కరీంనగర్ కమాన్‌చౌరస్తా, జూలై 28: దేవాదాయ శాఖలో బదిలీల సందడి నెలకొంది. కరీంనగర్‌లోని అసిస్టెంట్ కమిషనరేట్ పరిధిలోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఆలయాల నిర్వహణ సాగుతుండగా, ఏసీతోపాటు పెద్ద సంఖ్యలో జూనియర్ అసిస్టెంట్ల ట్రాన్స్‌ఫర్‌కు రంగం సిద్ధమవుతున్నది. బదిలీల్లో భాగంగా ఇదే టైంలో అర్చకులకూ స్థానం చలనం కలిగించాలని భావించినా, వారి నుంచి వ్యతిరేకత రావడంతో దేవాదాయ శాఖ వెనక్కితగ్గినట్లు తెలుస్తున్నది. అలాగే, 40 శాతం పాత ఉద్యోగులను ఉంచాలనే నిబంధనను పక్కనపెట్టినట్లు తెలుస్తున్నది.
దేవాదాయ శాఖలో కరీంనగర్ అసిస్టెంట్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న అధికారికే ఎన్నోఏండ్లుగా కొండగట్టు ఆలయ ఈవోగా ప్రభుత్వం బాధ్యతలు అప్పగిస్తూ వస్తున్నది. అందుకు గ్రేడ్-1 స్థాయి అధికారులు అందుబాటులో లేకపోవడమే కారణంగా చూపుతున్నారు. ఇక్కడ గత నాలుగేండ్లుగా అసిస్టెంట్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న అధికారికి సైతం బదిలీ కానుండగా, జిల్లాకు చెందిన ఒక అధికారి ఇన్చార్జి ఏసీగా బాధ్యతలు తీసుకునేందుకు వెళ్తున్నట్టు తెలిసింది.
శాశ్వత ఈవోలు వచ్చేనా?
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రేడ్-1, గ్రేడ్-2 స్థాయి ఆలయాలు ఎక్కువగా ఉన్నాయి. అందులో కరీంనగర్ జిల్లాలో ఇల్లందకుంట రామాలయంతోపాటు మార్కెట్ రోడ్డు వేంకటేశ్వరస్వామి ఆలయం, పాత బజార్ శివాలయం లాంటి ఆలయాలు ఉన్నాయి. అయితే, జిల్లాలో ఒకే ఒక గ్రేడ్-1 స్థాయి ఉండగా, ఆయన ఇల్లందకుంట ఆలయ ఈవోగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన్ను జిల్లా కేంద్రంలోని ఆలయానికి కేటాయించి, పలు ఆలయాలకు ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి.
జిల్లాలో గ్రేడ్-2 ఈవోలు ముగ్గురు ఉండగా, మరొకరికి పదోన్నతి లభించింది. ఆయనతో గ్రేడ్-2 ఈవోలు నలుగురు కాగా, వారికి జిల్లా కేంద్రంలోని గ్రేడ్-1, గ్రేడ్ -2 స్థాయి ఆలయాలను కేటాయించి మరికొన్ని ఆలయాలకు ఇన్చార్జిలుగా నియమించనున్నారు. ఈ మేరకు వారి నుంచి ఇప్పటికే ఆప్షన్లు ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్లైన్లోనూ లేఖలు తీసుకున్నట్లు సమాచారం. అయితే, పెద్ద ఆలయాలకు శాశ్వత ఈవోలు వచ్చే అవకాశాలు తక్కువ ఉన్నాయి.
ప్రమోషన్ల కోసం ఉన్న జూనియర్ అసిస్టెంట్లు
జిల్లాలోని పలు ఆలయాల్లో జూనియర్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్నారు. వారికి పదోన్నతులు లభిస్తే వారు ఆలయాలకు గ్రేడ్-3 స్థాయి ఈవోలుగా అవకాశం లభించనుంది. అయితే, పదోన్నతులు పూర్తయిన తర్వాత బదిలీల ప్రక్రియ ప్రారంభించాలని కోరుకున్నా, అది జరగక పోవడంతో వారు ఒక దశలో నిరాశతో ఉ న్నారు. అలాగే, జూనియర్ అసిస్టెంట్లు, క్లర్క్‌ల వి షయంలో దాదాపు పూర్తి స్థాయిలో బదిలీ చేయనున్నట్లు తెలుస్తున్నది. ఇందులో పెద్ద సంఖ్యలో క్లర్క్‌లు పదేండ్లుగా అవే ఆలయాల్లో విధులు నిర్వహిస్తుండగా, వారికి బదిలీలు తప్పవని తెలుస్తోంది. అయితే, క్లర్క్‌ల బదిలీలు శనివారం సాయంత్రం జరగాల్సి ఉన్నా అవి తాత్కాలికంగా సోమవారానికి వాయిదా పడినట్లు సమాచారం.
కాంట్రాక్ట్ సిబ్బందికి రెగ్యులర్ అవకాశాలు దక్కేనా..!
ఉమ్మడి జిల్లా పరిధిలో పలు ఆలయాల్లో కాంట్రాక్ట్ సిబ్బంది పెద్ద సంఖ్యలో క్లర్క్‌లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిని రెగ్యులర్ చేసేందుకు గతంలోనే వివరాలు సేకరించారు. అందుకు తెలంగాణ రాష్ట్ర అవతరణ నుంచి కటాఫ్‌గా పరిగణించి నియామకాలు నిలిపివేశారు. అయితే, గతం నుంచి తాము ఆలయాల సేవలో ఉన్నామని, తమనూ రెగ్యులర్ చేసి తమ కుటుంబాలను ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.