JAMMIKUNTA | జమ్మికుంట, మే 3: కేంద్ర ప్రభుత్వం వెంటనే కాల్పుల విరమణ ప్రకటించాలని, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని శాంతి చర్చల కమిటీ చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారు. జమ్మికుంట పట్టణంలోని వినాయక గార్డెన్లో మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో శాంతి చర్చల ఆవశ్యకతపై శనివారం సదస్సు నిర్వహించారు.
ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా జస్టిస్ చంద్రకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ఆదివాసులకు ప్రత్యేక హక్కులు రాజ్యాంగం కల్పించిందని, కేంద్ర ప్రభుత్వం వారి హక్కులను విఘాతం కలిగించవద్దని కోరారు. కేంద్ర ప్రభుత్వం, మావోయిస్టులకు మధ్య చర్చలు జరిపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
మావోలు చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం బలగాలను మోహరించి చంపి వేయడమే లక్ష్యంగా ముందుకు సాగడం ధర్మం కాదన్నారు. మావోలతో చర్చలు జరపాల్సిందేనని బలగాలను వెంటనే వెనక్కి తెప్పించాలని డిమాండ్ చేశారు. శాంతి చర్చల ప్రక్రియ కోసం అన్ని వర్గాలు గొంతు విప్పాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పలు పార్టీల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.