సమాధానం లేదు. అంతే కాదు, రుణమాఫీ వర్తించని రైతులకు ఎలా న్యాయం చేస్తారు? వారు ఏమైనా మళ్లీ పత్రాలు సమర్పించాలా..? లేక బ్యాంకులకు వెళ్లాలా..? లేక గ్రామస్థాయిలో అధికారులను కలువాలా..? అన్నదానిపై ఎక్కడా స్పష్టత లేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మెజార్టీ గ్రామాల్లో 40 శాతం మంది రైతులకు మాఫీ జరిగితే.. ఇంకా 60 శాతం మంది అధికారులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మొత్తంగా చూస్తే.. సోమవారం వరకు కొంత మేరకైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందని రైతులకు అధికారులు సర్ది చెబుతున్నారు. ఏది ఏమైనా రైతుల నుంచి వ్యక్తమవుతున్న ప్రశ్నలకు అధికారులు సమాధానాలు చెప్పలేని పరిస్థితిలో కొట్టు మిట్టాడుతున్నారు.
లక్ష వరకు రైతులు తీసుకున్న రుణం మాఫీ చేసినట్టుగా ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే లక్షలాది మంది పేర్లు రుణమాఫీలో గల్లంతయ్యాయి. ఈ విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. జిల్లా సహకార బ్యాంకు పరిధిలో మొత్తం 130 ప్రాథమిక సహకార వ్యవసాయ పరపతి సంఘాలున్నాయి. వీటి పరిధిలో 58,577 మంది రైతులు లక్ష వరకు రుణం తీసుకున్నారు. వీరు తీసుకున్న మొత్తం 165.88 కోట్లు. నిజానికి వీరంతా లక్ష రుణమాఫీకి అర్హులు. కానీ, తాజాగా 32,240 మందికి మాత్రమే మాఫీ అయింది. ఇంకా 26,337 మందికి మాఫీ కా వాల్సింది. వీరికి మాఫీ అవుతుందా..? లేదా..? అన్నదానిపై ఎవరి వద్దా స్పష్టత లేదు. అందులోనూ కొన్ని సహకార సంఘా ల పరిధిలో ఒక్క రైతుకు కూడా మాఫీ కాకపోవం గమనార్హం.
పెగడపల్లి, జూలై 20: రుణమాఫీ విచిత్రంగా జరుగుతున్నది. రూ.లక్షలోపు రుణాల జాబితాలో వందలాది మంది పేర్లు గల్లంతయ్యాయి. పెగడపల్లి, నంచర్ల, నందగిరి ప్రాథమిక సహకార సంఘాల పరిధిలో రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్నవారు 1540 మంది ఉండగా, అందులో సగం మందికి మాఫీ కాలేదు. పెగడపల్లి సంఘంలో 714 మంది రైతులుంటే కేవలం 156 మందికి మాత్రమే మాఫీ జరిగింది. 558 మంది రైతుల పేర్లు గల్లంతయ్యాయి. నంచర్ల సంఘంలో 613 మందికి 368 మందికి మాత్రమే లబ్ధి కలిగింది. ఇక నందగిరి సంఘంలో 213 మందికి 126 మందికి మాత్రమే మాఫీ జరిగింది. మొత్తంగా మూడు సంఘాల పరిధిలో 890 మంది పేర్లు గల్లంతయ్యాయి. రైతులు సహకార సంఘాల సిబ్బందిని సంప్రదిస్తే, తాము అందరి పేర్లు పంపించామని, వివరాలు తమకు కూడా పూర్తిగా తెలియదని చెబుతున్నారని రైతులు వాపోతున్నారు.
నేను గతేడాది జూలైల హుజూరాబాద్ యూనియన్ బ్యాంకుల రెండెకరాల వ్యవసాయ భూమి కుదువ పెట్టి 92 వేలు రుణం తీసుకున్న. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చెప్పినట్టు 2023 డిసెంబర్ 9 తేదీలోపు తీసుకున్న వ్యవసాయ రుణమాఫీ పథకంల నా అప్పు మాఫీ కాలే. లిస్ట్‌ల నా పేరు లేకపోవడంతో బ్యాంకుకు వెళ్లి అడిగితే ఇక్కడ ఏమీ ఉండదని చెప్పిన్రు. దీంతోకేసీ క్యాంపులోని రైతువేదిక దగ్గరికి వెళ్లి ఏఈవోను అడిగితే ఓపిగ్గా పరిశీలించిన్రు. నా భార్య రమ పేర 97 వేల అప్పు ఉందని, అందుకే మాఫీ కాలేదు కావచ్చని సమాధానం చెప్పిన్రు. నా భార్య పేరు మీద గుంట భూమి కూడా లేదు. అలాంటప్పుడు అప్పు ఎలా ఇస్తరు.. లేని అప్పును ఉన్నట్లు చూపెట్టడంతో నాకు రుణమాఫీ కాలె.
