కాంగ్రెస్ పాలనలో మళ్లీ కరెంట్ ‘కట్’కట మొదలైంది. వ్యవసాయానికి అంతరాయం లేకుండా కరెంట్ ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్న మాటలు ఉత్తవేనని తేలిపోయింది. క్షేత్రస్థాయిలో కేవలం 14 గంటలే సరఫరా చేస్తున్నట్టు రికార్డుల్లో పేర్కొంటున్నా, అందులోనూ 10 నుంచి 15 సార్లు కోతలు విధిస్తున్నది. పలు సబ్స్టేషన్ల పరిధిలో గ్రామానికి గంటసేపు (సర్కిల్ పద్ధతిలో) కరెంట్ ఇస్తుండగా, రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో సెస్ ఆధ్వర్యంలో ప్రస్తుతం రోజుకు 14 గంటల చొప్పున కరెంట్ సరఫరా చేస్తుండగా, ఓవర్ లోడ్ ఉన్నదంటూ 10 నుంచి 15 సార్లు పవర్ కట్ చేస్తున్నారు. సర్కిల్ పద్ధతిలో గ్రామానికో గంట చొప్పున సరఫరా చేస్తున్నారు. ఉదాహరణకు ఇల్లంతకుంట మండలం రహీంఖాన్‌పేట సబ్‌స్టేషన్ పరిధిలో రహీంఖాన్‌పేట, వెల్జిపూర్, వల్లంపట్ల గ్రామాలు ఉండగా, ఒక్కో గ్రామానికి గంట చొప్పున వరుసగా సరఫరా చేస్తామని సెస్ సిబ్బంది గ్రామాల వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్‌లు పెడుతున్నారు.
గంభీరావుపేట, జూలై 16: కరెంట్ కోతలు, లో వోల్టేజీ సమస్యలపై కర్షకులు కన్నెర్రజేశారు. బుధవారం గంభీరావుపేటలో ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ‘ఇవేం కోతలు.. మాకెందుకీ వెతలు’ అని నిలదీశారు. రోజుకు 18 గంటలు కరెంట్ ఇవ్వాల్సిన అధికారులు, 12 గంటలకు కుదించారని, అందులోనూ తరచూ కట్ చేస్తున్నారని వాపోయారు. పవర్ ఎప్పుడు వస్తుందో.. పోతుందో తెలియడం లేదని, వచ్చినా లో ఓల్టేజీ సమస్యలతో పొలాలు తడువడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంట్ కోసం రాత్రి, పగలు బోరు బావుల వద్ద పడిగాపులు కాస్తున్నామని, లో ఓల్టేజీతో మోటర్లు కాలిపోతున్నాయన్నారు. సాగుకు లోఓల్టేజీ లేకుండా 18 గంటల పాటు నిరంతరంగా నాణ్యమైన కరెంట్ అందించాలని, లేదంటే ప్రభుత్వానికి తగిన బుద్ది చెబుతామని స్పష్టం చేశారు. ఏఈ ఆనంద్‌కుమార్ అక్కడికి చేరుకున్నారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారం రోజుల్లో పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఆందోళనలో రైతులు గంట శ్రీనివాస్, అశోక్, ప్రసాద్‌రెడ్డి, కమలాకర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, రాజయ్య, రాజు, ప్రతాపరెడ్డి, చిలుక రాజు, ముత్యంరావు, ఫూల్యనాయక్, రాజిరెడ్డి, మల్లయ్య, కాట శ్రీనివాస్ ఉన్నారు.
కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు. ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తున్నామని చెప్పడమే తప్ప 14 గంటల కరెంట్ కూడా సక్కగా ఇస్తలేదు. కరెంటు సక్కగా ఉండకపోవడంతో పొలాలన్నీ ఎండిపోయే పరిస్థితి ఉన్నది. కోతలు లేకుండా ఇవ్వాలి.
రోజుకు పదిసార్లు కరెంటు పోతున్నది. మడి పారేలోపే కరెంట్ పోవడం, పారిన మడి మళ్లీ పారడంతో చివరి వరకు నీళ్లు అందక పొలం ఎండుతున్నది. ఒకవైపు కోతలు, మరోవైపు ఎండలు ఎక్కువగా ఉండటంతో పొలాలు ఎండిపోతున్నాయి. కోతలు లేకుండా కరెంటు సరఫరా చేయాలి.