Koppula Eshwar | గోదావరిఖని : సింగరేణి సంస్థలు ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతుందని, దానిని తిప్పి కొట్టడానికి కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగిన టీబీజీకేఎస్ కోర్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. సింగరేణి సంస్థకు చెందిన బొగ్గు బ్లాకులను కేంద్ర ప్రభుత్వం వేలంపాటలో పెట్టి పోటీ నిర్వహించి తమాషా చేస్తుందని సింగరేణి సంస్థ వేలంపాటలో పాల్గొని బ్లాక్ లను దక్కించుకోవాలని పేర్కొనడం సరైనది కాదని ఆయన పేర్కొన్నారు. సంస్థను పరిరక్షించుకోవడానికి తెలంగాణ ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం సింగరేణి సంస్థను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 30 వేల మంది యువకులకు ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త ఉద్యోగాల ఊసే లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. సింగరేణి సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం ఏటీఎంగా వాడుకొని నిధుల దుర్వినియోగానికి పాటుపడుతున్నారని ఆరోపించారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు రూ.19 వేల కోట్లు మాత్రమేనని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రూ.29 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సిన స్థితి వచ్చిందని పేర్కొన్నారు.
సింగరేణి రక్షించడానికి కార్మికులకు జీతభత్యాలు చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం జెన్కో ట్రాన్స్కో ఇతర సంస్థల నుంచి రావాలసిన రూ.48 వేల కోట్ల బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. సింగరేణి గుర్తింపు యూనియన్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ సంఘాలు మెడికల్ బోర్డు ప్రతీ నెలలో రెండు పర్యాయాలు నిర్వహిస్తామని చెప్పి గడిచిన 10 నెలల్లో ఒక్క బోర్డు కూడా నిర్వహించలేదని విమర్శించారు. వేలాది మంది కార్మికులు, వారి కుటుంబాలు తీవ్ర ఆందోళన అశాంతితో గందరగోళంలో ఉన్నారని పేర్కొన్నారు. సింగరేణి గుర్తింపు యూనియన్ ఎన్నికల కాల పరిమితి ముగిసినందున తక్షణమే ఎన్నికల నిర్వహించాలని డిమాండ్ చేశారు. యాజమాన్యంతో జరిగే సంప్రదింపులకు అన్ని కార్మిక సంఘాలకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సింగరేణిలో భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ చేపట్టడానికి టీబీజీకేఎస్ కోర్ కమిటీ సమావేశం నిర్వహించి పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, చీఫ్ జనరల్ సెక్రెటరీ కాపుకృష్ణ, ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామమూర్తి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నూనె కొమురయ్య, అధికార ప్రతినిధి పర్లపల్లి రవి, కోశాధికారి చెల్పూరి సతీష్, కేంద్ర ఉపాధ్యక్షులు మెడికల్ సంపత్ కుమార్, మంగీలాల్, కూసన వీరభద్రం, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.