Vanamahotsavam | కరీంనగర్ కలెక్టరేట్, ఆగస్టు 02 : నానాటికి అంతరించి పోతున్న అటవీ సంపదను పెంపొందిస్తూ, పర్యావరణాన్ని పరిరక్షించుకునే క్రమంలో ఏటా వర్షాకాలం ఆరంభంలో చేపడుతున్న వనమహోత్సవ (హరితహారం) కార్యక్రమం జిల్లాలో ఆరంభ శూరత్వంగానే మిగులుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమ నియోజకవర్గాల్లో అట్టహాసంగా ప్రారంభిస్తున్న అధికార నేతలు, ప్రజాప్రతినిధులు ఆపై పట్టించుకోకపోవటంతో గతేడాది నుంచి నామ్ కే వాస్తేగా కొనసాగుతున్నదనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ విభాగాలకు లక్ష్యం నిర్దేశించి, మొక్కలు నాటాలంటూ వస్తున్న ఆదేశాలు కాగితాలకే పరిమితమవుతున్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రతి ఏటా జూలై ఆరంభంలోనే ఈ కార్యక్రమం ప్రారంభించి, కొనసాగించాల్సిన ఆయా ప్రభుత్వ శాఖలు నిర్దేశించిన లక్ష్యంలో గత నెలలో కనీసం పది శాతం కూడా చేరుకోకపోవటం, మరికొన్ని విభాగాలు ఇప్పటివరకు మొక్కలు నాటే కార్యక్రమమే మొదలు పెట్టకపోవటంతో వనమహోత్సవంపై ఏమేరకు శ్రద్ధ చూపుతున్నారో అర్ధమవుతున్నదంటూ పర్యావరణవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. జిల్లాలో ఈసారి 48,59,900 మొక్కలు నాటుడు లక్ష్యంగా ప్రభుత్వ విభాగాలకు నిర్దేశించారు.
గత నెల నుంచి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాల్సి ఉంది. అయితే, ప్రధాన విభాగాలైన ఇరిగేషన్, పంచాయితీరాజ్, గ్రామీణ నీటి పారుదల, వ్యవసాయ, పోలీస్, విద్యా, ట్రానో, రహదారులు, భవనాల శాఖలు ఇప్పటివరకు ఒక్క మొక్క కూడా నాటకపోగా, లటవీ శాఖకు 1.44 లక్షల మొక్కలు నాటుడు టార్గెట్ విధిస్తే కేవలం 1000 మాత్రమే నాటినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జులై నెలలో పది రోజుల దాకా జిల్లాలో ముసురు వర్షాలు పడటంతో ఎస్ఆర్ఎస్పి, హార్టికల్చర్, సెరికల్చర్, ఎక్సైజ్, ఎండోమెంట్, మైనింగ్, మున్సిపాల్టీలతో పాటు డిఆర్డివో లాంటి ప్రభుత్వ విభాగాలు తమ సిబ్బంది ద్వారా గుడ్డిలో మెల్ల అన్నట్లు మొక్కలు నాటినా, సంరక్షణ మాత్రం గాలికొదిలేశాయనే విమర్శలు వస్తున్నాయి.
మొక్కలు నాటిన వెంటనే ఎప్పటికప్పుడు ఆయా శాఖలు జియో ట్యాగింగ్ చేయాల్సి ఉండగా, కేవలం ఉద్యాన, పట్టు పరిశ్రమ, దేవాదాయ, డిఆర్డివో శాఖలతో పాటు హుజురాబాద్ మున్సిపాల్టీలో మాతరమే నాటిన వాటిలో కొన్నింటికి జియో ట్యాగింగ్ చేశాయి. వాస్తవానికి జూలై నెలలో ప్రారంభించి, సెప్టెంబర్ నెలాఖరు వరకు మొక్కలు నాటుడు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ మూడు నెలలకాలంలో జియో ట్యాగింగ్ కూడా పూర్తి చేసి, వాటి సంరక్షణ బాధ్యతలు కూడా సంబంధిత శాఖలే నిర్వహించాల్సి ఉంటుంది. అయితే, ఈ కార్యక్రమంపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ఆయా శాఖల అధికారులు, సిబ్బంది కూడా అలాగే వ్యవహరిస్తున్నట్లు వనమహోత్సవ కార్యక్రమ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
దీంతో, ఎంతో ఉదాత్తాశయంతో తెలంగాణ తొలి ప్రభుత్వం చేపట్టిన ఈకార్యక్రమం పేరుకు మాత్రమే కొనసాగిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో చేపట్టిన హరితహారం కార్యక్రమం పక్కా ప్రణాళికబద్ధంగా నిర్వహించటంతో ప్రస్తుతం జిల్లాలో అటవీ సంపదతో పాటు పర్యావరణ సమతుల్యత కూడా పెరిగిందని, కాగ్ తన నివేదికలో స్పష్టం చేసింది. స్వరాష్ట్రం సిద్ధించేనాటికి 8 శాతం లోపు మాత్రమే ఉన్న అటవీ విస్తీర్ణం 9 విడతలుగా చేపట్టిన హరితహారంతో ఇరవై శాతానికి పైగా పెరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
తొమ్మిదేళ్ళలో సుమారు 5 కోట్లకు పైగా మొక్కలు నాటితే వాటిలో 70శాతానికి పైగా ఏపుగా పెరిగాయి. రహదారుల వెంట ఆకుపచ్చతోరణాలుగా, పల్లెలు, పట్టణాల్లో ప్రకృతి వనాలుగా ఎదిగి జిల్లా వాసులకు స్వచ్ఛమైన గాలిని అందిస్తుండగా, అనేక చోట్ల చిట్టడవులను తలపిస్తున్నాయి. హరితహారం స్పూర్తితో అటవీ సంపదను మరింత పెంచటంలో తమ వంతు పాత్ర పోషించాల్సింది పోయి అంటీ ముట్టనట్లు అధికార యంత్రాంగం వ్యవహరిస్తుండటం పట్ల పర్యావరణ ప్రేమికుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.