korutla | కోరుట్ల, అక్టోబర్ 8: ప్రభుత్వ ఉపాధ్యాయులు కంప్యూటర్ అభ్యాసన ప్రక్రియను మెరుగు పరుచుకోవాలని జిల్లా విద్యాధికారి రాము అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, రశ్మీధర్ తేజ బీఎడ్ కళాశాలలో రాయికల్, కథలాపూర్, కోరుట్ల, భీమారం, మేడిపల్లి మండలాల గణిత ప్రభుత్వ ఉపాధ్యాయులకు డిజిటల్ లిటరసీపై శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ కంప్యూటర్ ఆధారిత శిక్షణను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. బోధన, వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని పేర్కొన్నారు. డిజిటల్ లిటరసీ కార్యక్రమాన్ని ప్రతీ పాఠశాలలో నిర్వహించాలని సూచించారు. ప్రతీ విద్యార్థిపై శ్రద్ధ వహించాలని, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు పోటీ ప్రపంచంలో ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా కృషి చేయాలన్నారు.
అనంతరం కోడింగ్, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, గణిత పాఠ్యాంశాలకు సంబంధించి కంప్యూటర్ శిక్షను రిసోర్స్ పర్సన్లు అందించారు. కార్యక్రమంలో జిల్లా సెక్టోరియల్ అధికారి రాజేష్, మండల విద్యాధికారి మధు, ప్రధానోపాధ్యాయులు గంగాదర్, సదాశివ్, టెక్నీకల్ ఇంచార్జ్ నాగరాజు, రిసోర్స్ పర్సన్స్ రాజగోపాల్, రాజగోపాల్ రెడ్డి, సంతోష్, శ్రీకాంత్, శ్రీనివాస్, సీఆర్పీలు గంగాధర్, మాన్విత, జ్యోతి, దేవేందర్, సత్యనారాయణ పాల్గొన్నారు.