వ్యవసాయాన్ని పండుగలా మార్చడమే లక్ష్యంగా అనేక సంస్కరణలు చేపడుతున్న సర్కారు, చిన్న, సన్నకారు కర్షకులతోపాటు దళిత రైతులకు అండగా నిలుస్తున్నది. సాగును లాభసాటిగా మార్చి, ఆర్థిక భరోసా కల్పించేందుకు ఉపాధి హామీ పథకం కింద పండ్ల తోటల సాగును ఉద్యాన వన, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రోత్సహిస్తున్నది. ఐదెకరాల్లోపు భూమి, జాబ్ కార్డు ఉన్న రైతులపై సాగు ఖర్చుల భారాన్ని తగ్గించడంతోపాటు అటు కూలీలకు చేతినిండా పనికల్పించేందుకు పండ్లతోటల సేద్యాన్ని ఉపాధి హామీ పథకంతో అనుసంధానించింది. నాలుగేండ్ల దాకా ప్రభుత్వమే బాధ్యత తీసుకుని మొక్కలు అందించడంతోపాటు నిర్వహణ నిధులను వెచ్చించనుండగా, రైతుల నుంచి విశేష స్పందన వస్తున్నది. సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో ప్రక్రియ వేగవంతమైంది రెండు జిల్లాల్లో ఇప్పటికే 3325 ఎకరాల్లో సేద్యానికి 1114 మంది దరఖాస్తు చేసుకోగా, కర్షక ఉపాధి కూలీల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
– రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 13(నమస్తే తెలంగాణ)/హుజూరాబాద్/ మారుతీనగర్
రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ)/హుజూరాబాద్/మారుతీనగర్: వ్యవసాయం లాభసాటిగా మారాలంటే పెట్టుబడులు తగ్గాలి. దిగుబడులు పెరగాలి. నాణ్యంగా ఉండాలి. పంటకు మార్కెట్లో మంచి ధర రావాలి. అప్పుడే రైతన్న ఆరుగాలం కష్టానికి ఫలితం ఉంటుంది. ఆదాయం సమకూరుతుంది. దీనిని సాధ్యం చేసేందుకే రాష్ట్ర సర్కారు అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా ఐదెకరాల్లోపు భూమి ఉన్న ఎస్సీ, ఎస్టీలు, ఇతర చిన్న, సన్నకారు రైతులను ప్రోత్సహించి ఆర్థిక భరోసా కల్పించే విధంగా పండ్లతోటల సాగు విధానాన్ని తీసుకువస్తున్నది. రైతుల ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తూ స్వరాష్ట్రంలోనే నాణ్యమైన పండ్ల ఉత్పత్తి పెంచడం, మరోవైపు వానకాలంలో ఉపాధి పనులు ఉండక ఇతర వృత్తులవైపు కూలీలు వెళ్తుండడాన్ని నివారించడం వంటి బహుళ ప్రయోజనాలతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. మరోవైపు పండ్లతోటల్లో అంతర పంటలుగా ఆకుకూరలు, కాకర, చిక్కుడు, బెండ, గోరుచిక్కుడు, దోస, టమాట, సోరకాయ లాంటి కూరగాయలు సాగు చేసుకునే అవకాశం కల్పించగా, రైతుకు మరింత మేలు కలుగనున్నది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 3935 ఎకరాలు..
ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు ఇస్తుండగా, జిల్లాలో ఏయేటికాయేడు సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. ఇప్పటికే వేలాది ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. అయితే మరో 3935 ఎకరాల్లో పంటల విస్తీర్ణం పెంపే లక్ష్యంగా ఉద్యానశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఇప్పటికే పల్లెపల్లెలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, రైతుల్లో చైతన్యం తెస్తున్నాయి. అయితే ఈ సారి జిల్లాలో 15రకాల పండ్లతోటలు సాగు చేయాలన్న లక్ష్యం మేరకు అధికారులు ముందుకు పోతున్నారు. మామిడి 500, నిమ్మ 500, బత్తాయి 1500, జామ 400, సీతాఫలం 200, సపోటా 50, మునగ 200, డ్రాగన్‌ప్రూట్ 325, అల్లనేరేడు 10, దానిమ్మ 50, కొబ్బరి 200 ఎకరాల్లో సాగు చేయించాలని ప్రణాళికలు తయారు చేశారు. ఇప్పటివరకు జిల్లాలో 1175 ఎకరాల్లో సాగుకు 382 మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఐదెకరాల్లోపు చిన్న, సన్నకారు రైతులు అర్హులు..
ఉపాధి హామీ పథకంలో పండ్ల తోటల పెంపకానికి ఎస్సీ, ఎస్టీ, చిన్న మరియు సన్నకారు రైతులు మాత్రమే అర్హులు, మొత్తం కుటుంబ సభ్యులకు కలిపి 5 ఎకరాల్లోపు ఉండాలి. పండ్ల తోటలు సాగు చేసే రైతులకు ఉపాధి జాబ్ కార్డు కలిగి ఉండాలి. బోరు లేదా బావి ఉండి కరెంటు సౌకర్యం కలిగి ఉండాలి. దరఖాస్తు ఫారంతోపాటు పట్టాదారు పాసు పుస్తకం, బ్యాంకు ఖాతా, ఆధార్‌కార్డు, ఉపాధి హామీ జాబ్‌కార్డు జిరాక్స్ ప్రతులు, మూడు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలతో గ్రామపంచాయతీ కార్యదర్శి, ఏఈవో, ఏపీవోల్లో ఎవరికైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
జగిత్యాల జిల్లాలో 1865 ఎకరాల్లో ప్రణాళిక..
