DCP Bhukya Ram Reddy | ఓదెల, మార్చి 12: విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని పెట్టుకుని సమాజంలో గుర్తింపు వచ్చేలా చదువుకోవాలని పెద్దపల్లి డీసీపీ భూక్య రామ్ రెడ్డి కోరారు. ఓదెల మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో మండలంలోని అన్ని పాఠశాలల పదో తరగతి విద్యార్థులకు ‘పోలీసులు మీకోసం’ లో భాగంగా గురువారం పరీక్ష సామగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పరీక్షల పట్ల భయం పోయే విధంగా పలువురు అవగాహన కల్పించారు.
ఈ సమావేశంలో డీసీపీ రామ్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లో చదివిన అనేకమంది ఈ రోజుల్లో గొప్ప స్థానాల్లో ఉన్నారని వివరించారు. చదువు పట్ల క్రమశిక్షణ, ఏకాగ్రత, పట్టుదల ఉంటే మీ లక్ష్యం సాధించడానికి సులువుగా ఉంటుందన్నారు. విద్యార్థులు ఉన్నతంగా ఎదుగుతే మీతో పాటు మీ తల్లిదండ్రులకు సమాజంలో గౌరవం పెరుగుతుందన్నారు. ఇందుకు పేద, ధనిక వత్యాసాలు కూడా లేదని తెలిపారు. చదువుకునే రోజుల్లో సెల్ ఫోన్, టీవీలకు దూరంగా ఉండడం మంచిదని తెలియజేశారు.
స్నేహితుల వల్ల కూడా విద్యార్థుల భవిష్యత్ ఆధారపడి ఉంటుందని మంచిగా చదువుకునే వారితోనే స్నేహం చేయాలని సూచించారు. ఏసీపి గజ్జి కృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు మీకు మీరుగా తక్కువగా అంచనా వేసుకొని చదువులో వెనుకబడి పోరాదని కోరారు. చదువుకునే దశలో చెడు వైపు మల్ల రాదని అన్నారు. ఇక్కడ పలువురు వక్తలు పరీక్షలు, భవిష్యత్తుపై అవగాహన కల్పించారు. పొత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ గౌడ్ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఈ అవగాహన సమావేశం పట్ల పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ సీఐ జీ సుబ్బారెడ్డి, ఎంఈఓ రమేష్, హెచ్ఎంలు పద్మ, జ్యోతి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.