రామడుగు, మార్చి 30: కేంద్రమే వరి ధాన్యం కొనుగోలు చేయాలని రామడుగు పీఏసీఎస్ చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయంలో బుధవారం ఆయన అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీర్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేసి కేంద్రానికి పంపితే, ఏడాది తర్వాత సంబంధిత నగదును కేంద్రం అందిస్తోందన్నారు. దీంతో రాష్ట్రంపై తెచ్చిన రుణానికి రెట్టింపు వడ్డీతో పెను భారం పడుతోందన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి ఇతర రాష్ర్టాలకు తరలించాలన్నా, విదేశాలకు ఎగుమతి చేయాలన్నా కేంద్ర ప్రభుత్వమే అనుమతులు ఇవ్వాలన్నారు. అటు ఎలాంటి అనుమతులు ఇవ్వకుండా, ఇటు ధాన్యం కొనుగోలు చేయకుండా రైతుల జీవితాలతో కేంద్రం చెలగాటం ఆడుతున్నట్లు పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో మునుపెన్నడూ లేనివిధంగా ధాన్యం దిగుబడులు వస్తున్నాయన్నారు. కేంద్రం మెడలు వంచి తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా ఉద్యమం చేపట్టాలన్నారు. మండల కేంద్రంలో రూ. 23 లక్షలు, వెదిరలో రూ. 24 లక్షలతో గోదాముల నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. త్వరగా పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తెస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా సహకార సంఘం అభివృద్ధి కోసం కృషి చేసిన పాలకవర్గ సభ్యులు, రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. నాణ్యమైన ఉచిత విద్యుత్, పుష్కలమైన సాగునీటి వనరులను అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కాగా, కేంద్రమే ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల మద్దతుతో పీఏసీఎస్ పాలకవర్గ సభ్యులు ఐక్యంగా తీర్మానం చేశారు. అంతకుముందు కార్యాలయ కార్యదర్శి మల్లేశం 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ జమ, ఖర్చుల వివరాలు చదివి వినిపించారు. ఖర్చుల స్టేట్మెంట్లో జమ, ఖర్చుల ప్రారంభ, ముగింపు నిల్వలను వివరించారు. ప్రస్తుతం 2022-23 ఆర్థిక సంవత్సరానికి అంచనా బడ్జెట్ రూ. కోటి 8 లక్షల 63 వేలు ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో ఎంపీపీ కలిగేటి కవిత, కొక్కెరకుంట సింగిల్ విండో చైర్మన్ వొంటెల మురళీకృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ గంట్ల రవీందర్‌రెడ్డి, నోడల్ అధికారి మహ్మద్ అక్బర్, గోపాల్రావుపేట కేడీసీసీ బ్యాంక్ మేనేజర్ రమేశ్, పాలకవర్గ సభ్యులు గోనెపెల్లి లచ్చయ్య, ద్యావ అనంతరెడ్డి, గజ్జెల ఆనందరావు, తాడెం మల్లయ్య, కొమురయ్య, ఎల్లా విజయ, మ్యాకల కమల, చిమ్మల్ల తిరుపతి, వూట్కూరి అనిల్‌కుమార్‌రెడ్డి, కే వెంకటేశం, మానుపాటి లచ్చయ్య, ఏఎంసీ చైర్మన్ గంట్ల వెంకటరెడ్డి, ఆర్బీఎస్ జిల్లా కో-ఆర్డినేటర్ గర్రెపెల్లి కరుణాకర్, సర్పంచులు బండ అజయ్‌రెడ్డి, ఎల్లయ్య, ఎంపీటీసీ వంచ మహేందర్‌రెడ్డి, రైతులు, తదితరులు పాల్గొన్నారు.