కరీంనగర్, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) జూలై 6: వేములవాడ రాజన్న సన్నిధిలో ఔట్ సోర్సింగ్ దందాకు తెరలేవడం, ఏకంగా పలువురు మంత్రులు పోటాపోటీగా సిఫారసు చేయడాన్ని ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తెచ్చింది. ‘రాజన్న సన్నిధిలో మంత్రుల పైరవీల దందా?’ శీర్షికన సోమవారం కథనం ప్రచురించింది. ఇది రాష్ట్రస్థాయిలో సంచలనం రేపింది. అన్ని వర్గాల్లోనూ చర్చనీయాంశం కాగా, అసలు ఆ మంత్రులు ఎవరు? అనే చర్చ జోరుగా సాగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా నిరుద్యోగుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.
అమాత్యులు ఒకరిని కాదని మరొకరు పైరవీ చేసి ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని, అలాగే భార్యాభర్తలను సిఫారసు చేసిన తీరు విస్మయానికి గురిచేసింది. మరోవైపు ‘నమస్తే’ కథనంపై ఇంటెలిజెన్స్ పోలీస్ బృందం స్పందించింది. ముగ్గురు పోలీసుల బృందం.. రంగంలోకి దిగింది. రాజన్న ఆలయ కార్యనిర్వహణ అధికారి కార్యాలయానికి చేరుకొని విచారించింది. సుమారు రెండు గంటల పాటు ఆరా తీసిన అధికారులు.. ఎంతమందిని సిఫారసు చేశారు? ఏయే మంత్రులు చేశారు? అని ఆరా తీసినట్టు తెలిసింది.
అయితే మొత్తం 11 మందిని సిఫారసు చేసినట్టు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఓ మంత్రి చేసిన పైరవీలో భాగంగానే దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో ముగ్గురికి ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించగా, అందులో ఇద్దరిని ప్రస్తుతం విధుల్లో తీసుకున్నామని అధికారులు వెల్లడించినట్టు తెలిసింది. మరొకరు ప్రత్యేకంగా ఒకే విధుల కోసం పట్టుబడుతుండగా, ప్రస్తుతం అది పెండింగ్‌లో ఉందని చెప్పినట్టు సమాచారం. మొత్తానికి ‘నమస్తే తెలంగాణ’ కథనం ఇక దేవాదాయ శాఖలోని ఉద్యోగుల్లోనూ చర్చనీయాంశంగా కాగా, దందా వెలుగులోకి రావడంతో నిరుద్యోగులు మండిపడుతున్నారు.
ఔట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి, అర్హత ఉన్న స్థానిక యువతీయువకులను తీసుకోవాలని, కానీ, జిల్లాయేతరులకు అవకాశం కల్పించడం ఏంటని ఆగ్రహిస్తున్నారు. గతంలో కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఉన్నప్పుడు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించారని, ఆయన బదిలీపై వెళ్లిపోయిన తర్వాత ఆ ప్రక్రియ నిలిచిపోయిందని చెబుతున్నారు. అప్పుడు దరఖాస్తు చేసుకున్న వారిని పిలిచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు. లేదంటే కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.