పెండింగ్ బిల్లుల కోసం మాజీ సర్పంచులు అరిగోసపడుతున్నారు. అప్పులు చేసి గ్రామాలను అభివృద్ధి చేశామని, తిరిగి చెల్లించేందుకు ఆస్తులు అమ్ముకున్నామని, బిల్లులు చెల్లిస్తే తప్ప ఆ ఊబిలోంచి బయటికి రాలేమని రెండేళ్లుగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో తమ బిల్లులు చెల్లించేదాకా పంచాయతీ ఎన్నికలు నిర్వహించవద్దని పోరుబాట పట్టారు. అయినా ఎన్నికలు నిర్వహించడం, కొత్త సర్పంచులు కొలువు దీరడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బిల్లులు చెల్లిస్తారో.. లేదోనని ఆవేదన చెందుతున్నారు. సోమవారం అసెంబ్లీని ముట్టడించేందుకు ప్రయత్నించగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు.
కరీంనగర్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): తమ శక్తి వంచన లేకుండా గ్రామాల అభివృద్ధికి కృషి చేసిన మాజీ సర్పంచులకు ఇప్పుడు పెండింగ్ బిల్లులు సాధించుకోవడం కత్తిమీద సాములా మారింది. ఒక్కో గ్రామంలో రూ.లక్షల్లోనే పెండింగ్ బిల్లులు రావల్సి ఉంది. మైనర్ పంచాయతీల్లో కనీసంగా 4లక్షల నుంచి 6 లక్షలు, మేజర్ పంచాయతీల్లో 30లక్షల నుంచి 40 లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉందని, కొన్ని పెద్ద పంచాయతీల్లో అయితే 60లక్షల నుంచి 70 లక్షలకు మించి బకాయిలు ఉన్నట్టు మాజీ సర్పంచులు చెబుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి తమ పెండింగ్ బిల్లులన్నీ చెల్లిస్తానని హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ పనులు తమ ప్రభుత్వ హయాంలో జరుగలేదని బుకాయిస్తున్నారని వాపోతున్నారు. ఈ మాట ఎన్నికలకు ముందు ఎందుకు అనలేదని ప్రశ్నిస్తున్నారు. కాగా, పంచాయతీలకు ఎన్నికలకు ముందే బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోలేదని ఆగ్రహిస్తున్నారు. ఇప్పుడు కొత్త సర్పంచులు బాధ్యతలు చేపట్టడంతో గ్రామాల్లో రాజకీయాలు తలెత్తే అవకాశముందని చెబుతున్నారు.
పంచాయతీలకు బకాయి పడిన పద్దులన్నీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఎస్ఎఫ్సీ) పద్దుల కిందనే ఎక్కువగా ఉన్నాయని, సీసీ రోడ్లు, మురుగు కాలువలు, పంచాయతీ భవనాలు, ఇతర శాశ్వత అభివృద్ధి పనులన్నీ ఈ పద్దుల కిందనే చేశామని చెబుతున్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నిధులు విడుదల చేయలేదని మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల 14వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయగా, కొన్ని నిధులు ఇచ్చామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడాన్ని తప్పుపడుతున్నారు. ప్రస్తుతం కేంద్రం ఇచ్చిన 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసుకునేందుకు ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 2,100 చెక్కులు వివిధ ట్రెజరీ కార్యాలయాల్లో పెండింగ్లో ఉన్నట్టు వివరిస్తున్నారు. రూ.2లక్షల నుంచి రూ.3 లక్షల బిల్లులకు సంబంధించి కొన్ని చెక్కులు మాత్రమే క్లియర్ అయినట్టు తెలుస్తున్నది.
పంచాయతీలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించని కారణంగా రెండేళ్లుగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయి. ఇప్పుడు కొత్త సర్పంచులు పదవీ బాధ్యతలు చేపట్టడంతో ఈ నిధులు విడుదలయ్యే అవకాశాలున్నాయి. అయితే ఆ నిధులతోనైనా పెండింగ్లో ఉన్న తమ బిల్లులు చెల్లించాలని మాజీ సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే తప్పా తమ బిల్లులు వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు. అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేశామని, తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయని వాపోతున్నారు. వడ్డీలు కట్ట లేక తమ కుటుంబాలపైనా ప్రభావం పడుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొందరు సర్పంచులు ఆత్మహత్యలు చేసుకోగా, చాలా మంది ఆత్మహత్యాయత్నాలు చేశారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు తమ ఆస్తులు అమ్మి అప్పులు కట్టాల్సి వస్తున్నదని చెబుతున్నారు. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లిస్తే తప్పా తమ అప్పులు తీరే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు.
అసెంబ్లీ ముట్టడికి యత్నం.. ముందస్తు నిర్బంధం
మాజీ సర్పంచులు రెండేళ్లుగా ప్రభుత్వంపై నిరసన గళం విప్పుతూనే ఉన్నారు. కానీ, ప్రభుత్వం మాత్రం వారి గోడును పట్టించుకోకపోవడంతో ఆగమవుతున్నారు. గతంలో ప్రజావాణిలో ఫిర్యాదులు చేసేందుకు వస్తే ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. అసెంబ్లీ ముట్టడికో, సెక్రటేరియట్ ముట్టడికో పిలుపునిస్తే జిల్లాల వారీగా ఎక్కడిక్కకడ నిర్భంధిస్తూ వచ్చారు. తాజాగా సోమవారం అసెంబ్లీ ప్రారంభం కావడంతో మాజీ సర్పంచుల సంఘం రాష్ట్ర నాయకత్వం ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో ఉమ్మడి జిల్లాలో వీరిని ముందస్తుగా అరెస్టులు చేసి పోలీసు స్టేషన్లలో నిర్బంధించారు. తమ పెండింగ్ బిల్లులు చెల్లించకుంటే నిరంతర పోరాటాలకు సిద్ధ్దమవుతామని స్పష్టం చేస్తున్నారు.