Ramagundam | కోల్ సిటీ, ఏప్రిల్ 5 : బోర్డులు పాతారు సరే.. మరి ఇప్పటివరకు ప్రభుత్వ స్థలాలకు కబ్జాలకు పాల్పడిన వారిపై చర్యలేవి అని పలువురు రామగుండం రెవెన్యూ అధికారులను ప్రశ్నిస్తున్నారు. కాగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ భూముల ఆక్రమణ పై అధికారులు దృష్టి సారించారు. ఈ మేరకు శనివారం రామగుండం తహసిల్దార్ కుమారస్వామి ఆధ్వర్యంలో పలు డివిజన్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములలో హెచ్చరిక బోర్డులు పాతారు.
నగరపాలక సంస్థ పరిధిలోని జనగామ, అల్లూరు, రామగుండం తదితర ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములలో ఈ బోర్డులను ఏర్పాటు చేశారు. ఎవరైనా ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తహసిల్దార్ హెచ్చరించారు. రెవెన్యూ అధికారుల చర్యల పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అయితే రామగుండం మున్సిపల్ పరిధిలో ఇదివరకే చాలా చోట్ల ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయని, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకోవడమే కాకుండా భాజప్తు గా నిర్మాణాలు కూడా చేపట్టారని, పలు చోట్ల నాలాలను కూడా కబ్జా చేశారని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటే బాగుంటుందని ప్రజాసంఘాల నాయకులు రెవెన్యూ అధికారులను కోరుతున్నారు.