కాల్వశ్రీరాంపూర్/ ఓదెల, సెప్టెంబర్ 9 : కాంగ్రెస్ అంటనే మోసమని, ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలని హామీ ఇచ్చి నిండా ముంచిందని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఇప్పుడు పాలన చేతగాక, రైతులు పండించిన ధాన్యం కొనలేక, సన్నవడ్లకు బోనస్ చెల్లించే పరిస్థితి లేకనే రాష్ట్రంలో యూరియా కృత్రిమ కొరతను సృష్టిస్తున్నదని మండిపడ్డారు. యూరియా కొరత తీర్చాలని, ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఓదెలలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఐరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ముందుగా బీఆర్ఎస్ కార్యకర్తలతో ర్యాలీ తీశారు. తహసీల్ ఆఫీస్ ఎదుట రోడ్డుపై ధర్నా చేశారు. అలాగే కాల్వశ్రీరాంపూర్‌లో ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు.
ఆయా చోట్ల మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు. రైతులకు అండగా ఉంటామని గొప్పలు చెప్పి, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. చిరుపొట్ట దశలో ఉన్న వరికి యూరియా అందక రైతులు అరిగోస పడుతున్నారని, ఇది ప్రభుత్వానికి కనిపించడంలేదా..? అని ప్రశ్నించారు. రైతులను నిలువునా ముంచిన ‘రేవంత్ ప్రభుత్వం డౌన్‌డౌన్’ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ప్లకార్డులు ప్రదర్శించారు. రైతు బంధు, సన్నవడ్లకు బోనస్, రుణమాఫీ, మహిళలకు పెన్షన్, వృద్ధులకు రెట్టింపు పింఛన్, కల్యాణ లక్ష్మి పథకంలో తులం బంగారం వంటి అనేక పథకాలు సరిగా అమలు చేయక కాంగ్రెస్ మోసగిస్తున్నదని ఆరోపించారు. కేసీఆర్ పేద ప్రజల సంక్షేమంతో పాటు తెలంగాణను అన్ని విధాల అభివృద్ధి చేసినట్లు వివరించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పారు. అనంతరం ఆయా మండలాల తహసీల్దార్లకు వినతి పత్రాలు అందజేశారు.
కరీంనగర్ తెలంగాణచౌక్, సెప్టెంబర్ 9 : రాష్ర్టానికి సరిపడా యూరియా వెంటనే తెప్పించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ నాయకులు మంగళవారం కరీంనగర్‌లోని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ ఇంటిముట్టడికి యత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి పోలీసు శిక్షణా కేంద్రానికి తరలించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ, కేంద్ర నుంచి రాష్ట్ర రైతాంగానికి సరిపడా యూరియా తెప్పించడంలో రాష్ర్టానికి చెందిన బీజేపీ మంత్రులు, ఎంపీలు విఫలమయ్యారని ఆరోపించారు. యూరియా దొరకక రైతులు నానా అవస్థలు పడుతుంటే, కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ర్టాలకు అధిక యూరియా సరఫరా చేస్తూ, బీజేపీయేతర రాష్ర్టాలకు అందించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రాష్ర్టంలో బీజేపీ మంత్రులు, ఎంపీలను తిరగన్విమని హెచ్చరించారు. ఇక్కడ సీపీఐ నాయకులు లక్ష్మి, శ్రీనివాస్, మచ్చ రమేశ్, యుగేంధర్, పద్మ, కొట్టె అంజలి, బాపురెడ్డి, రాము, హేమంత్, రాజయ్య పాల్గొన్నారు.
రామడుగు, సెప్టెంబర్ 9 : యూరియా కొరతపై రైతుల నుంచే కాదు, సొంత పార్టీ నాయకుల నుంచి కూడా నిరసన వ్యక్తమవుతున్నది. తప్పని పరిస్థితుల్లో రోడ్డెక్కాల్సి వస్తున్నది. మంగళవారం యూరియా అందించాలని కోరుతూ రామడుగు మండలం వెదిరలో కాంగ్రెస్ నాయకులే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులను కూడగట్టి రాస్తారోకో చేశారు. వెదిర సింగిల్‌విండో గోదాం వద్ద కాంగ్రెస్ నాయకులు మారుతి, రాళ్లబండి పురుషోత్తంరెడ్డి ఆధ్వర్యంలో ముత్యం శేఖర్‌గౌడ్, ఎడవెల్లి రాజిరెడ్డి, బీజేపీ నాయకులు ఆర్వీఎస్ఎన్ రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ తొరికొండ అనిల్‌కుమార్ రైతులతో కలిసి జాతీయ రహదారి-563పై గంటకు పైగా బైఠాయించారు. ఎరువుల కోసం రైతులు ఇబ్బంది పడుతున్నారని వాపోయారు. ఆందోళనతో ఇరువైపులా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోగా, ఎస్ఐ రాజు నాయకులతో మాట్లాడి నిరసన విరమింపజేశారు. రాస్తారోకోలో బీఆర్ఎస్ నాయకులు సత్యనాయణరెడ్డి, జగన్మోహన్రెడ్డి, అనిల్, భూమయ్య, రైతులు, తదితరులు పాల్గొన్నారు.