జిల్లాలో ఇప్పటికే 65 వేల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. అయితే మరో 1865 ఎకరాల్లో పంటల విస్తీర్ణం పెంపే లక్ష్యంగా ఉపాధి పథకంలో హార్టికల్చర్ ద్వారా 13 రకాలైన మామిడి, నిమ్మ, నారింజ, జీడి మామిడి, ఆమ, సీతాఫలం, సపోట, ఆయిల్ఫామ్, నేరేడు, ఆపిల్ బేర్, దానిమ్మ, మునగ, డ్రాగన్‌ఫ్రూట్, కొబ్బరి తోటల పెంపకం చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో ఉపాధి హామీ పథకం ఫీల్డ్ ఆఫీసర్లు జాబ్ కార్డులున్న రైతులకు, ఉపాధి హామీ కూలీలకు అవగాహన కల్పించగా, ఇప్పటివరకు 2150 ఎకరాల్లో సాగుకు 732 మంది దరఖాస్తు చేసుకున్నారు.
ప్రయోజనం ఇలా..
ఇందులో ఎస్సీ, ఎస్టీలకు వందశాతం రాయితీతో ప్రయోజనాలు కల్పించనున్నది. ఇతర వర్గాలకు 90శాతం సబ్సిడీ ఇవ్వనున్నది. ఆయా వర్గాల రైతులకు మొక్కలతో పాటు బిందుసేద్యం పరికరాలను రాయితీపై అందజేస్తారు. తోట సాగుకు ఉపాధిహామీ పథకంలో గుంతలు తీయటానికి, మొకలు నాటడానికి, మొకకు ఊత కర్ర కట్టడానికి, మొక కొనుగోలుకు, ఎరువులు వేయడానికి, నెల నెల పర్యవేక్షణకు ప్రభుత్వం నిధులు రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. నాలుగేండ్ల వరకు ప్రభుత్వమే బాధ్యత తీసుకుని మొక్కలతో పాటు నిర్వహణ నిధులను రైతుల బ్యాంకు ఖాతాలో నేరుగా జమచేయనున్నారు.
ప్రజల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి
వానకాలంలో పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడేవాళ్లం. కానీ సీఎం కేసీఆర్ మాకు పని కల్పించి కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. 2009 నుంచి ఉపాధి హామీ పనులు చేస్తున్నా. ఏ ప్రభుత్వం కూడా మాలాంటోళ్ల గురించి ఆలోచించిన పాపాన పోలే. ఏ కాలమైన మా కుటుంబాలకు కష్టాలు రాకుండా చూసుకునే సారుకు జీవితాంతం రుణపడి ఉంటం.
– వేల్పుల శ్రావణి, ఉపాధి హామీ కూలీ, చౌలమద్ది
చిన్న, సన్నకారు రైతులకు ఎంతో మేలు
నాకు నాలుగెకరాల భూమి ఉంది. రోజు రోజుకూ పెరుగుతున్న కూలీల కొరత, ఖర్చులతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా. ముందు చూపుతో పంటలకు ఖర్చు పెట్టకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ చిన్న, సన్నకారు రైతులకు ప్రోత్సాహకాలను అందిస్తూ పండ్ల తోటల సాగుకు చేస్తున్న కృషి అభినందనీయం. రైతులకు అండగా నిలుస్తున్న కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
– గన్నారపు గోపీ, రైతు, ఇబ్రహీంపట్నం
రైతులకు గొప్ప అవకాశం
పండ్ల తోటలు పెంచే రైతులకు ఇది సువర్ణ అవకాశం. ప్రభుత్వం అనేక రకాల ప్రోత్సాహకాలిస్తున్నది. అటు కూలీలకు పని కల్పించడంతోపాటు రైతులకు మేలు చేసేందుకు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. సాధారణ పంటలతో పోల్చితే ఉద్యాన తోటలతో అధిక లాభాలుంటాయి. రైతులు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలి.
– రాణా ప్రతాప్‌సింగ్, జగిత్యాల జిల్లా ఉద్యానవన అధికారి
పండ్ల తోటలతో మస్తు లాభాలు..
నాకున్న 12 ఎకరాల భూమిలో నాడు వరి, పత్తి వేసిన. ఎప్పుడు ఒకే రకంగా వేసిన పంటలతో బాగా నష్టపోయిన. మార్కెట్లో డిమాండ్‌ను గుర్తించి పండ్ల తోటల సాగు చేసిన. 20గుంటల్లో తైవాన్ జామ మొక్కలు పెట్టిన. హోల్‌సెల్ కిలోకు రూ.65కు అమ్మిన. రిటైల్ రూ.100కు అమ్మిన. రూ.2లక్షల లాభం వచ్చింది. దుక్కులు దున్ని, అచ్చుగట్టి వరి పండించినా అంత లాభం ఎన్నడూ రాలేదు. అందుకే పండ్ల తోటలను సాగు చేస్తున్నా. తెలంగాణ సర్కారు అందిస్తున్న ప్రోత్సాహంతో డ్రాగన్‌ప్రూట్, సపోట, పనస, ఇంకా రకరకాల పండ్ల తోటలు పెట్టాలనుకుంటున్నా. రైతులకు మంచి లాభాలు వస్తాయంటే అవి పండ్లతోటలతోనే.
– నాంపెల్లి నీలకంఠం రైతు, నర్సింగాపూర్, బోయినిపల్లి మండలం