కలెక్టరేట్, అక్టోబర్ 29: వచ్చే ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉవ్వీళ్లూరుతున్న 18 ఏళ్లు పూర్తయిన వారికి ఇదే ఆఖరి అవకాశం. ఎన్నికల సంఘం కల్పించిన అవకాశం మేరకు ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు కేవలం ఒక్క రోజు మాత్రమే మిగిలింది. ఈనెల 31వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఎన్నికల సంఘం వెబ్సైట్ తెరిచి ఉంటుంది. నవంబర్ 1 నుంచి వెబ్సైట్ మూసివేయనుండగా, తిరిగి తెరిచే వరకు ఇక అవకాశం ఉండబోదని ఎన్నికల అధికారులు పేర్కొంటున్నారు. ఎన్నికలేవైనా ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల యంత్రాంగం ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగానే ఓటరుగా నమోదుకు, మార్పులు, చేర్పులకు అవకాశం కల్పిస్తూ, దీనిని వినయోగించుకునేందుకు విస్తృత ప్రచారం నిర్వహిస్తుంటుంది.
ప్రజస్వామ్య వ్యవస్థలో ఓటు ఎంతో విలువైనది, అర్హులు సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒకరూ ఓటరుగా నమోదు చేసుకునేందుకు నామినేషన్ల రోజు సమీపించే వరకు ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తుంటుంది. నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అర్హులందరూ ఓటర్లుగా నమోదయ్యేందుకు, ఈనెల 31 వరకు అవకాశం ఇచ్చింది. ఇప్పటికే స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి కొత్త ఓటర్ల నమోదు కోసం అనేక చైతన్య కార్యక్రమాలు నిర్వహించింది. పలు స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు, యువజన సంఘాలను ఇందులో భాగస్వాములను చేసింది. గత ఆరు మాసాలుగా యువత, 18 ఏళ్లు నిండిన వారి కోసం విద్యాసంస్థల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి వందశాతం ఓటరు నమోదు కోసం ఎన్నికల సంఘం విశేష కృషి చేసింది.
దీంతో అంచనాకు మించి కొత్త ఓటర్లు నమోదయ్యారు. ఈనెల 4న ఎస్ఎస్ఆర్ 2023 తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రచురించింది. ఈ జాబితా ప్రకారం జిల్లాలో 10,34,186 మంది ఓటర్లు ఉండగా, ఈ ఏడాది జనవరి 5న విడుదల చేసిన ఓటర్ల జాబితాలో 9,97,143 మంది ఉన్నారు. ఎస్ఎస్ఆర్ 2023తో అదనంగా 37వేల మంది కొత్త ఓటర్లు నమోదయ్యారు. అయినా ఇంకా అర్హులై ఉండి మిగిలిపోయిన వారిని కూడా ఓటరు జాబితాలో చేర్చేందుకు ఈనెల 31 వరకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఓటర్లు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉండడంతో అత్యధికులు మొబైల్ ఫోన్ల ద్వారా ఓటు హక్కును నమోదు చేసుకుంటున్నారు.
ఇప్పటి వరకు కూడా నమోదు చేసుకోని వారుంటే మంగళవారం వరకు ఎన్నికల సంఘం నిర్దేశించిన వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. 31లోగా నమోదు చేసుకున్న వారికి మాత్రమే వచ్చే ఎన్నికల్లో ఓటు హకు వినియోగించుకునే సువర్ణావకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే, ఓటర్ల జాబితా ఇప్పటికే విడుదల కాగా, తాజాగా నమోదయ్యే ఓటర్ల వివరాలతో కూడిన కొత్త జాబితాను ముద్రించి, అనుబంధంగా ప్రకటించనున్నట్లు జిల్లా ఎన్నికల సంఘం వెల్లడిస్తోంది.
ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు. పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి. ఇప్పటికే ఓటు హకు వినియోగంతో పాటు ఓటరుగా నమోదు చేసుకునేలా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాం. ఓటరుగా నమోదు చేసుకున్న వారు తమ ఓటు హకు ఉన్నదో లేదో ఇటీవల విడుదల చేసిన ఓటరు జాబితాలను పరిశీలించాలి. అందులో పేరు లేకపోతే తిరిగి నమోదు చేసుకుని, ఓటు హక్కు వినియోగించుకోవాలి.
-మహేశ్వర్, రిటర్నింగ్ అధికారి