బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించడంతో ఉమ్మడి జిల్లాలో సంబురాలు చేసుకున్నారు. 13 అసెంబ్లీ స్థానాలకు 13 స్థానాలు ప్రకటించడమే కాదు, అందులో 10 చోట్ల సిట్టింగులకు, మూడు చోట్ల కొత్తవారికి అవకాశం కల్పించడంతో అభిమానులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆనందంలో మునిగిపోయారు. ఆయా నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లో పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. అధినేత కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి, కృతజ్ఞతలు తెలిపారు.
– కరీంనగర్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ)

ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతలకు టికెట్ల విషయంలో కొన్నాళ్లుగా వస్తున్న ఊహాగానాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెరదించారు. అక్కడితో అగకుండా అందరి అంచనాలను తారు మారు చేస్తూ 115మంది అభ్యర్థులతో జాబితా విడుదల చేయడం, ఉమ్మడి జిల్లాలోని మొత్తం 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. 10 చోట్ల పాత అభ్యర్థులకే టికెట్ ఇచ్చారు.

కోరుట్లలో ఎమ్మెల్యే విద్యాసాగర్ తనయుడు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్‌కుమార్, వేములవాడలో చలిమెడ లక్ష్మీనర్సింహారావు, హుజూరాబాద్‌లో పాడి కౌశిక్‌రెడ్డి పేర్లు ప్రకటించారు. కరీంనగర్ జిల్లా పరిధికి వస్తే హుజూరాబాద్ మినహా కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్, మానకొండూర్‌లో రసమయి బాలకిషన్, చొప్పదండిలో సుంకె రవిశంకర్, హుస్నాబాద్‌లో వొడితల సతీశ్కుమార్కే మళ్లీ టికెట్లు కేటాయించారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలు సంబురాలు జరుపుకున్నారు. డప్పు చప్పుళ్లు, నృత్యాలతో హోరెత్తించారు. పటాకులు కాల్చి, స్వీట్లు పంచారు.