కరీంనగర్ కార్పొరేషన్, జనవరి 25 : కాంగ్రెస్ ప్రభుత్వం ఇతర పార్టీల నాయకులు, ప్రజలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ పాలన సాగిస్తున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. శనివారం కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెడగపల్లి సింగిల్ విండో చైర్మన్ రమణారావుతో కలిసి ఆయన మాట్లాడారు. ధర్మపురి నియోజకవర్గంలో 12 కో ఆపరేటివ్ సొసైటీలు ఉండగా ఆరింటిలో అవినీతి జరిగిందంటూ స్థానిక ఎమ్మెల్యే లక్ష్మణ్‌కుమార్ ఫిర్యాదు చేస్తే ఒకే రోజులో ప్రిన్సిపల్ సెక్రటరీ రిజిస్ట్రార్‌కు లేఖ రాయడం, అక్కడి నుంచి డీసీవో రావడం, వెంటనే విచారణ అధికారులను నియమించడం పూర్తి చేశారని తెలిపారు. అయితే, పదేళ్ల ఆడిట్‌ను ఇద్దరు అధికారులే వారం రోజుల్లోనే ఎలా పరిశీలిస్తారని ప్రశ్నించారు.
సంఘాల్లో ఉన్న నాయకులు ఇతర పార్టీలకు పని చేశారన్న అక్కసుతో కక్ష సాధింపులకు దిగుతున్నారని దుయ్యబట్టారు. ఎలాంటి రికార్డులూ చూడకుండా డీసీవో షోకాజ్ నోటీసులు ఇవ్వడాన్ని హైకోర్టు తప్పు పట్టిందని, కేవలం రాజకీయంగా ఒత్తిళ్ల మేరకు జరిగిందని, ఇలా చేయడం సరికాదంటూ తీర్పు ఇచ్చిందన్నారు. దీనిని తాము స్వాగతిస్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తన కక్ష సాధింపు తీరును మార్చుకోవాలని హితవు పలికారు.
సంఘాల్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని సింగిల్ విండో చైర్మన్ రమణారావు విమర్శించారు. తమ వద్ద పదేళ్ల నుంచి పూర్తిస్థాయిలో ఓచర్లు ఉన్నాయన్నారు. వీటిని కనీసం పరిశీలించకుండానే డీసీవో నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. డీసీఓలు తమ జనరల్ బాడీ సమావేశాలకు రమ్మంటే కూడా రావడం లేదన్నారు. 19వేల చదరపు మీటర్ల భవన నిర్మాణానికి 3.50 కోట్ల వ్యయం అవుతుందన్న అంచనా వేసిన తాము 2.50 కోట్లతోనే పూర్తి చేశామని తెలిపారు.
ఇందులో 1.87 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారని, వీటికి సంబంధించి ఆయా సంస్థలకు చెల్లించిన రసీదులు ఉన్నాయన్నారు. ఇంత విశాలమైన భవనాన్ని 40 లక్షల్లోనే ఎవరైనా నిర్మిస్తారా..? అని ప్రశ్నించారు. తాము ఏమీ చేయకున్నా తప్పుడు అట్రాసిటీ కేసులు పెడుతున్నారని విమర్శించారు. కనీసం మానవ సంబంధాలు కూడా లేకుండా మాట్లాడితే తప్పు అనే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, మాజీ మేయర్ రవీందర్‌సింగ్, నాయకులు రఘవీర్‌సింగ్, పెండ్యాల మహేశ్, గుంజపడుగు హరిప్రసాద్ పాల్గొన్నారు.