– గూడూరి రవీందర్‌రెడ్డి, ఇప్పల్ నర్సింగాపూర్ (హుజూరాబాద్ మండలం)
గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసినట్టే అందరికీ రుణమాఫీ చేయాలి. ఈ ప్రభుత్వం చెప్పిన డేట్‌లోపే నేను ఎస్బీఐలో క్రాప్ లోన్ కోసం ఐప్లె చేసుకున్న. కానీ, బ్యాంకులో టెక్నికల్ ఇష్యూతో రెండు రోజులు ఆలస్యం కావడంతో నేను అర్హున్ని కాదట. ఇదేంది అసలు. మాఫీ అంటే అందరికీ చేయాలి. కానీ, ఇలా కొర్రీలు పెట్టి ఎంతో మందిని అనర్హులుగా చేసి డిస్సప్పాయింట్ చేసింది రేవంత్‌రెడ్డి ప్రభుత్వం. నేనెందుకు అర్హున్ని కాదో చెప్పాలి. ఇప్పుడు నా లోన్ బ్యాంకు వాళ్లు మాఫీ చేస్తరా.. ప్రభుత్వం చేస్తదా?
– కాలువ తిరుపతి, గుండ్లపల్లి (తిమ్మాపూర్)
మాది ఎక్లాస్పూర్. మా నాన్న 2017లో కేడీసీసీ బ్యాంకులో ఎకరం పొలానికి 30వేల లోన్ తీసుకున్నడు. 2018లో ఆయన జరిగిపోయిన తర్వాత ఏడాదికోసారి మిత్తి కడుతూ రెన్యువల్ చేయిస్తున్నం. అయినా ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ లిస్ట్‌ల మా నాన్న పేరు లేదు. బ్యాంకుకు వెళ్లి అడిగితే మా చేతిలో ఏమీలేదని అంటున్నరు. టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్జేత్తే నోట్ చేసుకున్నమని చెప్పి కట్ చేసిన్రు. సీఎం సారేమో లక్ష మాఫీ చేసినమంటున్నడు. మరీ మాదేందుకు కాలేదు.
– ఎడ్ల శ్రీనివాస్, ఎక్లాస్పూర్ (మంథని మండలం)
నాకు ఎకరానికి పైగా ఎవుసం భూమి ఉన్నది. 2021లో మంథని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో 40వేల లోన్ తీసుకున్న. ఏడాదికోసారి రెన్యువల్ చేయిస్తున్న. ప్రభుత్వం మొన్న రుణమాఫీ చేసిందని తెలుసుకుని సంతోషపడ్డ. కానీ, రుణమాఫీ లిస్ట్ చూస్తే నా పేరులేదు. నాకు కిసాన్ పథకం కింద ఏడాదికి 6వేలు వస్తున్నయి. లోన్మాఫీ కోసం ప్రభుత్వం పెట్టిన రూల్స్‌కు లోబడే ఉన్న. అయినా మాఫీ ఎందుకు కాలేదో అర్థమయితలేదు. అధికారులను అడిగితే రెండురోజుల్లో చెప్తమంటున్నరు.
– తెలుసూరి స్వప్న, రైతు, బిట్టుపల్లి (మంథని)
నాకు మూడెకరాల భూమి ఉంది. 2018లో 99 వేల క్రాప్‌లోన్ తీసుకున్న. ఎప్పటికప్పుడు రెన్యూవల్ చేసుకుంటూ వస్తున్న. సర్కారు చేసిన రుణమాఫీ లిస్టుల నాపేరే లేదు. మాఫీ అయిద్దో లేదో? కూడా తెల్వదు. కేసీఆర్ హయాంలో రుణమాఫీకి ఎలాంటి కొర్రీలు పెట్టలేదు. కటాఫ్ డేట్ అంటూ లేకుండా మాఫీ చేసిండు. అధికారంలోకి రాకముందు రైతులందరికీ రూ.రెండు లక్షల రుణమాఫీ అన్నరు. ఇప్పుడేమో కటాఫ్ డేట్ అంటూ చెప్పి తప్పించుకుంటున్నరు. కొందరికే ఇచ్చి అందరికీ ఇచ్చినట్టు చెప్పుకునేందుకే ఈ నాటకం. ఇత్తే అందరికీ ఇయ్యాలె. మేం రైతులం కాదా..? కాంగ్రెస్ సర్కారు వచ్చినంక బతుకులు మారుతయనుకున్నం. కరెంటే సక్కగుంటలేదు. ఎవుసం ఎట్ల నడుత్తదో? మళ్ల పొలాల కాడ కావలి కాసుడే అయితదేమో ? సూత్తుంటే భయమేస్తుంది.
– ల్యాగాల బాగయ్య, రైతు (పెద్దూరు)
ఈ యేడాది తొలకరి పలకరించగానే రైతులు పత్తి విత్తనాలు విత్తారు. అవి మొలకెత్తే దశలో వర్షం ముఖం చాటేయడంతో ఆందోళన చెందారు. కాగా, ఇటీవల కురుస్తున్న కొద్దిపాటి వర్షాలకు పత్తి మొలకెత్తడంతో రైతుల ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే పత్తి చేనులో మొక్కలు ఎదుగుతుండగా, హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
– ఫొటోగ్రాఫర్, రాజన్నసిరిసిల్ల