Bhimeshwara Temple | వేములవాడ, డిసెంబర్ 11 : గ్రామ పంచాయతీ ఎన్నికలు రాష్ట్రంలో మొదటి విడత గురువారం జరగగా వేములవాడ పట్టణంలోని ప్రధాన వీధులు నిర్మానుష్యాన్ని తలపించాయి. దాదాపు రెండు సంవత్సరాల ఆలస్యంగా గ్రామపంచాయతీ పాలకవర్గానికి ఎన్నికలు నిర్వహించడంతో గ్రామాలకు పట్నం వాసులు తరలి వెళ్లారు. ఓటు హక్కు వినియోగించడంతోపాటు బంధువులు స్నేహితుల గెలుపులో తమ వంతు కృషి చేసేందుకు పెద్ద ఎత్తున తరలి వెళ్లడంతో పట్టణాలు ప్రశాంతంగా కనిపించాయి.
వేములవాడ పట్టణంలో ప్రధాన రహదారుల్లోని దుకాణాలు దాదాపు మధ్యాహ్నం వరకు కూడా తెరుచుకోలేదు. తీసిన దుకాణాలకు కూడా బోనీ కాకపోవడంతో తిరిగి మధ్యాహ్నం తర్వాత బంద్ చేసుకొని గ్రామాలకు వెళ్లిన పరిస్థితులు కనిపించాయి. మరోవైపు పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ ప్రజలు లేక కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించాయి.
భక్తులు లేక వేలవేల బోయిన భీమేశ్వర ఆలయం
ప్రతీరోజు భక్తులతో సందడిగా ఉండే రాజన్న భీమేశ్వర ఆలయాలు గురువారం వేలవేల బోయాయి. పంచాయతీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇటు రాజన్న, భీమేశ్వర ఆలయంలోని క్యూ లైన్లు, ఆలయ పరిసరాలు పూర్తిగా నిర్మానుష్యాన్ని తలపించాయి.