ఎస్సారెస్పీ చివరి ఆయకట్టు రైతాంగం తల్లడిల్లుతున్నది. చేతికందే దశలో ఉన్న పంటలకు సాగు నీటి కోసం అరిగోస పడుతున్నది. అందుకు జూలపల్లి మండలంలోని పలు గ్రామాల్లోని పంటల దుస్థితే నిదర్శనంగా నిలుస్తుండగా, రైతన్నకు కన్నీరే మిగులుతున్నది. ఈ సీజన్లో మండల కేంద్రంతోపాటు కుమ్మరికుంట, వడ్కాపూర్, కాచాపూర్, వెంకట్రావ్పల్లి రైతులు దాదాపు వెయ్యి ఎకరాల్లో వరి, మక్క సాగు చేయగా, కోతకు వచ్చే సమయంలోనే ఎస్సారెస్పీ అధికారులు ఇటీవల నీటి సరఫరా బంద్ చేయడం సమస్యగా మారింది. ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతూ, నేలలు నెర్రెలు బారుతుండగా, సాగు నీటి కోసం కర్షకులు తండ్లాడుతున్నారు. చివరి తడి ఇచ్చి ఆదుకోవాలని అర్థిస్తున్నారు.
జూలపల్లి, ఏప్రిల్ 20: జూలపల్లి మండలానికి ఎస్సారెస్పీ నీరే ఆధారం. చివరి ఆయకట్టులో ఉంటుంది. ఇక్కడి రైతులు ఎన్నోఏళ్లుగా కాలువ నీళ్లనే నమ్ముకొని ఎవుసం చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఈ యాసంగిలో 12,667 ఎకరాలలో వరి, 4,085 ఎకరాల్లో మక్క సాగు చేశారు. అయితే జూలపల్లి, కుమ్మరికుంట, వడ్కాపూర్, కాచాపూర్, వెంకట్రావ్పల్లి తదితర గ్రామాల్లో ఈ యాసంగిలో ఆలస్యంగా పంటలు వేశారు. దాదాపు వెయ్యి ఎకరాల్లో సాగు చేశారు. ఎప్పటిలాగే ఈ నెలాఖరు దాకా నీళ్లు వస్తాయని భావించారు. అయితే ఎస్సారెస్పీ డీ-83, 86 ప్రధాన కాల్వల నుంచి నీటి సరఫరాను అధికారులు నిలిపివేయడంతో రైతులు తల్లడిల్లుతున్నారు. ప్రస్తుతం చేతికందే దశలో పంటలకు ఆఖరి తడి ఇవ్వకపోతే తీవ్రంగా నష్టపోతామని, వెంటనే నీరందించాలని కోరుతున్నారు. సాగు నీరందక కండ్ల ముందు పంటలు ఎండిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పంటలు కోతకు వచ్చే చివరి దశలో నీరందక చేజారిపోతున్నాయని ఆందోళన చెందుతున్నారు. అధికారుల్లో చలనం లేకపోవడంతో రెండ్రోజుల కింద మండల కేంద్రంలోని తహసీల్ ఆఫీస్ ఎదుట ఆందోళన చేశారు. వెంటనే నీరందించాలని డిమాండ్ చేశారు. అయినా పట్టించుకోకపోవడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకొని సాగునీటిని విడుదల చేయాలని కోరుతున్నారు.
నాకు జూలపల్లిల 20 గుంటల భూమి ఉంది. వరి సాగు చేసుకుంటూ బతుకుత. చేతికందే టైంలనే గీ నడుమ ఆఫీసర్లు కెనాల్ నీళ్లు బంద్ చేసిన్రు. పంట ఎండిపోతంది. ఇంకో తడి నీళ్లు ఇస్తే చేతికి అందుతది. పక్కపొంటి రైతుకు చెందిన వ్యవసాయ బావి నుంచి సాగునీరు వాడుకుంటున్నా. ఒక్క తడి నీళ్లకు 2 వేలు ఇచ్చుకుంటున్న. నీళ్ల కోసం ఆఫీసర్లు పట్టించుకోవాలే. ఇంకో వారం రోజులు నీళ్లస్తేగానీ వరి, మక్క చేతికందేటట్టు లేదు.
మాది కుమ్మరికుంట. నేను ఏడున్నర ఎకరాల భూమి కౌలుకు తీసుకుని మక్క సాగు చేసుకుంటున్న. చేనుకు కెనాల్ నీళ్లే ఆధారం. ఆఫీసర్లు నీళ్లు బంద్ చేసిన్రు. పంటంతా ఎండిపోతంది. ఈ మధ్య వడగండ్ల వానకు మక్క చేను కొంత దెబ్బతిన్నది. ఇప్పుడున్న కొద్దిపంట దక్కించుకోడానికి సాగునీరు కరువైంది. గతేడాది గిట్ల లేదు. ఇప్పుడైతే పశువులకు వదిలిపెట్టుడే. వ్యవసాయ బావులు దగ్గర లేవు. ఒక్కతడి నీళ్లు పెడితే పంట చేతికి అందేది. కనీసం కౌలు పైసల మందమన్న పంట పండేటట్లు కనిపించడం లేదు. అధికారులు కెనాల్ నీళ్లు ఇచ్చి పంటల్ని కాపాడాలే.