Koleti Damodar | గోదావరిఖని : గడిచిన రెండు సంవత్సరాల్లో హామీల అమల్లో ఘోరంగా విఫలమైన అధికార కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డ్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ కోరారు. సోమవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ కు ఓటు వేయడం ద్వారానే ప్రజలకు మంచి జరుగుతుందని… మళ్లీ కాంగ్రెస్ కు ఓటు వేస్తే ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు కాలేదని వాటిని అమలు చేయకుండానే మరోసారి పట్టణ ప్రాంతాలకు చెందిన మున్సిపల్ ఓటర్లను మభ్యపెట్టి మరోసారి గెలుపు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మహిళలకు ఇస్తానన్న నెలకు రూ.2500 చొప్పున ప్రతీ మహిళకు 22 నెలలకు గాను రూ.55 వేలు బకాయి పడ్డారని వృద్ధులకు బీడీ కార్మికులకు రూ.4వేల పెన్షన్ ఇస్తామని మోసం చేశారని, ఇప్పటికే ఒక్కొక్కరికి రూ.44 వేల బకాయి కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని అన్నారు. దివ్యాంగులకు రూ.6 వేల పెన్షన్ ఇస్తామని అమలు చేయలేదని, ప్రతీ వికలాంగుడికి రూ.44 వేలు బకాయి ఉందని, కల్యాణ లక్ష్మి కింద ఇస్తానన్న తులం బంగారం పెండింగ్ లోనే ఉందని విద్యార్థినిలకు ఇస్తానన్న స్కూటీ ఏమైందని ఫీజు రియంబర్స్మెంట్ కింద చెల్లించాల్సిన రూ.8 వేల కోట్లు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు.
హామీల అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల్లో నమ్మవద్దని కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో బుద్ధి చెప్పేలా ఓటర్లు తీర్పు ఇవ్వాలని ఆయన కోరారు. రామగుండం కార్పొరేషన్ మేయర్ పీఠం బీఆర్ఎస్ కు దక్కేలా సింగరేణి కార్మికులు అన్ని వర్గాల ప్రజలు ఓట్లు వేయాలని ఆయన కోరారు. పెద్దపెల్లి జిల్లాలోని పెద్దపెల్లి సుల్తానాబాద్ మంథని మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించేలా ప్రజలు తీర్పు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కరీంనగర్లో మేయర్ పీఠం సాధించేలా బీఆర్ఎస్ ముందుకు సాగుతుందని ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చి ఘన విజయం సాధించేలా కృషి చేయాలని ఆయన కోరారు.