Rasamayi Balakishan | ఇల్లంతకుంట, జూలై 8 : ప్రతీ బీఆర్ఎస్ కార్యకర్తను తాను కంటికి రెప్పలా కాపాడుకుంటానని, ప్రజలను, ప్రభుత్వ నిధులను దోచుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. ఇల్లంతకుంట మండల కేద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీపల్లె నర్సింహారెడ్డి అధ్యక్షతన సోమవారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రసమయి మాట్లాడుతూ మానకొండూరు నియోజకవర్గం గతంలో అభివృద్ధిలో పరుగుపెట్టిందని, గతంలో మంజూరైన పనులను కొనసాగించకుండా వాటిని అన్నింటిని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని మండిపడ్డారు. పొత్తూర్ నుండి గుండ్లపెల్లి, బెజ్జెంకి నుండి బేగంపేట గ్రామాల మధ్య డబుల్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
ఈ పనులను చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న ఉదయం 10గంటలకు చలో బైక్ ర్యాలీ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. కావున బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, వివిధ అనుబంద సంఘాల ప్రతినిధులు, యువకులు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.
రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఎవరూ అధైర్యపడొద్దని, త్వరలో మన ప్రభుత్వమే వస్తుందని, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ సిద్దం వేణు, మాజీ ఎంపీపీ లింగాల నిర్మల లక్ష్మణ్, బీఆర్ఎస్ నాయకులు పాకాల మహిపాల్ రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.