ఒకేసారి రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ సర్కారు విడుతల వారీగా కూడా పూర్తి స్థాయిలో చేయలేక పోతోంది. మాఫీ జరుగుతుందని ఎదురు చూస్తున్న రైతులకు నిరాశే ఎదురవుతున్నది. దీంతో బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు రీ షెడ్యూల్ చేసుకోలేని పరిస్థితి వస్తున్నది. అర్హులని తేలినా రైతులకు చివరి నాలుగో విడుతలోనూ ప్రభుత్వం పూర్తి స్థాయిలో మాఫీ చేయలేక పోయింది. ఐదో విడుత ఉంటుందని అధికారులు చెబుతున్నా రైతులు మాత్రం నమ్మడం లేదు. దీంతో రైతాంగం రుణమాఫీ అవుతుందో లేదో అనే మీమాంసలో పడ్డది.
కరీంనగర్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులందరికీ ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని నమ్మించిన కాంగ్రెస్ ప్రభుత్వం విడుతల వారీగా చేపట్టింది. ఇప్పటి వరకు నాలుగు విడుతల్లో రుణమాఫీ చేసినా పూర్తి స్థాయిలో చేయలేక పోయింది. ఒక్క కరీంనగర్ జిల్లాలో మూడు విడుతల్లో 71,102 మంది రైతులకు రూ.546.26 కోట్లు మాఫీ చేయగా తాజాగా, నాలుగో విడుతలో 9,267 మందికి రూ. 84.01 కోట్లు మాఫీ చేసింది. మొత్తంగా నాలుగు విడతల్లో 80,369 మంది రైతులకు సంబంధించిన రూ.630.26 కోట్లు మాఫీ అయినట్లు అధికారుల గణాంకాలను బట్టి తెలుస్తోంది. నిజానికి రుణమాఫీ జరిగిన మొదట్లో తమ పేర్లు రాలేదని వేలాది మంది రైతులు ఆందోళన చేపట్టారు.
ఈ నేపథ్యంలో కొందరికి రేషన్ కార్డు లేక పోవడంతో కుటుంబ సభ్యుల నిర్ధారణ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం వ్యవసాయశాఖ అధికారులతో సర్వే చేయించింది. ఇందులో 14,110 మంది రైతుల కుటుంబ సభ్యుల నిర్ధారణ జరిగింది. వీరంతా కూడా రూ.2 లక్షల లోపు రుణం తీసుకున్న రైతులు కాగా, నాలుగో విడుతలో మాఫీ వర్తిస్తుందని ఆశించగా కేవలం 9,267 మందికి మాత్రమే వర్తించింది. కుటుంబ సభ్యుల నిర్ధారణ జరిగిన ఇంకా 4,843 మందికి మాఫీ కావాల్సి ఉంది. నిజానికి ఇంతకంటే ఎక్కువ మంది రైతులకు మాఫీ వర్తించాల్సి ఉంది. ఇప్పటికీ వందలాది మంది రైతుల వివరాలు రుణమాఫీ జాబితాలో గల్లంతయ్యాయి. కలెక్టరేట్లో గ్రీవెన్స్‌సెల్ నిర్వహించిన సమయంలో ఈ సమాచారం రైతులకు తెలియక చాలా మంది తమ పేర్లు నమోదు చేయించుకోలేక పోయారు. రూ.2 లక్షలలోపు రుణం తీసుకున్న రైతుల్లో చాలా మంది ఇప్పుడు నష్టపోవాల్సిన పరిస్థితి ఉంది. ఐదో విడుత వస్తుందని అధికారులు చెబుతున్నా కుటుంబ సభ్యుల నిర్ధారణ జరిగిన వారికి మాత్రమే వర్తించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగిలిన రైతుల పరిస్థితి ఇపుడు ఆగమ్యఘోచరంగా మారింది.
ఆది నుంచి గోప్యమే..
జిల్లాలో ఎంత మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు, రూ.2 లక్షలలోపు ఎంత మంది ఉన్నారు, ఆపైన ఎంత మంది తీసుకున్నారనే విషయాన్ని ప్రభుత్వం ఆది నుంచీ గోప్యంగా ఉంచుతోంది. ఈ వివరాలు ఇటు వ్యవసాయ శాఖలోగానీ అటు లీడ్ బ్యాంకులోగానీ అందుబాటులో లేవు. ఇక్కడి అధికారులను ఈ విషయం అడిగితే సీసీఎల్ఏ నుంచి పర్యవేక్షణ జరుగుతోందని, ఆ వివరాలు తమ వద్ద లేవని చెబుతున్నారు. నిజానికి జిల్లాలో 93 వేలకుపైగా రైతులు రుణాలు పొందినట్లు గతంలో అధికారులు ఇచ్చిన వివరాల ప్రకారం తెలుస్తోంది. ఇప్పుడు ఈ వివరాలను అధికారులు నిర్ధారించలేక పోతున్నారు.
ఈ లెక్కన చూస్తే మరో 12 వేల మంది రైతులకు రుణమాఫీ జరగాలి. ఒక వేళ ఐదో విడుత ఇచ్చినా కేవలం కుటుంబ సభ్యుల నిర్ధారణ జరిగిన కేవలం 4,843 మందికి ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. కాగా రూ.2 లక్షలకుపైగా రుణాలు తీసుకున్న రైతుల విషయంలోనూ రైతులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రూ.2 లక్షలలోపు తీసుకున్న రైతులకు సంబంధిన రుణాలను మాఫీ చేయడంలోనే ప్రభుత్వం ఇంతగా తాత్సారం చేస్తుంటే.. అంతకు మించి రుణాలు తీసుకున్న వారి గురించి పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదని వాపోతున్నారు. రుణమాఫీ కింద ప్రభుత్వం చెల్లించే రూ.2 లక్షలలోపు రుణం మినహాయించుకుని బ్యాంకుల్లో చెల్లించేందుకు వెళ్తున్న రైతులకు అక్కడ నిరాశే ఎదురవుతున్నది. ఒకేసారి పూర్తి మొత్తాన్ని చెల్లిస్తే తప్ప తీసుకునేది లేదని బ్యాంకర్లు తేల్చి చెబుతున్నారు. ఈ విషయంలో బ్యాంకులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలూ రాకపోవడంతో రూ.2 లక్షలకుపైగా రుణాలు తీసుకున్న రైతుల ఆశలు సన్నగిల్లుతున్నాయి.