కరీంనగర్ కార్పొరేషన్, సెప్టెంబర్ 30 : పారిశుధ్య కార్మికుల కృషితోనే కరీంనగర్ నగరపాలక సంస్థకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు అంశాల్లో అవార్డులు వచ్చాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. మనుసు మంచిగుంటే మంచి ఆలోచనలు వస్తాయని, సమాజానికి మంచి జరుగుతుందని, అందుకే ముందు మనసులో పేరుకుపోయిన మురికి కంపును తొలగించుకోవాలని సూచించారు.
స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా కరీంనగర్‌లోని సప్తగిరికాలనీలోని వాహన షెడ్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన పారిశుధ్య పనుల్లో పాల్గొని చెత్త ఊడ్చారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ‘మానవ సేవ మాధవ సేవ’ అనే గాంధీ మాటలను ఆచరించాలని, స్వచ్ఛత జీవన విధానంగా మార్చుకోవాలని సూచించారు. స్మార్ట్‌సిటీ నిధులను కేంద్రం మంజూరు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే మ్యాచింగ్ గ్రాంట్‌ను విడుదల చేసి అభివృద్ధికి సహకరించాలని కోరారు.
ఎన్నికల వరకే రాజకీయాలని, ఆ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కర్నూలులో వరదలొచ్చినప్పుడు కరీంనగర్ సఫాయి కార్మికులు వెళ్లి పనిచేసి ప్రశంసలందుకున్నారని, కొవిడ్ సమయంలో చేసిన సేవలను మరువలేమని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, నగర మేయర్ యాదగిరి సునీల్‌రావు, కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, కార్పొరేటర్లు చాడగోండ బుచ్చిరెడ్డి, మహేశ్, తదితరులు పాల్గొన్నారు.