హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బడ్జెట్ అనగానే నిధుల కోసం వివిధ శాఖల అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం, వాటిలో కొన్ని ప్రాజెక్టులకు సర్కార్ నిధులు కేటాయించడం, ఆ తర్వాత ఆ నిధులు విడుదల చేయకపోవడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలోనే వచ్చే 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్), హైబ్రిడ్ యాన్యుటీ మాడల్ (హ్యామ్) రోడ్ల ప్రాజెక్టుకు, గ్రామీణ రోడ్లు, భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించాలని ఆర్అండ్బీ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. కానీ, గత అనుభవాల దృష్ట్యా ఆ శాఖకు ఈసారైనా నిధులు విడుదలవుతాయా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ట్రిపుల్ఆర్ ఉత్తర భాగంలో దాదాపు 90% వరకు భూసేకరణ పూర్తయినట్టు ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఇంతవరకు రైతులకు నష్టపరిహారం చెల్లించలేదు.
ఈ చెల్లింపులకు రాష్ట్ర వాటా కింద రూ.2 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేసిన ఆర్అండ్బీ శాఖ.. బడ్జెట్లో ఈ నిధులు కేటాయించాలని కోరింది. వీటితోపాటు హ్యామ్ ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేసే రోడ్లకు రూ.3 వేల కోట్లు, గ్రామీణ రోడ్లకు రూ.480 కోట్లు, భవనాల నిర్మాణానికి రూ.650 కోట్లు, నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర వాటా కింద రూ.320 కోట్లు, సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సీఆర్ఐఎఫ్) కింద రూ.600 కోట్లు, రీజినల్ రింగ్ రైల్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టే పనులకు రూ.800 కోట్లు కేటాయించాలని, ప్లాన్, నాన్-ప్లాన్ గ్రాంట్ల కింద రూ.5 వేల కోట్లు ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది.
కాంగ్రెస్ సర్కార్ నిరుడు 2025-26 బడ్జెట్లో ఆర్అండ్బీ శాఖకు రూ.5,907 కోట్లు కేటాయించినప్పటికీ అందులో కనీసం రూ.1,000 కోట్లు కూడా విడుదల చేయలేదు. దీంతో ఆర్అండ్బీ శాఖ పరిధిలోని రోడ్లను పటిష్టపర్చడం, వాటిని విస్తరించడం, కొత్త బ్రిడ్జీలు, రోడ్ల నిర్మాణం, సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా అభివృద్ధి చేయడం, ట్రిపుల్ఆర్కు సంబంధించిన భూసేకరణ, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రోడ్ల అభివృద్ధి చేయడం లాంటి ప్రాజెక్టుల్లో ఏ ఒక్కటీ పూర్తికాలేదు. కనీసం వర్షాకాలంలో పాడైపోయిన రోడ్ల మరమ్మతులకు కూడా రేవంత్రెడ్డి సర్కార్ నిధులు విడుదల చేయలేదని అధికార వర్గాలు చెప్తున్నాయి.