శంకరపట్నం, అక్టోబర్ 15: శంకరపట్నం మండలంలోని ముత్తారం నుంచి ఎరడపల్లి మధ్య కేవలం మూడు కిలోమీటర్ల దూరమే అయినా.. రోడ్డు సరిగా లేక ఏడు కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తున్నది. రెండు గ్రామాల మధ్య ఉన్న దారిలో ముత్తారం రామసముద్రం చెరువు మత్తడి వాగు, మరి కొద్ది దూరంలో ఎరడపల్లి వాగు అడ్డుగా ఉంటాయి. అయితే, 2018లో బీఆర్ఎస్ సర్కారు హయాంలో ఎరడపల్లి సర్పంచ్ కలకుంట్ల సాగర్‌రావు అప్పటి ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బీ వినోద్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లగా, దీనిని బీటీ రోడ్డుగా మార్చేందుకు పూనుకున్నారు.
మొదట 85 లక్షల నిధులతో రామసముద్రం చెరువు మత్తడి వాగుపై వంతెన నిర్మించారు. తిరిగి, 2022లో 4 కోట్ల 25 లక్షలతో ఎరడపల్లి మత్తడి వాగుపై వంతెన నిర్మించారు. అయితే బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టాల్సి ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం రావడం.. దీనిపై దృష్టిసారించే వారు లేకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. కనీసం రైతులు తమ పొలాల వద్దకు వెళ్లాలన్నా అనువుగా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ రోడ్డు వేస్తే ముత్తారంతోపాటు కన్నాపూర్, ధర్మారం, కాచాపూర్, రాజాపూర్, గద్దపాక, తదితర గ్రామాల ప్రయాణికులకు ఎరడపల్లి మీదుగా గంగిపల్లి, చెంజర్ల, కరీంనగర్‌కు, అలాగే తాడికల్ వెళ్లేందుకు సౌలభ్యంగా మారుతుంది. అంతే కాకుండా రానూ పోనూ కలిపి 14 కిలోమీటర్లకు పైగా దూర భారం తగ్గుతుంది.