పెద్దపల్లి, సెప్టెంబర్23: ‘మా ఇండ్లు మాకు ఇవ్వండి. కలెక్టర్ సారూ మా గోడు వినండి. సత్వరమే మాకు న్యాయం చేయండి’ అంటూ రామగుండం నియోజకవర్గంలోని డబుల్ బెడ్రూం లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు వేడుకున్నారు. సోమవారం పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ, దినసరి కూలీగా పనులు చేసుకుంటూ బతుకు వెల్లదీస్తున్నామని, ఏండ్ల తరబడి అద్దె ఇండ్లలో ఉంటూ కిరాయిలు చెల్లించలేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని వాపోయారు.
జిల్లా కేంద్రంలో లబ్ధిదారులకు ఇండ్లు కేటాయించారని, కానీ రామగుండంలో ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం జంగల్లపల్లి ఎన్టీపీసీలో 660 డబుల్ బ్రెడూం ఇండ్ల నిర్మాణాలు చేపట్టి, లబ్ధిదారులను ఎంపిక చేసిందని గుర్తు చేశారు. డ్రా ద్వారా ఎంపికైన తమకు ఇండ్లు సత్వరమే మంజూరు చేయించి, పట్టాలు పంపిణీ చేయాలని కోరారు. అనంతరం కలెక్టర్ కోయ శ్రీహర్ష లబ్ధిదారులతో మాట్లాడారు.
రామగుండం నియోజక వర్గంలో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ గురించి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, చిన్నచిన్న పనులు మిగిలి ఉండడంతో ఆలస్యం అవుతున్నదని చెప్పారు. నెల రోజుల్లో పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తామని, అప్పటి దాకా ఒపిక పట్టాలని సూచించారు. ఆందోళనలో లబ్ధిదారులు అశోక్, శంకర్, ఎం దేవేందర్, ఎం రమేశ్, ఎం సుజాత, సంపత్, ఈ శ్రీనివాస్, చోటి బేగం, బానోత్ లక్ష్మి, మహేందర్, మాధవి, చాయ, ఎం సుజాత, ఏ అనురాధ, గోపి, హుస్సేన్, రాజేశ్ ఉన్నారు.